.
ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ దర్శకుడు శివనాగేశ్వరరావుకు రాసిన ధన్యవాద లేఖ…
నాగేశ్వరరావు గారూ,
మంచి కామెడీ సినిమాలు తీసే దర్శకుడుగానే మీరు నాకు తెలుసు. కథని చాలా గొప్పగా విశ్లేషించారు. మరోలా చెప్పాలంటే నా కథకన్నా మీ విశ్లేషణ బాగుంది. బాలగంగాధర తిలక్ “నల్లజర్ల రోడ్డు” చదివాక ఈ కథ వ్రాయాలనిపించింది. ఆ దృష్టితో చూస్తే ఈ రెండు కథలు ఒకలాగే అనిపిస్తాయి. కృతజ్ఞతలు అనేది మీ పట్ల నాకు చిన్న మాట.
Ads
** ** **
ఉల్లిపాయ పొరల లోపల..
ప్రాణ స్నేహితుడు.. తోబుట్టువు.. విశ్వాసపాత్రుడు.. ఎన్నెన్ని బంధాలు మనకి! అన్నింటికీ మూలం మనలోని మంచితనమో, ప్రేమో! పరిశీలించి చూడగలిగితే మనకు అనుకూలంగా ఉన్న బంధాలే ఇష్టతను కలిగిస్తాయి. అనుకూలత కలిగించని వాటిని దూరం పెడతాం, లేదా దూరం అవుతాం. పొరలు విప్పే కొద్దీ ఇంతే! నచ్చిన వారిని ద్వేషించే పరిస్థితి రావచ్చు, ద్వేషించే మనుషుల్ని ప్రేమించే ఆలోచన పెరగొచ్చు.
యండమూరి వీరేంద్రనాథ్ అనగానే నవలలే గుర్తుకొస్తాయి. నవలల ద్వారా ఆయన్ని గుర్తుంచుకునే క్రమంలో.. ఆయన రాసిన మంచి మంచి కథలు ఎందుకో వెనక్కి వెళ్లాయి అనిపిస్తుంది. అలా మరుగున పడిన మంచి కథల్లో ఇదీ ఒకటి.
1992లో ఆంధ్రభూమిలో ప్రచురితమైన ఈ ‘ఉల్లిపాయ’ ఆయన రాసిన కథల్లో నాకు చాలా ఇష్టం. పేరు నుంచే ఒక ఉత్సుకతను మెయిన్‌టెయిన్ చేస్తూ చివరిదాకా ఆ బిగి సడలకుండా సాగడం ఈ కథలో విశేషం. ఇందులో మూడే పాత్రలు. థామస్, అతణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి, ఒక ముసలివాడు. ఇంతే!
“ఈ ప్రపంచంలో అన్నిటికన్నా అందమైన పక్షి ఏది?” అని క్లాసులో టీచర్ అడిగినప్పుడు, లేచి నిలబడి “కాకి” అన్నాను…
ఇలా మొదలవుతుంది కథ. అలా అలా రకరకాల అంశాల మేళవింపుతో సాగిపోతుంది. తన కథను తాను చెప్పుకుంటున్న అమ్మాయి థామస్‌తో కలిసి భద్రాచలం వెళ్లడం నుంచి కథ అసలైన దారిలో నడుస్తుంది. అంతకు ముందు చెప్పిన అంశాలన్నీ అందుకు నేపథ్యంగా మారతాయి.
వర్షం హోరు పెరిగి ఇక ముందుకు కారు ఇక ముందుకు కదలలేని స్థితిలో ఓ చోట ఆగింది వారి ప్రయాణం. ఎటూ తోచని చోట గుట్టపై కనిపిస్తుంది ఓ చిన్న గుడిసె.
అందులో ఉన్న వృద్ధుడు వారికి ఆశ్రయం ఇచ్చాడు. వాళ్లు దారి తప్పిన సంగతి చెప్పాడు. ఆ ఇరుకైన చోట ఇమడక తప్పని పరిస్థితిని ప్రకృతి కల్పించింది.
ఆ అమ్మాయికి అయోమయం, థామస్‌కి చిరాకు పెరిగిపోతున్నాయి. రాత్రికి అక్కడే ఉండక తప్పదు. ఆ వృద్ధుడికీ, అక్కడి వాతావరణానికి వాళ్లు అలవాటు పడ్డారు.
ఓ రాత్రి వేళ థామస్‌కి ఫిట్స్ వచ్చాయి. ఎప్పుడూ అతనిలో గమనించని కొత్త విషయాన్ని తొలిసారి చూసి షాక్ తింది ఆ అమ్మాయి. భయం లేదంటూ ముసలివాడు ఉల్లిపాయ ముక్కు దగ్గర పిండాడు. థామస్ కొంత తేలికపడ్డాడు. తాను ప్రేమించిన వ్యక్తిలోని ఓ సరికొత్త అంశాన్ని ఈ పరిస్థితిలో చూడటం ఆమెకు వింతగా ఉంది. ఏదో పొర విచ్చుకున్నట్టు అనిపించింది.
ఉదయం యథావిధిగా తెల్లారింది. వర్షం శాంతించింది. ఇంటికొచ్చిన వారి కోసం ఆ వృద్ధుడు చేయగలిగిన పనులన్నీ చేసి జ్వరం బారినపడ్డాడు. వెళ్లిపోదామంటూ థామస్ పట్టుబట్టాడు.
జ్వరంతో ఉన్న ఐతనికి కొంత అన్నం వండిపెట్టి వెళదామన్న ఆమె కోరిక అతనికి చిరాకు తెప్పించింది. ఓ వంద రూపాయలు ఆ వృద్ధుడికి ఇచ్చి హడావిడిగా కారులో ఎక్కి కూర్చున్నాడు.
బయలుదేరేంత లోపున ఆ వృద్ధుడు వచ్చి ఓ ఉల్లిపాయ ఇచ్చి దారిలో ఫిట్స్ వస్తే వాడమన్నాడు. థామస్ దాన్ని తీసి బయట పారేసి కారు పోనిచ్చాడు. ఆమె మనసులో శూన్యం నిండింది. కథ ముగిసింది.
ఏం అర్థమైంది? మన ప్రేమల వెనుక ఉన్న సత్యాన్ని అన్వేషిస్తే అది మనకు సౌకర్యం కలిగించిన స్థాయిని చూపుతుంది. మనం అభిమానించే వ్యక్తుల మీద ఇష్టం మన కంఫర్టబులిటీ లెవల్‌ని బట్టి పెరుగుతుంది. మనం ఏర్పరుచుకున్న బంధాలు మనకి అందుబాటులో, హాయిగా ఉన్నంత వరకే బాగున్నట్టు ఉంటుంది. అదుపు కాస్త తప్పినప్పుడు, ఉల్లిపాయ పొరలు తొలగించి చూసినప్పుడు ఆ అమ్మాయి మనసులో నిండిన శూన్యమే కనిపిస్తుంది. లోతైన కథ. గాఢమైన అర్థం! ……… – శివ నాగేశ్వరరావు.
Share this Article