.
. ( Shankar Shenkesi ) .. …. ఐఏఎస్‌గా తనదైన ముద్ర చాటుతున్న ఓరుగల్లు ముద్దుబిడ్డ శ్రీసాయి ఆశ్రిత్… యూపీలో కారులో నుంచే విధులు నిర్వర్తించి సంచలనం
పిన్న వయస్సులోనే అత్యున్నత ఐఏఎస్ సర్వీసుకు ఎంపికైన ఓరుగల్లు ముద్దుబిడ్డ శాఖమూరి శ్రీసాయి ఆశ్రిత్… ఉత్తరప్రదేశ్‌లో విధినిర్వహణలో తనదైన ముద్ర చాటుతున్నారు.
ప్రస్తుతం ప్రధాన మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారాణసీ జిల్లా రాజతలాబ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్న ఆశ్రిత్ మంగళవారం న్యాయవాదుల ఆందోళన నేపథ్యంలో తన అధికారిక వాహనం నుంచే విధులు నిర్వర్తించి సంచలనం సృష్టించారు.
Ads
విధి నిర్వహణలో ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. రాజతలాబ్‌లోని రెవెన్యూ కోర్టులో మంగళవారం ఆశ్రిత్ ఒక భూ వివాదానికి సంబంధించి తాజా పత్రం జతచేయాలని న్యాయవాదికి సూచించి, తదుపరి తేదీ ప్రకటిస్తూ వాయిదా వేశారు.
సదరు న్యాయవాది ఆశ్రిత్ తో వాగ్వాదానికి దిగారు. కేసు వాయిదా వేయకూడదని, తక్షణమే ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఆయనకు మద్దతుగా ఇతర న్యాయవాదులు వచ్చి కోర్టు తలుపులు మూసివేశారు.
ఆగ్రహానికి లోనైన ఆశ్రిత్ కోర్టు ఆవరణలో వున్న తన అధికారిక వాహనంలోనే కూర్చొని, దానికి వున్న లౌడ్‌స్పీకర్ ద్వారా కోర్టు కార్యకలాపాలను ప్రారంభించారు. పిటిషనర్లను పిలుస్తూ వారి వాదనలను రికార్డు చేయడంతో పాటు అక్కడికక్కడే ఆదేశాలు ఇవ్వడం మొదలుపెట్టారు.
న్యాయవాదులు బిత్తరపోయి మెట్టు దిగారు. సీనియర్ న్యాయవాదులు జోక్యం చేసుకొని కోర్టులోకి రావాలని అభ్యర్థించడంతో ఆశ్రిత్ లోనికి వచ్చారు. అనంతరం యథావిధిగా విధులు కొనసాగించారు. బాధితుల పక్షం వహిస్తూ ఆశ్రిత్ వ్యవహరించిన తీరు అందరి ప్రశంసలు పొందుతోంది.
రాజతలాబ్‌లోని కోర్టు ఆవరణలో జరిగిన ఈ సంఘటన యూపీ మీడియాతో పాటు జాతీయ మీడియాను ఆకర్షించింది. కాగా, ఆర్నెల్ల క్రితమే ట్రెయినీ ఐఏఎస్‌గా పోస్టింగ్ పొందిన ఆశ్రిత్… విధినిర్వహణలో చూపుతున్న నిబద్దతకు అక్కడి ప్రజలు జేజేలు పలుకుతున్నారు.
హనుమకొండలోని ప్రముఖ వ్యాపారి శాఖమూరి అమర్ కుమారుడైన ఆశ్రిత్.. 22 ఏళ్ల వయస్సులోనే సివిల్స్ (2022)లో జాతీయ స్థాయిలో 40వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ప్రజల అధికారిగా ఎదిగే క్రమంలో కెరీర్ ఆరంభంలోనే తనదైన పనితీరు కనబరుస్తుండం అందరి ప్రశంసలు అందుకుంటోంది…
Share this Article