Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెమ్మన్నది మినపగుళ్లు… నువ్వు తెచ్చిందేమో పొట్టు పెసలు…

January 22, 2025 by M S R

.

నేరం నాది కాదు- మీడియాది… మినపగుళ్ళు తెమ్మంటే పొట్టు పెసలు తెచ్చావా?

మయా బజార్లో ఘటోత్కచుడిచేత పింగళి నాగేంద్ర రావు చాలా స్పష్టంగా చెప్పించాడు- “పాండిత్యం కన్నా జ్ఞానమే గొప్పది” అని. చిన్నప్పటినుండి చిన్నయసూరి తెలుగు వ్యాకరణ సూత్రాలు, పాణిని సంస్కృత వ్యాకరణ సూత్రాల్లాంటివి చదువుతూ నాకు నాలుగు ముక్కలు తెలుసు అనుకునేవాడిని.

Ads

లోకంలో జ్ఞానం ముందు ఈ వ్యాకరణ పాండిత్యం ఎందుకూ కొరగాదని అనేక సందర్భాల్లో రుజువయ్యింది. అవుతోంది. అవుతూ ఉంటుంది.

సాధారణంగా ఇంటికి సరుకులు కావాలన్నప్పుడు లిస్ట్ రాసుకుని మా ఆవిడ నాతో వస్తుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. ఒక్కోసారి నేనొక్కడినే సరుకులకు వెళ్ళినప్పుడు నా బాధ బాధ కాదు. ఒక రోజు కేజీ మినపగుళ్ళు, అర కేజీ పుట్నాలు (రాయలసీమలో పప్పులంటారు) తీసుకురమ్మంది. బాధ్యతగా తెచ్చాను.

తీరా ఇంటికొచ్చాక నేను తెమ్మన్నది మినపగుళ్ళు… నువ్ తెచ్చింది పొట్టు పెసలు అంది. ఇక ఈరోజునుండి పెసరట్టు, పెసర పచ్చడి, పెసర కూర, పెసర పాయసం, పెసర కాఫీ… అన్నీ పెసర స్పర్శతోనే అంది కోపంగా, నిరసనగా, వ్యంగ్యంగా, ధిక్కారంగా.

సాధారణంగా పుట్నాలకు శెనగ పప్పు తెస్తాననుకుని ఆ కవర్ కూడా తీసి చూసింది. అవి పుట్నాలే కావడం వల్ల ఆరోజు పరీక్షలో 35 మార్కులు వేసింది. తరువాతెప్పుడో వంటింట్లో అయిదారు సరుకుల మధ్య మినపగుళ్ళను నేను కన్ఫ్యూజ్ కాకుండా గుర్తించినప్పుడు పొంగిపోయింది. యాభై అయిదేళ్ల వయసులో మినపగుళ్ళు ఏవో తెలుసుకోగలిగావు అంటూ ప్రశంసాపూర్వకంగా ఉదారంగా యాభై మార్కులు వేసింది.

తప్పు నాది కాదు అద్దాల అంగడి (సూపర్ బజార్) వాడిది అని చెప్పడానికి అవకాశం లేదు. జ్ఞానమెవరికీ ఊరికే రాదు. నాదేమో తెలుగు మీడియం వానాకాలం చదువు. అక్కడేమో అన్నీ ఇంగ్లిష్ లో రాసి పెట్టి ఉంటాయి. చీమ తలకాయ కన్నా చిన్న అక్షరాలు. వయసు వల్ల రీడింగ్ గ్లాసులు వచ్చాయి.

షాపుకు వెళుతూ పరీక్షకు వెళ్ళినట్లు కళ్ళజోడు, పెన్ను, స్కేలు, ఎరేజర్, క్లిప్ ప్యాడ్ పెట్టుకుని వెళ్ళం కదా! ఆ అక్షరాలు కనిపించవు. కనిపించినా ఆ ఇంగ్లిష్ పదార్థాలు తెలుగులోకి అనువాదం కావు.

అక్కడ యూనిఫార్మ్ లో మనకు సహాయం చేయడానికి నియుక్తులైనవారిని అడగడం మహాపాపం అన్నట్లు నిర్లక్ష్యంగా ఉంటారు. చీజ్ ఎక్కడుంది అని అడిగాను అడుక్కుతినేవారిని విసుక్కున్నట్లు చేయి చూపించి ముందుకెళ్లు అన్నట్లు సైగలతో చెప్పింది.

మయసభలో దుర్యోధనుడు మడుగు కాదనుకుని కాలు జారి మడుగులోనే పడ్డప్పుడు ఎంత అవమానపడ్డాడో అంతగా ప్రతిసారీ ఈ సేల్స్ గర్ల్స్ నన్ను అవమానిస్తున్నట్లుగా ఉంటుంది. “పాంచాలీ! పంచ భర్తృక! ఏమే! ఏమేమే! నీ ఉన్మత్త వికటాట్టహాసము?” అన్న ఎన్ టీ ఆర్ డైలాగ్ మనసులో అనుకుని చీజ్ అనుకుని అవమానభారంతో పన్నీర్ తెస్తాను.

చీజ్ కు బదులు సోప్ తేలేదు కాబట్టి… పన్నూడగొట్టుకోవడానికి ఏ రాయయితే ఏమి? అన్నట్లు దాంతోనే వండగలిగింది వండుతూ సర్దుకుపోతూ ఉంటుంది మా ఆవిడ.

మినపగుళ్ళు;
పొట్టు పెసలు;
పెసర బేడలు;
నల్ల నువ్వులు;
తెల్ల నువ్వులు;
ఎండు నల్ల ద్రాక్ష;
బద్దలు చేయని జీడిపప్పు;
బద్దలు చేసిన జీడిపప్పు;
చికోరి కలిపిన కాఫీ పొడి… అని దమ్ముంటే మాలాంటివారి మామూలు తెలుగులో షాపువారిని రాయమనండి. అప్పుడు నేను మినపగుళ్ళకు బదులు పొట్టు పెసలు తెస్తే అడగండి!

నేరం నాది కాదు- మీడియాది.

కొస మెరుపు:- పాలకూర- చుక్కకూర కన్ఫ్యూజ్ కాకుండా షాపువాడినే అడుగుతూ ఉంటాను!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దిక్కుమాలిన ఎలిమినేషన్…! మరిక ప్రజాభిప్రాయం దేనికిరా భయ్..!?
  • ‘ఎ’ తెలుగు…’యాన్’ టెల్గూ…’ది’ తెగులు… ‘థి’క్కుమాలిన యాడ్…
  • నడిరాతిరి వేళా నీ పిలుపు… ఇలాంటి ఓ హిందీ పాటే ఓ ఉత్సవం…
  • ఈ తూరుపు, ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ…!
  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions