.
రుణ ఎగవేతానందలహరి!
అప్పిచ్చువాడు లేని ఊళ్లో ఉండనే ఉండవద్దని శతకకారుడి ప్రబోధం.
Ads
“ఋణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయాః
ఋణక్షయే క్షయం యాంతి కా తత్ర పరిదేవనా”
రుణానుబంధమే లౌకిక ప్రపంచానికి అత్యంత కీలకమయినది. బ్యాంకులతో ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు ఉన్నది జన్మ జన్మల అలౌకిక, పారమార్థిక(పారమార్థిక అనగా పరమ ఆర్థిక సంబంధమైన అన్న వ్యుత్పత్తి అర్థం తప్ప ఇంకే అర్థమూ తీసుకోకూడదని మనవి) రుణానుబంధమే. ఆ ఎగవేత దారుణ రుణ భారం తీర్చాల్సింది బాధ్యతగల సగటు భారతీయులే. ఆ కోణంలో వారిది పెద్ద పారమార్థిక కర్మ. మనది వారి ఉద్దేశపూర్వక కర్మల దెబ్బకు కాలిన ఇంకా పెద్ద “పరమ దౌర్భాగ్య ఖర్మ”!
కొన్ని శతాబ్దాల బ్యాంకింగ్ సేవలను నిశితంగా గమనించిన నిపుణులు తేల్చిందేమిటంటే-
“అప్పు ఎగ్గొట్టే అత్యంత సంపన్నులను బ్యాంకులు ఏమీ చేయలేవు. అప్పు బాధ్యతగా తిరిగి కట్టేవారి నుండి ఎంత ఎక్కువ వీలయితే అంత ఎక్కువ వడ్డీలు వసూలు చేసుకుంటాయి. జనం డిపాజిట్లకు నామమాత్రపు వడ్డీ ఇవ్వాలి. వేల, లక్షల కోట్ల అప్పులు ఎగ్గొట్టిన వారి భారాన్ని…సామాన్యులు మోయాలి. ఇదొక తీరని రుణం”.
గత పదేళ్ళలో ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టిన దాదాపు పన్నెండున్నర లక్షల కోట్ల అప్పులను శాశ్వతంగా తిరిగిరానివిగా, ఎట్టి పరిస్థితుల్లోనూ వసూలు చేసుకోలేనివిగా ప్రకటించి…శాశ్వతంగా రద్దు చేసినట్లు పార్లమెంటులో తాజాగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది.
ముళ్ళపూడి వెంకటరమణ అద్భుతమైన హాస్య రచనల్లో “రుణానందలహరి” ఒకటి.
ఆయనే ఉండి ఉంటే “రుణ ఎగవేతానందలహరి” పేరిట మరో సీరీస్ రాసేవారు- సీరియస్ గా!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article