.
. ( విన్నకోట రవికుమార్ ) …. సంక్రాంతి అంటే ఏంటి? సంక్రాంతి అంటే అదేదో రాశి నుంచి సూర్యుడు… అది కాదు గురూ… సంక్రాంతి అంటే లాంగ్ హాలిడే… సంక్రాంతి అంటే ఊళ్ళకి వెళ్లి రావడం, సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు…
అబ్బే…సంక్రాంతి అంటే పంటలు చేతికొచ్చే…ఊహూ…సంక్రాంతి అంటే ఇవేమీ కాదు బ్రో. సంక్రాంతి అంటే కోడి పందేలు. సంక్రాంతి అంటే గుండాట.
Ads
సంక్రాంతి అంటే భారీ సెట్టింగులతో జరిగే కోడి పందేలు, జూదం. తెలుగు సంస్కృతిలో కొత్తగా భాగమైన (అంతకుముందు ఎన్నో దశాబ్దాలుగా ఈ ఆట ఉన్నా, గత మూడు దశాబ్దాలుగా ఇది వేగంగా పరిణామం చెంది సంక్రాంతి అంటే కోడి పందేలు మాత్రమే అని అర్థం అయ్యే స్థితికి చేరుకుంది)
ఈ మహా ఉత్సవం ఈ సారి పాత రికార్డులన్నీ చెరిపేసి, కొత్త జనరేషన్ కి సంక్రాంతి అంటే కొత్త అర్థం అనే భావన కలగజేసింది. భవిష్యత్తులో సంక్రాంతి అంటే కోడి పందేలు ఆడుకోడానికి వీలు కల్పించే సెలవులుగా మాత్రమే ప్రజలు అనుకునే విధంగా తయారైంది.
తెలుగోళ్ళకి డబ్బులు లేవు అని ఎవరన్నారు? ఇంత విచ్చలవిడితనం, నిర్భీతిగా విలాసాలు…అసలు గోదావరి, కృష్ణా జిల్లాల్లో కేవలం నాలుగు రోజుల్లో ప్రవహించిన సొమ్ముకి ఏ లెక్కలున్నాయి? కోడి పందేల మీద పెట్టిన సొమ్మే మూడు వేల కోట్లు.
ఇక ఇతర జూదాలు, భారీ ఏర్పాట్లు, విందు, మందు, ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టిన ఖర్చు అంతా లెక్కేస్తే, ఒక అసెంబ్లీ ఎలక్షన్ లో మెయిన్ పార్టీలు రెండూ స్టేట్ లెవెల్ లో పెట్టే ఖర్చు దాటిపోయిందని అంచనా.
సరదాగా ఇచ్చే గిఫ్టులే థార్ జీపులు (ఒక్కోటి పదిహేను లక్షలు) లాంటివి ఉన్నాయి. ఆ నాలుగు రోజుల్లో ఈ ప్రాంగణాల్లో తిరిగే కార్లు ఆటోమొబైల్ ఇండస్ట్రీకి షాకింగ్ గా మారాయి. కోట్లు ఖరీదు చేసే కార్లు కుక్కల్లా తిరిగాయి. కోటి రూపాయల పైన విలువ చేసే కార్లు కనీసం ఓ వెయ్యి తిరిగి ఉంటాయి అని కూడా ఒక అంచనా. ఇదంతా చూశాక కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకోవాలి.
కోట్లలో పందాలు వేసే వాళ్ళే కాదు, 200 రూపాయలు నించీ పాట మొదలుపెట్టే వారూ లక్షల్లో ఉన్నారు. ఎవరి డబ్బు వారి ఇష్టం. కానీ, ఎంత ప్రజా ధనం అపాత్ర దానం చేస్తున్నాం. తెలుగు నేల మీద ఇంత సంపద వినోదాలకి పారుతూ ఉంటే ఇంకా ఎందుకు పావర్టీ లెక్కలు?
సరే, కోడి పందాలు అయిపోయాయి, మళ్లీ ఏడాది వరకూ ఈ తరహా జూదాలు ఉండవు అనుకోడానికి ఆస్కారం లేదు. ఇది అవగానే క్రికెట్ బెట్టింగ్ లు మొదలవుతాయి. తర్వాత ఎక్కడైనా (వేరే రాష్ట్రాలలో కూడా) ఎన్నికలు జరుగుతూ ఉంటే ఆ బెట్టింగ్ మొదలవుతుంది. ఎన్నికలు ఐదేళ్లకోసారి వస్తే, జూదాలు ఏడాది పొడవునా జరుగుతున్నాయి. కాదేదీ జూదానికనర్హం అన్న భావన తెలుగు రాష్ట్రాలలో వచ్చేసింది, ప్రాంతాలకతీతంగా.
