.
నేను సారీ చెప్పాను కదా… మీరెందుకు జనానికి సారీ చెప్పరు…? అని దబాయించి మరీ అడుగుతున్నాడు పవన్ కల్యాణ్… ఎవరిని..? టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని, ఈవో శ్యామలరావును, డిప్యూటీ ఈవో వెంకన్న చౌదరిని…!
ఎవరో అడిగారని క్షమాపణలు చెప్పాలా..? సారీ చెబితే చచ్చిపోయినవాళ్లు బతికొస్తారా..? అంటూ పెడసరంగా మాట్లాడుతున్నాడు చైర్మన్ నాయుడు… మళ్లీ పవన్ కల్యాణ్‌తో గోక్కోవడం ఎందుకులే అనుకుని, అబ్బే, నేను పవన్ కల్యాణ్ గురించి కాదు అని తనే ఖండించుకుంటాడు… ఐనా సరే, సారీ అంటాడు… ఈవో, డిప్యూటీ ఈవో మాత్రం కిమ్మనడం లేదు…
Ads
ఈఓ కూ చైర్మన్ కూ పడటం లేదు, సమన్వయం లేదు… సిఎం ఎదుట ఈఓ చైర్మన్ ను కడిగేశాడు అంటే ఇంకేదో బలమైన కారణం ఉండి ఉంటుంది… ఎందుకో గానీ ఈఓ, డిప్యూటీ ఈవో ల మీద పవన్ కళ్యాణ్ గుర్రుగా ఉన్నాడు…
సో, చంద్రబాబు ఎలాగూ నాయుడిని తీసేయలేడు కదా, ఇక ఈవో, డిప్యూటీ ఈవోలను తొలగిస్తాడట… మొత్తానికి ఈ తొక్కిసలాట వైఫల్యం సాకుతో అంతిమ బలి ఆ ఇద్దరూ అన్నమాట… అవునూ, ముక్కోటి ఏకాదశి ఒక్కరోజే కదా వైకుంఠ ద్వారా దర్శనాలు… మరి ఇక్కడ పదిరోజులు జరపడం ఏమిటి..? ఎవరో మరి ఈ నిర్ణయ కారకులు..? నాటి అధర్మా రెడ్డేనా..!!
ఆ సారీల సమరం నడుమ నిన్నటి ప్రజాశక్తిలో ఓ స్టోరీ ఆసక్తికరంగా కనిపించింది… మిగతా పెద్ద పెద్ద పత్రికలకు భిన్నంగా అక్కడ నిజానికి ఏం జరిగిందో చెప్పుకొచ్చింది ఆ స్టోరీ… జస్ట్, ఎవరో మహిళ ఊపిరాడక అభ్యర్థిస్తే పోలీసులు గేటు తీయడంతోనే తొక్కిసలాట అని పెద్ద మీడియా తేల్చిపారేసింది కదా… కానీ కాదట…
ప్రజాశక్తిలో వచ్చిన ఆ స్టోరీలో కొంతభాగం ఇలా ఉంది…
‘‘బుధవారం ఉదయం ఏడు గంటల నుంచే క్యూలైన్లలో భక్తులు నిల్చున్నారు. బైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్లోని కౌంటర్ జాతీయ రహదారికి దగ్గరగా ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా ఈ కౌంటర్‌కు వేలాదిగా చేరుకున్నారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో భక్తుల రద్దీగా ఉండడంతో వచ్చిన జనాలను ఎదురుగా ఉన్న పార్కులో ఉంచి తాళాలు వేశారు.
ఓ పక్క ఆకలి, మరో పక్క టోకెన్లు అందవేమోనన్న ఆందోళన. ఈ నేపథ్యంలోనే 8.40 గంటలకు 50 సంవత్సరాల వయస్సున్న ఓ మహిళ తనకు గుండెల్లో నొప్పిగా ఉందని, ఊపిరాడలేదని, తనను బయటకు తీసుకెళ్లాలని పోలీసులను ప్రాధేయపడింది. అప్పటివరకూ మూసి ఉన్న మెయిన్ గేటును క్రైం డిఎస్‌పి రమణకుమార్ ఆదేశాల మేరకు గేటు తీసి మహిళను బయటకు తీసుకొచ్చారు.
50 మంది జనసేన కార్యకర్తలు వాళ్లంతా తమ వాళ్లను, లోనికి పంపించాలని ఆ సందర్భంగా జనసేన ద్వితీయశ్రేణి నాయకుడు డిఎస్‌పిని కోరారు. ఆ 50 మందిని లోపలికి అనుమతించారు. దీంతో వెనక ఉన్న భక్తులు టోకెన్లు ఇచ్చేస్తున్నారని, తాము వెనుకబడిపోతామని, కొత్తవారిని లోనికి ఎలా అనుమతిస్తారని మండిపడ్డారు. ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. 50 మందిని పైగా తొక్కుకుంటూ వెళ్లిపోయారు.
సో, ఇక్కడా జనసేన..!! ఎస్, పవన్ కల్యాణ్ సారీ చెప్పడంలో నిజాయితీ ఉంది… కానీ ప్రభుత్వం తరఫునే కాదు, తన కార్యకర్తలు కూడా ఈ తొక్కిసలాట విషాదానికి కారకులు కాబట్టి జనసేన అధినేతగా సారీ చెప్పి ఉండాల్సిందేమో… ఎందుకంటే..?
తను బాధితుల పరామర్శకు వచ్చినప్పుడు కూడా తన ఫ్యాన్స్ ఉరఫ్ కార్యకర్తలు అక్కడ కూడా, ఆ విషాద సందర్భాన్ని కూడా పట్టించుకోకుండా సీఎం సీఎం అని నినాదాలు చేస్తుంటే చివరకు పవన్ కల్యాణ్‌కే చిరాకెత్తిపోయి వాళ్లను మందలించాల్సి వచ్చింది…
అఫ్‌కోర్స్, జగన్ వచ్చినప్పుడూ ఇదే ధోరణి… జై జగన్, సీఎం సీఎం అంటూ నినాదాలు, హంగామా…! జగన్ వారిని వారించి ఉండాల్సింది… అసలు ఆ సందర్భం ఏమిటి..? ఆ నినాదాలు ఏమిటి..? ప్చ్, మరీ ఏపీలో ఈ మూర్ఖాభిమానం జనానికి ప్రాణాంతకంగా మారుతోంది..!!
Share this Article