Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పుష్పరాజ్ కేసులోకి హఠాత్తుగా రాజకీయాలు ఎందుకు జొరబడ్డాయి..?!

December 14, 2024 by M S R

.

1. ఒక సినిమా స్టార్ అయితే చట్టం నుంచి, సొసైటీ కట్టుబాట్ల నుంచి చాలా సడలింపులు, మినహాయింపులు దొరకాలా..? వాళ్లు అతీతులా..?

2. సీఎం పేరును సక్సెస్ మీట్ వేదిక మీద ఉచ్చరించలేదు కాబట్టి రేవంత్ కక్షగట్టి అరెస్టు చేయించాడా..?

Ads

3. నాగార్జున, పుష్పరాజ్‌లతో కఠినంగా వ్యవహరించినట్టే… మోహన్‌బాబునూ అరెస్టు చేయిస్తాడా..?

4. బన్నీ అంటే పవన్ కల్యాణ్‌కు పడదు, ఆయన చంద్రబాబు సహపాలకుడు, చంద్రబాబు శిష్యుడు రేవంత్… అందుకే చాన్స్ తీసుకుని అరెస్టు చేశారా..?

5. ఆ ఒక్కడితే బాధ్యత కాదు కదా… ఆ మహిళ మృతిలో బన్నీ బాధ్యత ఏముంది..? ఆ మహిళ భర్తే కేసు వాపస్ తీసుకుంటాను అంటున్నాడు కదా..?

6. ఒక నేషనల్ అవార్డు విజేతను ఇలా ట్రీట్ చేస్తారా..? బెడ్రూం దాకా వెళ్లి అరెస్టు చేస్తారా..?

7. సంధ్య థియేటర్ యాజమాన్యం పోలీసులకు ముందే చెప్పినా సరే బందోబస్తు పెట్టని పోలీసుల వైఫల్యం లేదా..?

.

…… ఇలాంటివెన్నో ప్రశ్నలు, వాటికి జవాబులు, విశ్లేషణలు, సొంత అభిప్రాయాలు, కోరికలు నిన్నటి నుంచీ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి… వాటిని అలా కాసేపు వదిలేస్తే…

ఇందులోకి రాజకీయాలు ఎందుకు ప్రవేశించినట్టు..? బన్నీ లాయర్ కూడా ఓ దశలో కేటీయార్ ట్వీట్ మీద అసహనం వ్యక్తం చేశాడని ఎక్కడో చదివాను… నిజమే… రేవంత్ ఏది చేసినా వ్యతిరేకించాలా ప్రతిపక్షం..? మరి ఇదే కేసులో థియేటర్ యజమాని, మేనేజర్, సెక్యూరిటీ ఇన్‌చార్జులను కూడా అరెస్టు చేశారు కదా, అప్పుడెందుకు ఈ గొంతులు ఇది అక్రమ కేసు, అక్రమ అరెస్టులు అని ప్రశ్నించలేదు..?

Allu Arjun Arrest: కేటీఆర్.. నీ గోల ఏంటి? కాస్త అలా ఉండు.. బన్నీ లాయర్ వార్నింగ్

కేసులో నిందితుడిగా బన్నీని చేర్చారు గనుకే కోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకున్నాడు కదా అల్లు అర్జున్… కేసులో ఏ వన్ ఎంతో ఏ ఎలెవన్ కూడా అంతే కదా… లీగల్‌గా..! ఆ ముగ్గురిని అరెస్టు చేశారు గానీ బన్నీ జోలికి రాలేదులే ప్రభుత్వం, చట్టం అనుకున్నారా..? తీరా అరెస్టు జరగ్గానే గొంతులు సవరించుకున్నారా..?

పాత చంద్రబాబు పుష్కరాల కేసులో తనను ఎందుకు అరెస్టు చేయలేదు, ఎన్ని తొక్కిసలాటలు జరగలేదు, ఏం అరెస్టులు చేశారని ప్రశ్నిస్తున్నారు… కానీ వాటికీ రేవంత్‌కూ సంబంధం ఏమిటి..? అప్పుడున్న పాలకులు ఎవరు…? ఎస్, నిజం… పుష్కర మరణాలపై చంద్రబాబు మీద కేసు పెట్టి, విచారణ జరిగి ఉండాల్సింది… ఆ పాపంలో సినిమావాళ్లు కూడా ఉన్నారు…

అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పని కాబట్టి బీఆర్ఎస్ వ్యతిరేకించాల్సిందేనా..? అదే కారణంతో బీజేపీ వ్యతిరేకించాలా…? నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూలగొట్టినప్పుడు ఈ గొంతుల్లో బలం కనిపించలేదేమి..? వైసీపీ ఎందుకు బన్నీ అరెస్టును వ్యతిరేకిస్తోంది..? తనేమీ వైసీపీ మద్దతుదారు కాదు…

allu

ఒక్క నంద్యాల అభ్యర్థి కోసం, తన వ్యక్తిగత పరిచయంతో, స్నేహం కోసం బన్నీ సపోర్ట్ చేశాడు తప్ప, తనకు ఏ రాజకీయ పార్టీతోనూ లింకుల్లేవు… వైసీపీ కోసం ఇంకెక్కడా ప్రచారం కూడా చేయలేదు… పవన్ కల్యాణ్‌తో పడటం లేదు కాబట్టి, మనవాడైపోయాడా..? బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది కాబట్టి, అది మన దోస్త్ పార్టీ కాబట్టి, మనమూ వ్యతిరేకించాలా..? (జగన్ కేసుల్ని వాదించే వైసీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి ఈ కేసులో అల్లు అర్జున్ తరఫు న్యాయవాది… బెయిల్ కేసు వాదించిందీ తనే…)

