.
ఒక భారతీయుడి పేరు.. ఇప్పుడు ప్రపంచమంతా ఎకో సౌండ్ లో వినిపిస్తోంది. మీడియా ఛానల్స్ హెడ్ లైన్స్ లో హోరెత్తిస్తున్నాయి. పత్రికలు పతాక శీర్షికలకెక్కించాయి. ఎందుకంటే.. అతడు సాధించింది అట్లాంటిట్లాంటి విజయం కాదుగనుక. చెస్ చరిత్రలోనే చారిత్రాత్మక విజయం సాధించాడుగనుక. గ్యారీ కాస్పరోవ్ అంతటి చెస్ ఛాంపియన్ పేరిట ఉన్న గ్రాండ్ మాస్టర్ రికార్డును బద్ధలు కొట్టాడుగనుక. పుట్టింది చెన్నై అయినా.. మన తెలుగోడు గనుక.. ఒక్కసారి గూస్ బంప్స్ తెప్పించే అతగాడి విజయ ప్రస్థానమే ఈ కథనం.
39 ఏళ్ల కింద ప్రపంచ చెస్ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్ నెలకొల్పిన రికార్డును… ఇన్నాళ్లకు మన 18 ఏళ్ల గుకేష్ దొమ్మరాజు తిరగరాశాడు. 1985లో రష్యన్ కాస్పరోవ్ 22 ఏళ్ల వయస్సులో ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ కిరీటాన్ని గెల్చుకుంటే… 18 ఏళ్లకే ఆ రికార్డును చెరిపేసి చరిత్ర సృష్టించాడు. చైనాకు చెందిన మాజీ ఛాంపియన్ డింగ్ లిరెన్ ను ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ -2024లో పోటీల్లో భాగంగా… 14వ రౌండ్ లో మట్టికరిపించి… క్లాసికల్ చెస్ లో ప్రపంచ ఛాంపియన్ గా జయకేతనమెగురేశాడు.
Ads
చెన్నైకి చెందిన గుకేష్ భారత్ నుంచి ప్రపంచ చెస్ టైటిల్ గెల్చుకున్న రెండో గ్రాండ్ మాస్టర్. విశ్వనాథన్ ఆనంద్… 2007 నుంచి ఆరేళ్లపాటు తిరుగులేని ప్రపంచ ఛాంపియన్ గా కొనసాగగా.. ఇప్పుడు, గుకేష్ రెండో గ్రాండ్ మాస్టర్ గా ప్రపంచ చెస్ దిగ్గజాలను అబ్బురపర్చాడు.
ఒకసారి పరిశీలిస్తే… రష్యాకు చెందిన గ్యారీ కాస్పరోవ్ 22 ఏళ్ల 210 రోజుల వయస్సులో అనటోలీ కార్పోవ్ ను 1985లో ఓడించగా.. ఆ తర్వాత 2013లో నార్వేకు చెందిన మ్యాగ్నస్ కార్ల్ సన్ 22 ఏళ్ల 357 రోజుల్లో చెన్నై వేదికగా విశ్వనాథన్ ఆనంద్ ను ఓడించి.. 2022 వరకూ ప్రపంచ చెస్ ఛాంపియన్ గా కొనసాగాడు. ఈ జాబితాలో అంతకుముందు మిఖాయిల్ తాల్, అనటోలీ కార్పోవ్, వ్లాదిమిర్ క్రామ్నిక్ వంటి రష్యా దేశ ఆటగాళ్ల హవానే చెస్ లో కొనసాగింది. ఇప్పుడా రికార్డులన్నీ బద్ధలై… ఏకంగా నాల్గేళ్ల తేడాతో… 18 ఏళ్లకే గుకేష్ సాధించిన విజయం రాబోయే తరాలవారికి కూడా ఓ సవాల్ గా, అందుకోవాల్సిన ఓ మైల్ స్టోన్ గా నిల్చిపోవడం విశేషం.
చెన్నై నుంచి గ్లోబల్ స్టార్‌డమ్ వరకు!
2006, మే 29న చెన్నైలో జన్మించిన గుకేశ్ దొమ్మరాజుది ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యావంతుల కుటుంబం. చెన్నైలో సెటిలైన తండ్రి డాక్టర్ రజనీకాంత్ ఈఎన్టీ సర్జన్. తల్లి పద్మ మైక్రోబయాలజిస్ట్. గుకేష్ చెస్ ప్రయాణానికి జస్ట్ ఏడేళ్ల వయస్సులో బీజం పడింది. తను చదువుతున్న వేలమ్మాళ్ పాఠశాలలో కోచ్ అయిన భాస్కర్.. గుకేష్ ప్రతిభను గుర్తించడంతో… చెస్ లో గుర్రం వలే పరిగెత్తిన గుకేష్… మంత్రిలా ఆలోచిస్తూ… ఈరోజు లిరేన్ ను ఓడించి చెస్ కింగయ్యాడు.
జస్ట్ 12 ఏళ్ల 7 నెలల 17 రోజుల వయస్సులోనే భారతదేశ చరిత్రలో గ్రాండ్ మాస్టరనిపించుకున్న పిన్న వయస్కుడు కూడా గుకేషే. ప్రపంచవ్యాప్తంగా చిన్నవయస్సులో గ్రాండ్ మాస్టర్ అయినవారిలో మూడోవాడిగా అప్పుడే గుర్తింపు సాధించాడు.
