.
టీవీల్లో తరచూ ఓ డైలాగ్ వినిపిస్తూ ఉంటుంది… మీ దుంపల్ తెగ, యాణ్నుంచి తయారయ్యార్రా మీరంతా…
జీతెలుగులో వచ్చే సినిమా పాటల కంపిటీషన్ తాజా ప్రోమో ఒకటి చూస్తుంటే సరిగ్గా అదే డైలాగ్ గుర్తొచ్చింది…
Ads
చివరకు ఈ పాటల పోటీలను (మ్యూజిక్ కంపిటీషన్ అనే మాట పొరపాటున కూడా వాడటం లేదని గమనించగలరు…) మరీ ఈటీవీ ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీల రేంజుకు తీసుకుపోయారు… మొన్నామధ్య చెప్పుకున్నాం కదా ఈటీవీలో కాస్త పద్ధతిగా నడిచే పాడుతా తీయగా షోలో కూడా జడ్జిలకు రెట్రో డ్రెస్సులు తొడిగి స్టెప్పులు వేయించారని…
జీతెలుగులో వచ్చే సరిగమప గతంలో బాగానే ఉండేది పాపం,.. తరువాత దాన్ని ఓ సగటు టీవీ సరదా పర్‌ఫామెన్స్ షోగా మార్చేశారు… మెంటార్లు అని, జడ్జిలు అని ఆరేడుగురు సెలబ్రిటీలను కూర్చోబెట్టి… ప్రదీప్ పంచులు, శ్రీముఖి అరుపులతో హోస్టింగ్ జతచేసి… కంటెస్టెంట్లతో ఆటలు కూడా…
తరువాత చివరాఖరికి అనంత శ్రీరామ్ బాపతు సర్కస్ ఫీట్ల దాకా ఎదిగిపోయింది ఆ షో… ఈసారి కోటి, కాసర్ల, శైలజ జడ్జిలు… మెంటార్లుగా రమ్య, రేవంత్ కనిపిస్తున్నారు… ఇంకా ఎవరెవరో ఉన్నారు కూడా… మధ్యలో జిమ్మాస్టిక్ గంతులేస్తూ అనంత శ్రీరామ్ ఓ ఎపిసోడ్‌కు వచ్చిపోయాడు…
ఈ తాజా ప్రోమో మరీ అరాచకం… ఒకవైపు ఇద్దరేసి గాయకులు పాడుతుంటారు… ఆ పక్కనే ప్రొఫెసనల్ డాన్సర్లు రికార్డింగ్ డాన్స్ చేస్తుంటారు… ఇందులో సింగింగ్ కంపిటీషన్, శృతి, లయ, సంగతులు ఎట్సెట్రా పరిశీలన ఏమీ ఉండదు… ఎవరెంత జోష్‌తో ఎలాంటి పాట పాడారనేదే ముఖ్యం…
చివరకు కోటి, శ్రీముఖి ‘కిస్సిక్’ స్టెప్పులు కూడా ఉన్నాయి… సినిమాలో కసిక్కు అంటే శ్రీలీల, జీసరిగమప కసిక్కు అంటే శ్రీముఖి అట, కోటి వ్యాఖ్య… షోకు ఎవరెవరినో పట్టుకొచ్చారు… వాళ్లూ టీవీ, సినిమా సెలబ్రిటీలట… ఒకరిద్దరికి స్టేజీ పైనే ముద్దుల పోటీ పెట్టింది శ్రీముఖి… వాళ్లూ ‘ఫర్‌ఫామెన్స్’ ఇచ్చారు…
అభిజ్ఞ అని వర్జీనియా నుంచి వచ్చింది కదా ఓ అమ్మాయి… ఆహా ఓటీటీలో తెలుగు ఇండియన్ ఐడల్‌కు సెలక్ట్ కాకపోతే, పట్టుబట్టి, వైల్డ్ కార్డ్ ఎంట్రీలా ఎలాగోలా వచ్చి, చివరకు థమన్ టీం ద్వారా మధ్యలోనే వెళ్లగొట్టబడిన గాయని… బాగానే పాడుతుంది… జీసరిగమపలోకి వచ్చి ఈ పిచ్చి పాటల పోటీలో పాడుతోంది… హేమిటో ఫాఫం… దీనికోసమా అంత దూరం నుంచి రావడం…?
ఆహా ఇండియన్ ఐడల్‌లో మధ్యలోనే నిష్క్రమించిన మరో అమ్మాయి కూడా కనిపిస్తోంది… పేరు తెలియదు… పాడుతా తీయగా, ఇండియన్ ఐడల్ షోలలో మ్యూజిషియన్స్ కనిపిస్తుంటారు… అదేమిటో జీసరిగమపలో వాళ్ల జాడే కనిపించదు… కొంపదీసి ట్రాకులతోనే నడిపించేస్తున్నారా ఏమిటి..? ఈమాత్రం దానికి సరిగమప పేరు దేనికి..? శ్రీదేవి డ్రామా కంపెనీ అన్నట్టుగానే శ్రీముఖి డ్రామా కంపెనీ అని పేరు పెట్టేస్తే పోలా..!!
Share this Article