తెలుగుదేశం పార్టీ ప్లస్ జనసేన పార్టీ మాత్రం అధికారికంగా ఏమీ వ్యాఖ్యానించకుండా… సంయమనం పాటిస్తున్నాయి… నిజానికి అల్లు అరవింద్ కూడా కొన్నేళ్లుగా (ప్రజారాజ్యం విఫల ప్రయోగం, విలీనం తరువాత) రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు… మరిక ఏ రాజకీయ దురుద్దేశాలతో ఈ అరెస్టు జరిగినట్టు..? సహేతుక కారణాలు, విశ్లేషణలు ఏమున్నట్టు..? చూడాలి…

ఇంకా చాలా అభిప్రాయాలు వినిపిస్తాయి… అప్పుడే అయిపోలేదు కదా… ఇప్పుడు వచ్చింది మధ్యంతర బెయిల్… రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌తోపాటు కేసు క్వాష్ పిటిషన్ విచారణలూ జరగనున్నాయి… సో, కేసు కొన్నాళ్లు వార్తల్లోనే ఉండే అవకాశం అయితే ఉంది… బన్నీ రాజకీయ రంగ ప్రవేశం ఆలోచనల వార్తలూ కనిపిస్తాయి..!!

allu arrest

అరెస్టుకు అనుమతి ఇచ్చాడు కాబట్టి ఎలాగూ తను సమర్థించుకుంటాడు రేవంత్ రెడ్డి… ఈ కేసులో ప్రభుత్వం మరీ అంత సీరియస్‌గా వెళ్లి ఉండాల్సింది కాదు అనే అభిప్రాయాలూ ఉంటాయి… మరి ఇదే ప్రభుత్వం కదా అడ్డగోలు బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతించింది… బన్నీ మీద ద్వేషం, ఇంకేదో పొలిటికల్ ఉద్దేశాలు ఉంటే ఆ వరాలు ఎందుకు ఇస్తుంది..? లేక ఇన్నిరకాల విశ్లేషణలకు భిన్నమైన ఇంకేదైనా కారణం ఉందా బన్నీ అరెస్టు వెనుక..!!



విడుదల తర్వాత తన నివాసం వద్ద మీడియాతో అల్లు అర్జున్ చాలా బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడాడు… బాగుంది… లాయర్ల సూచనలు కూడా తీసుకున్నట్టున్నాడు…

‘‘ నేను బాగానే ఉన్నా. ఆందోళన చెందాల్సిన పనిలేదు.. నేను చట్టాన్ని గౌరవిస్తాను, నాకు మద్దతు తెలిపిన అందరికి ధన్యవాదాలు, రేవతి గారి కుటుంబానికి నా సానుభూతి, జరిగిన ఘటన దురదృష్టకరం, ఇది అనుకోకుండా జరిగిన ఘటన. కేసు కోర్టు పరిధిలో ఉంది, కాబట్టి న్యాయస్థానాన్ని గౌరవిస్తూ ఇప్పుడు ఏం మాట్లాడలేను’’….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • గ్రోక్ కూడా చేతులెత్తేసిన భాష… ఇక ఆక్స్‌ఫర్డ్ టీమ్‌కే సాధ్యమేమో…
  • ఏమైంది అసలు..? చేజేతులా ట్రోలర్లకు చిక్కుతున్న కొండా సురేఖ..!!
  • అడుగుకో పాక్ గూఢచారి… వీళ్ల ఏరివేతే యుద్ధంకన్నా ప్రధానం..,
  • అనవసరంగా వైసీపీ సోషల్ బ్యాచ్‌ను గోకిన భైరవం దర్శకుడు…
  • అత్యంత అసాధారణ కరెంటు బిల్లు… నమ్మడమే కష్టం సుమీ….
  • సొంత ‘బతుకమ్మ’ పేర్చుకుని… తన ఆట తాను ఆడుకోవడమేనా..?
  • ఫక్తు అక్కినేని మార్క్ వన్ ప్లస్ టూ రొటీన్ సినిమా ప్రేమ కథ..!!
  • ఆ సిరివెన్నెల పాటలు… రాసిన అర్థాలు వేరు- వాడుకున్న తీరు వేరు…
  • శరణార్థుల ఆశాసూచిక – భారత రాజ్యాంగంలోని కుబేరుని కళాచిత్రం…
  • కశ్మీర్‌లో యూఎన్ ధర్మసత్రం షట్‌డౌన్… శెభాష్ జైశంకర్… ఇదీ టెంపర్‌మెంట్..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions