.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 ప్రశ్నలను ఆంధ్రా మేధావులు రూపొందించారా? తెలంగాణ అస్తిత్వానికి సంబంధంలేని, తెలంగాణ ఏర్పాటును నిలువెల్లా ద్వేషించిన వారి ప్రస్తావనలు, తెలంగాణ ఏర్పాటు కాకూడదని చివరి క్షణం దాకా విఫలయత్నాలు చేసిన వారి వివరాలు తెలంగాణ పరీక్షల్లో ఎందుకు అడిగారు? అని గుండెలు బాదుకోవడం దండగ…
ఆమధ్య “ముతక మరణాలు, ముతక జననాలు” అని పరమ ముతక భాషతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థులకు ఎలా చుక్కలు చూపించిందో చెప్పుకున్నాం కదా… యంత్రానువాదమో లేక మనుషులే యంత్రాల్లా కృత్రిమంగా అనువదించి ఉంటారులే అని ఆ ముతక భాషను భరించారు.
Ads
. రెండు కళ్ళ, రెండు నాలుకల చంద్రబాబు 2020 విజన్ డాక్యుమెంటు రూపొందించింది ఎవరు?
. లగడపాటి, కావూరి, సుబ్బిరామిరెడ్డి కంపెనీల పేర్లేమిటి?
…. అనే ప్రశ్నలిచ్చి తెలంగాణను అవమానించారని బాధపడే బదులు కొంచెం లోతుగా ఆలోచిస్తే ఇందులో పాజిటివ్ అంశాలు కూడా దొరకకపోవు! (అంతకుమించి ఈ సర్వీస్ కమిషన్‌ను ఎవరూ ఉద్దరించలేరు…)
గ్రూప్- 2 లో 2020 బాబు విజన్ డాక్యుమెంట్ ఏమిటో? ఎవరు తయారు చేశారో? తెలిస్తే… తరువాత గ్రూప్-1లో ఆ డాక్యుమెంట్ వల్ల తెలంగాణాకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించడానికి నైతికంగా అవకాశం దొరుకుతుంది!
లగడపాటి, రాయపాటి, కావూరి, సుబ్బిరామిరెడ్డి, చలసాని, గజల్ శ్రీనివాస్ వ్యక్తిత్వాలు, వారి కంపెనీల లీలలు గ్రూప్-2 లో ప్రశ్నిస్తేనే… వారు తెలంగాణాకు చేసిన అన్యాయం గురించి గ్రూప్-1లో ప్రశ్నించడానికి సందు దొరుకుతుంది!
తెలంగాణాను దశాబ్దాలుగా దోచుకున్న ఆంధ్రా పెద్దల పురాణాలన్నీ చివర అప్షనల్ ప్రశ్నలుగా అయినా ఇచ్చి ఉంటే బాగుండేదని సగటు తెలంగాణ యువకులు కోరుకుంటున్నారు.
ఈ అనుభవంతో తెలంగాణ గ్రూప్-1 కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు తప్పక చదవాల్సిన విషయాలు:-
# పోలవరం సోమవారం కనుక్కున్నదెవరు?
# హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టించింది ఎవరు?
# తెలంగాణాకు అన్నం తినడం నేర్పించింది ఎవరు? తెలంగాణాకు పొద్దున్నే నిద్ర లేవడం అలవాటు చేసిందెవరు?
# ఏపికి ముఖ్యమంత్రి అయినా తెలంగాణాలో కాపురముండేది, ఏపిలో ఇల్లు లేనిది ఎవరు?
# ఏపిలో ముఖమంత్రి గెలిస్తే హైదరాబాద్ లో ఉత్సవాలు చేసుకునేది ఎవరు? అందుకుగల కారణాలేమిటి?
# తెలంగాణ ఏర్పాటులో లగడపాటి పాత్ర ఎంత?
# తెలంగాణాలో ఉంటూ తెలంగాణ నీళ్లు తాగుతూ, తెలంగాణ తిండి తింటూ, తెలంగాణ గాలి పీలుస్తూ… ఆంధ్రాలోకనీసం ఓటు హక్కయినా లేకపోయినా… తెలంగాణ గడ్డమీద నిత్యం ఆంధ్ర నామస్మరణ చేసే మహనీయులు ఎవరు?
అవునూ… సదరు పరీక్షల నిర్వహణ సంస్థ ఆమధ్య కనబరిచిన ముతక భాష మీద పాత స్టోరీ లింక్ కావాలి కదా… ఇదుగో…
Share this Article