సబ్సిడీల పేరుతో వేల కోట్లు ప్రతీ సంవత్సరం ఖర్చు చేస్తూ, శాశ్వతమైన ఆస్థులు, infrastructure నిర్మాణం చేసి సంపద సృష్టించి, దాన్నుంచి ఉపాధి అవకాశాలు కల్పించే ఆలోచన చేయవచ్చు. సబ్సిడీ బియ్యానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు చూపిస్తున్నాం. వేరే సర్వేలు, రిపోర్ట్ లు అవసరం లేదు,
కేవలం ఇక్కడ అటెండెన్స్ బట్టి కనీసం కొన్ని లక్షల వైట్ కార్డ్ లు రద్దు చేసి, వేల కోట్లు ఆదా చేసి, ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కట్టొచ్చు. రైతు బంధు లాంటి పథకాలకి నిజమయిన అర్హులైన లబ్ధిదారుల్ని ఎంపిక (ఎలిమినేషన్ ద్వారా) చేసి వారికి ఇచ్చే డబ్బులు సమయానికి ఇవ్వచ్చు. దానికి దీనికి మించిన సందర్భం మరొకటి దొరకదు.
సంఖ్య తగ్గించడం ద్వారా సరైన లబ్ధిదారులకి ప్రయోజనం చేకూరుతుంది. సబ్సిడీ బియ్యం అమ్ముకునే వారికి ఇంకా అదే పథకం కింద డబ్బు ఖర్చు చేయడం సరి కాదు కదా. జూదం ఆడే సావకాశం ఉన్నవారికి ఇంకా ప్రభుత్వ ఖజానా నుంచి ఎందుకు ఇవ్వడం.
అలాగే వ్యవసాయ ఆదాయం చూపిస్తూ ఆదాయపు పన్ను మినహాయింపు పొందే వారికి ఇంకా వ్యవసాయ బడ్జెట్ నుండి కేటాయింపులు చేస్తూ నిజంగా ప్రభుత్వ సహాయం అవసరం ఉన్న వారికి సాయం చేయలేకపోవడం ఎంత తప్పు. నిజానికి ఇలాంటి వారిని గుర్తించడం చాలా కష్టం.
ప్రపంచ స్థాయి సౌకర్యాలతో జూదాలు ఆడే వారిని గుర్తించి వారిని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించాలి. Energy saved is energy produced అని కదా ఉవాచ. అలాగే subsidy saved is more subsidy sanctioned గా మార్చవచ్చు. దీనివల్ల మరో ఉపయోగం కూడా ఉంది. ఒకసారి ఇది అమలు చేస్తే నిజంగా లబ్ధి పొందిన వారు ఆటోమేటిక్ గా వీటికి హాజరవడం తగ్గిపోతుంది.
భారీ సంఖ్యలో జనం హాజరు ఇలాంటి విచ్చలవిడి ధన ప్రవాహం, ప్రదర్శన కి ఒక మోటివేషన్. జనం ఆదరణ తగ్గిపోతే సహజంగా ఓ ఐదేళ్లలో ఈ వికృత క్రీడలకి ముగింపు పడుతుంది. లేకపోతే అది ఎంత చెడ్డది అని ప్రచారం చేసినా ఉపయోగం ఉండదు.
ఎపిలోగ్ …. జనవరి రెండో వారంలో ఈ జాతర జరుగుతుంది. డిసెంబర్ రెండో వారం నుంచి జనవరి రెండో వారం వరకూ హైదరాబాద్ లో ఓసారి, విజయవాడలో ఓ సారి పుస్తక ప్రదర్శనలు జరుగుతాయి. ఈసారి విజయవాడ పుస్తక ప్రదర్శనలో ఒక షాప్ దగ్గర ఒక పుస్తకం రాసిన రచయిత తన పుస్తకాన్ని అమ్ముకోడానికి నిల్చోవడం కనిపించింది.
సాధారణంగా ఈ ప్రదర్శనలో పదీఇరవై శాతం డిస్కౌంట్ ఉంటుంది. ఆయన ముప్పయి శాతం డిస్కౌంట్ ఇచ్చి తన పుస్తకాన్ని అమ్మడానికి కష్టపడుతున్నాడు. పుస్తకం ధర రెండు వందల రూపాయలు. ముప్పయి శాతం డిస్కౌంట్ తో నూట నలభై రూపాయలు. ఆ ధరకి కోడి పందాల బరిలో ఒక పూటలో అరిగిపోయే ఏ ఆహార పదార్థమూ దొరకదు…! ఇదీ ఐరనీ..!!
Share this Article