.
సగటు చిరంజీవి సినిమా అంటే… ఫైట్లు, డ్యూయెట్లు, పంచ్ డైలాగులు, హీరో ఎలివేషన్లు, ఐటమ్ సాంగ్స్… ఇవే కదా… ఏళ్ల తరబడీ తనను మాస్ హీరోగా నిలిపినవీ ఇవే కదా…
ఒకప్పటి అభిలాష, శుభలేఖ బాపతు చిరంజీవి అభిమానులు క్రమేపీ తనకు దూరమైన మార్పు కూడా ఇదే… తన నుంచి ఫ్యాన్స్ అవే కోరుకుంటున్నారు కాబట్టి నా సినిమాలు అలాగే ఉంటాయనీ తనే అంటుంటాడు…
Ads
నిజమేనా..? కాదు, తనలోని నిజమైన గొప్ప నటుడికి పరీక్ష పెట్టే మంచి పాత్ర తను చేయాలనే ఫ్యాన్స్ కోరుకుంటారు… సాదాసీదా రొటీన్ మసాలా సినిమా వేరు… ఓ గొప్ప పాత్రకు ప్రాణం పోయడం వేరు… నటుడికి తృప్తినిచ్చేదీ అలాంటివే…
డబ్బు… వేల కోట్లు సంపాదించి, కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ పురస్కారాలూ పొందిన తనకు ఇంకా ఇంకా డబ్బు దేనికనే ప్రశ్న సహజంగానే వినిపిస్తుంటుంది… సరే, డబ్బెవరికి చేదు..? కొడుకు ఆల్రెడీ స్టార్ హీరోగా నిలదొక్కుకున్నాడు… తనది ఓ మెగా వ్యవస్థ ఇండస్ట్రీలో…
ఈ స్థితిలో ఓదెల శ్రీకాంత్ దర్శక సారథ్యంలో నాని కోసం చిరంజీవి ఓ సినిమా చేయబోతున్నాడు… ఇప్పుడు చేస్తున్న ఓ ఫాంటసీ చిత్రం విశ్వంభర షూట్ అయిపోగానే ఈ సినిమా పట్టాలెక్కుతుంది… ఐతే అందులో హీరోయిన్, రొమాన్స్, రొటీన్ పాటలు గట్రా ఉండబోవని ఓ టాక్… గుడ్…
మంచిదే కదా… చిరంజీవి నుంచి ఓ విభిన్న చిత్రం వస్తుందంటే సంతోషమే కదా… కాకపోతే పోస్టర్ చూస్తే సినిమాలో విపరీతమైన వయోలెన్స్ మాత్రం ఉండబోతున్నట్టు కనిపిస్తోంది… ఒక సాలార్, ఒక యానిమల్ వంటి బీభత్స, హింస ప్రధానమైన పాత్ర అయితే మాత్రం జనానికి నచ్చుతుందానేదీ ప్రశ్నే…
ఈలోపు అప్పుడే మీడియాలో విమర్శలు… గాడ్ ఫాదర్ ఇలాగే ప్రయోగిస్తే జనం మెచ్చలేదు, మళ్లీ అలాగే ఎందుకంటూ ప్రశ్నలు… నిజానికి బలమైన స్క్రీన్ ప్లే, భిన్నమైన కథ ఉంటే జనానికి పాటల్లేకపోయినా, అసలు హీరోయినే లేకపోయినా ఫరక్ పడదు…
దసరా సినిమా తరువాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మీద ఇండస్ట్రీకి గురి కుదిరింది… తను భిన్నమైన ఇంటెన్స్ సబ్జెక్టును కూడా బాగానే డీల్ చేయగలడు అని… పైగా నాని కూడా అల్లాటప్పా కథతో సినిమా నిర్మించడు కదా… సో, చిరంజీవి ఈ సినిమా చేయడం సరైన నిర్ణయమే…
ఆమధ్య ఏదో సినిమాలో మరీ శ్రీముఖితో నడుం స్పూఫ్ చేశాడు… అదుగో అలాంటివి తన రేంజుకు తగవు… నప్పవు..! మరి రాబోయే బ్లడ్ వయోలెన్స్ సినిమాలో అలాంటివీ లేకుండా చూసుకోవడం బెటర్… ఇక తరువాత శ్రీకాంత్ దర్శకత్వ ప్రతిభ మీదే ఆధారం..!!
Share this Article