తల్లిదండ్రుల ప్రోత్సాహమే… గుకేష్ విజయానికి ముందడుగు!
గుకేష్ కు చెస్ పై ఉన్న గురి, ఏకాగ్రతను గమనించిన తల్లిదండ్రుల ప్రోత్సాహానికి తోడు.. తాను చదువుతున్న స్కూల్ కోచ్ భాస్కర్ సాయంతో చెస్ ను ఓ ప్రొఫెషనల్ లా నేర్చుకున్నాడు. ఓవైపు చదువుకుంటూనే.. వారానికి మూడురోజుల పాటు చెస్ ప్రాక్టీస్ పై దృష్టి పెట్టేవాడు. అలా 2013 నుంచి ప్రాక్టీస్ తో పాటు.. చిన్న చిన్న టోర్నమెంట్స్ లో పాల్గొంటూ వచ్చాడు. ఇక 2015 నుంచి గుకేష్ ఓ ప్రొఫెనల్ చెస్ ప్లేయర్ గా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు.
అండర్-9 సెక్షన్ ఏసియన్ స్కూల్ చెస్ ఛాంపియన్ గా, వరల్డ్ యూత్ చెస్ ఛాంపియన్ గా ప్రారంభమైన తన కెరీర్.. 2017లో క్యాపెల్లే లా గ్రాండ్ ఓపెన్ లో ఇంటర్నేషనల్ మాస్టర్ గా ఎదిగేవరకూ ఏకధాటిగా సాగింది. ఇక 2019, జనవరి 15న అత్యంత పిన్నవయస్కుడైన రెండో గ్రాండ్ మాస్టర్ గా రికార్డ్ నెలకొల్పాడు. అయితే, ఆ రికార్డును అభిమన్యు మిశ్రా బీట్ చేసేవరకూ కూడా గుకేషే రెండో పిన్న వయస్కుడైన గ్రాండ్ మాస్టర్.
గుకేష్ ప్రయాణంలో మైలురాళ్లు!
44వ చెస్ ఛాంపియన్ షిప్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన గుకేష్… యూఎస్ పై భారత్ చారిత్రాత్మక విజయానికి నాంది పలికాడు. 45వ చెస్ ఒలింపియాడ్ లో భారత్ కు డబుల్ స్వర్ణం సాధించడంలో కీలకపాత్ర వహించిన గుకేష్… ఏకంగా 9 విజయాలు, 1 డ్రాతో దూకుడు ప్రదర్శించాడు.
రికార్డ్ బ్రేకింగ్ గ్రాండ్ మాస్టర్ గా గుకేష్ పేరు!
ప్రపంచ నంబర్ వన్ గా కొనసాగుతున్న మాగ్నస్ కార్ల్‌సెన్ పై 2022లో గెల్చి.. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ అయిన FIDE ఇచ్చిన 2700 రేటింగ్ ను అధిగమించిన అతి పిన్న వయస్కుడిగా అవతరించాడు గుకేష్. ఇక 2024 ఇప్పుడు గుకేష్ కు మరింత తేజోవంతమైన సంవత్సరంగా మారింది. అగ్రశ్రేణి భారత గ్రాండ్ మాస్టర్స్ గా ఉన్న ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతీని ఓడించి క్యాండిడేట్స్ టోర్నమెంట్ లో గెల్చిన పిన్న వయస్కుడిగా కూడా ఇదే ఏడాది గుకేష్ రికార్డులకెక్కాడు.
ఇప్పుడేకంగా ప్రపంచ ఛెస్ ఛాంపియన్ గా గెల్చి.. తన చెస్ ప్రస్థానానికి మెంటార్ గా, మార్గదర్శిగా భావించిన విశ్వనాథన్ ఆనంద్ ను అధిగమించి.. తన 37 ఏళ్ల రికార్డులను గుకేష్ బద్ధలు కొట్టి భారత చదరంగమంటే ఏంటో ప్రపంచానికి చూపెట్టాడు. అయితే, గుకేష్ విజయంలో తల్లిదండ్రులు, అతడి కోచ్ భాస్కర్ తో పాటు… విశ్వనాథన్ ఆనంద్ పాత్ర కూడా చెప్పుకోదగ్గది. ఆనంద్ చెస్ అకాడమీ వెస్ట్ బ్రిడ్జ్ లో తర్ఫీదు పొందిన గుకేష్ కు ఆనంద్ సలహాలు, సూచనలు మానసికంగా తనను సంసిద్ధం చేశాయి. తన అంతర్జాతీయ విజయాలకు సోపానమయ్యాయి.
భారతదేశం గర్వించదగ్గ గ్రాండ్ మాస్టర్ గా… అమెరికా, రష్యా, నార్వే వంటి దేశాలవారే చెస్ లో కింగ్స్ అనుకునే తరుణంలో ప్రపంచాన్నే నివ్వెరపర్చేలా చెస్ కింగ్ గా నిల్చాడు. పట్టుదల, మానసిక ఎదుగుదల ఉంటే వయస్సుతో సంబంధం లేకుండా వండర్స్ చేయొచ్చని నిరూపించాడు వండర్ బాయ్ గుకేష్… ( కథనం రమణ కొంటికర్ల )
Share this Article