.
పుష్పరాజ్ అరెస్టు వార్తలతో మీడియా, సోషల్ మీడియా హోరెత్తిపోయింది… ఈ వేడిలో సిద్ధార్థ్ నటించిన మిస్ యు సినిమాను ఎవడూ పట్టించుకోలేదు… అఫ్‌కోర్స్, పట్టించుకునేంత బజ్ లేదు, సినిమాలో కూడా అంత సరుకు లేదు…
నటుడిగా సిద్ధార్థ్ ఏమిటనేది పక్కన పెడితే, వ్యక్తిగత జీవనశైలి, వివాదాస్పద వ్యాఖ్యలతో బోలెడంత నెగెటివిటీని మూటగట్టుకున్నాడు… చివరకు పుష్పరాజ్ పాట్నా ప్రిరిలీజ్ షో మీద కూడా వ్యాఖ్యలు చేశాడు… జేసీబీలు పనిచేస్తుంటే కూడా జనం చూడటానికి వస్తారని… ఒకప్పుడు తెలుగులో సూపర్ హిట్స్ ఇచ్చిన తనకు కొన్నేళ్లుగా అన్నీ వరుస ఫ్లాపులే…
Ads
ఇదే సిద్ధార్థ్ మరోమాటన్నాడు ఆమధ్య… తను తీయబోయే ప్రేమకథను గనుక జనం తిరస్కరిస్తే ఇక అలాంటి పాత్రలు అసలే వేయను అన్నాడు… సరే, సిద్ధార్థ్ వంటి నటుల మాటలకు క్రెడిబులిటీ ఏముంటుందిలే గానీ ఇప్పుడు నటించిన మిస్ యు డిజాస్టర్ కదా… ఇక ఇలాంటి కథల జోలికి దయచేసి వెళ్లకు మహాశయా…
ఓ హీరో… ఓ ఆందోళనకారిణిని చూసి వెంటనే లవ్వులో పడిపోతాడు… ఐలవ్యూ అనేస్తాడు, ఎహె పోరా అంటుంది ఆమె… ఇంటికి వెళ్లి ఈమెను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అంటాడు… ఆ ఫోటో చూసి ఇంటివాళ్లు షాక్ తింటారు… సీన్ కట్ చేస్తే… ఈ దొరగారికి రెండేళ్ల క్రితం యాక్సిడెంటై, మెదడు దెబ్బతిని షార్ట్ టరమ్ మెమోరీ లాస్ వస్తుంది…
అసలు ఆమె ఎవరు..? హీరో ఫ్యామిలీని ఎవరో రౌడీలు ఎందుకు బెదిరిస్తుంటారు..? ఇష్టం లేని పెళ్లి, నచ్చని సంసారం బాధలు ఏమిటి..? ఇదీ కథ… మీకు బాగున్నట్టనిపించిందా..? ఏమో, సదరు దర్శకుడు ప్రజెంట్ చేసిన విధానం చూస్తే ఏమిటీ పిచ్చి కథ అన్నట్టుగా ఉంటుంది థియేటర్‌లో…
ఒక్కో సీన్ ఎందుకు వస్తుందో, ఎటు వెళ్తుందో… నీరసంగా, నిస్తేజంగా… ఎమోషన్‌లెస్‌గా… సంగీత దర్శకుడు జిబ్రాన్‌కు మంచి పేరే ఉంది కానీ ఈ సినిమాలో నాసిరకం… ఆ పాత్రలో సిద్ధార్థ్ ఊడపొడవడానికి ఏమీ లేదు… ఓ సాదాసీదా పాత్ర… ఉన్నంతలో కాస్త హీరోయిన్ ఆషికా రంగనాథ్ బెటర్… కానీ హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ ఏమీ శృతిలో లేవు…
పేరుకు తనకు కథల ఎంపికలో డిఫరెంట్ టేస్టున్నట్టు చెబుతుంటాడు సిద్ధార్థ్… ఈ స్క్రిప్టు ఎలా వోకే చేశాడో తనకే తెలియాలి… ఇలాంటి ఫ్లాపులు ఇంకా ఓ రెండో మూడో పడితే ఇక దుకాణం సర్దేయడమే… అదితిరావు హైదరీ వింటున్నావా..?!
Share this Article