రామాయణం, భారతం, భాగవతం… వీటిల్లో ఏది గొప్పది అనడిగాడు ఓ మిత్రుడు… దేని గొప్పతనం దానిదే… కానీ రామాయణం, భాగవతాల్లో కథలు చిన్నవి… ఎక్కువగా రాముడిని, కృష్ణుడిని దేవుళ్లుగా చిత్రీకరించేవి… కానీ భారతం కథ ఓ మహాసముద్రం, దాని ఉపకథలు, ఉపోపకథలు కోకొల్లలు… ఈ కథ యావత్తూ రాజతంత్రాలు… సంక్లిష్టత, మార్మికత, ధర్మాధర్మ మీమాంస వంటివి బోలెడు… నిజమే… భారతంలో మనుషులే కాదు, పిశాచాలు, రాక్షసులే కాదు… నాగులు, ఏనుగుల పాత్రలకూ కథాప్రాధాన్యం…
ఒక పాత్ర గురించి చెప్పుకోవాలి… అది సుప్రతీక అనే గజరాజు… అదొక్కటీ కురుక్షేత్రంలో అతిరథమహారథుల తరహాలో యుద్ధం చేస్తుంది… నిజం చెప్పాలంటే సుప్రతీక భారతంలోని ఓ విశిష్ట అధ్యాయం… భారతీయ పురాణాల్లో సుప్రతీక అనే పేరున్న పాత్రలు మూడు కనిపిస్తాయి మనకు… మూడూ ఏనుగులే…
1) ఈ భూగోళాన్ని అష్ట దిక్కుల్లో అష్ట దిగ్గజాలు మోస్తుంటాయి అనేది ఒక పురాణం… అందులో ఒక దిగ్గజం పేరు సుప్రతీక… 2) ఇద్దరు మహావీరులు అన్నదమ్ములు… ఓసారి ఎందుకో గొడవ వచ్చి తన్నుకుంటారు… చస్తారు… తరువాత వారిలో ఒకరు తాబేలుగా, మరొకరు ఏనుగుగా జన్మిస్తారు… ఆ ఏనుగు పేరు సుప్రతీక… అది వేరే కథ… 3) ఇప్పుడు మనం చెప్పుకోబోయే సుప్రతీక వేరు… ఇది ఐరావతం జాతికి చెందిన అత్యంత మేలిరకం గజజాతి… ప్రాగ్జ్యోతిషపురం (అస్సాం) నరకాసురుడి వాహనం…
Ads
నరకాసురుడి వధ తరువాత తన కొడుకు భగదత్తుడు వారసుడవుతాడు… తండ్రిని చంపాడనే కోపం కృష్ణుడి మీద… కృష్ణుడు పాండవుల మద్దతుదారు కాబట్టి వాళ్లన్నా కోపమే… అందుకే కౌరవుల పక్షాన చేరి కురుక్షేత్రంలో యుద్ధం చేస్తాడు… తండ్రి వాహనం సుప్రతీక భగదత్తుడికీ వాహనమే… అదెంతటి బలశాలి అంటే ఒక్కసారి యుద్ధరంగంలోకి దిగితే వేయి ఏనుగుల దళంతో సమానం…
దాన్ని ఎక్కాడంటే భగదత్తుడిని ఎదుర్కోవడం ఎవరికీ చేతకాదు… భగదత్తుడి ప్రధానబలం వైష్ణవాస్త్రం… తండ్రి నరకాసురుడు మరణించే సమయంలో దాన్ని కొడుక్కు ఉపదేశిస్తాడు… రామాయణం, భారతాల్లో వినిపించే ఈ అస్త్రం తెలిసింది కేవలం కృష్ణుడు, నరకాసురుడు, భగదత్తుడు, ప్రద్యుమ్నుడు, పరుశురాముడు, రాముడు, ఇంద్రజిత్తు… చివరకు అర్జునుడు, ద్రోణుడు, కృపుడు, భీష్ముడికి కూడా తెలియని అస్త్రం అది…
కురుక్షేత్రం పన్నెండోరోజు… ఒక యుద్దవ్యూహంలో భగదత్తుడు ప్రధానంగా పోరాటం ముందువరుసలోకి రావల్సి వస్తుంది… సుప్రతీకను ఎక్కి భగదత్తుడు స్వైరవిహారం చేస్తాడు… ఒక దశలో భీముడి రథాన్ని విరగ్గొట్టి, వెంటబడితే భీముడు భయంతో పారిపోతాడు… ఒక్కడే నిలబడి వంద ఏనుగులను నిర్జించగల భీముడు సైతం సుప్రతీకను ఏమీ చేయలేకపోతాడు… ఎలాగోలా ధైర్యాన్ని తెచ్చుకుని, తిరిగి వచ్చి, దాని కాళ్ల మధ్యలోకి దూరి ముష్టిఘాతాలతో మోదుతూ ఉంటాడు… కోపంతో సుప్రతీక భీముడిని తొండంతో పట్టుకుని దూరంగా విసిరేస్తుంది… అదీ సుప్రతీక బలం…
ఒక దశలో పాండవుల పక్షంలోని ప్రధాన యోధులందరూ భగదత్తుడిని చుట్టుముట్టేస్తారు… ఆ దశలో సుప్రతీక ఆ ముట్టడిని కకావికలం చేస్తుంది… ఈ సందర్భంలో అర్జునుడు వస్తాడు… భగదత్తుడు, అర్జునుడి నడుమ పోరాటం పెరిగి, భరించలేని స్థితిలో భగదత్తుడు వైష్ణవాస్త్రాన్ని ప్రయోగిస్తాడు… అది అణ్యస్త్రాన్ని మోసుకుపోయే ఓ ఖండాంతర క్షిపణి తరహా…
ఇక అర్జునుడి పని అయిపోయినట్టే అనుకునే స్థితిలో కృష్ణుడు రథం మీదే లేచి నిలబడి, ఆ అస్త్రాన్ని తన మెడలో హారంగా స్వీకరిస్తాడు… (విష్ణువు అస్త్రమే కదా)… అర్జునుడు ఖిన్నుడవుతాడు… ‘‘దాని శక్తి అపారం, నీకు తెలియదు, అందుకే నేను జోక్యం చేసుకోకతప్పలేదు’’ అని సర్దిచెబుతాడు కృష్ణుడు… తరువాత కోపంతో తన దగ్గర ఉన్న దివ్యాస్త్రాలను ప్రయోగించి సుప్రతీకను నేలకూలుస్తాడు… సుప్రతీక చనిపోగానే భగదత్తుడు బలం సగం పడిపోతుంది…
అర్జునుడికి భగదత్తుడిని చంపడం సాధ్యం కావడం లేదు… మళ్లీ కృష్ణుడే ఓ రహస్యం చెబుతాడు… భగదత్తుడి కనుబొమ్మలు దట్టంగా ఉంటాయి… యుద్ధం చేసేటప్పుడు ఆ వెంట్రుకలు కళ్లను కప్పకుండా వాటిపై ఓ వస్త్రంతో కట్టేసుకుంటాడు… కృష్ణుడు చెప్పిన ఆలోచన ఏమిటంటే..? ముందుగా ఒక బాణంతో ఆ వస్త్రాన్ని చీల్చేయాలి… వెంటనే కనుబొమ్మలపై వెంట్రుకలు తన కళ్లపై పడతాయి…
ఆ ఘడియలో అర్జునుడు ఓ దివ్యాస్త్రంతో భగదత్తుడిని సంహరించాలి… కొద్దిసేపు కళ్లుమూసుకుపోతాయి కాబట్టి భగదత్తుడు ప్రతిఘాత అస్త్రాల్ని ప్రయోగించలేడు కదా… ఈ ఆలోచన మేరకు అర్జునుడు బాణాలు సంధించి, చివరకు భగదత్తుడిని నేలకూలుస్తాడు… తరచి చూస్తే కృష్ణుడి మాయోపాయాలు, మద్దతు గనుక లేకపోతే పాండవుల కథ అరణ్యవాసానికి ముందే ముగిసిపోయేదేమో…!!
Share this Article