.
Subramanyam Dogiparthi ….. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః , యత్రేతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాసురాః క్రియాః అనే మనువు శ్లోకంతో ముగిసే ఈ సినిమా అనాదిగా స్త్రీలకు జరుగుతున్న అన్యాయాల బొమ్మలు టైటిల్సులో చూపిస్తూ మొదలవుతుంది .
చంద్రమతి , దమయంతి , శకుంతల , సీతాదేవి , ద్రౌపది రేణుకాదేవిలను టైటిల్సులోనే చూపిస్తారు దర్శకుడు . సంచలనాత్మక సందేశంతో వచ్చిన ఈ న్యాయం కావాలి సినిమా 1981లో సంచలనమే . కేవలం అయిదారు లక్షలతో తీసిన ఈ సినిమా పది సెంటర్లలో వంద రోజులు ఆడటమే కాకుండా సిల్వర్ జూబిలీ కూడా చేసుకుంది .
Ads
నిర్మాత , దర్శకుడు క్రాంతికుమారుకి పేరు , డబ్బులు పుష్కలంగా వచ్చాయి . డి కామేశ్వరి వ్రాసిన కొత్త మలుపు నవల ఆధారంగా తీయబడిన ఈ సినిమా విజయానికి ఒక ప్రధాన కారణం సత్యానంద్ డైలాగులు . బాణాల్లాగా గుచ్చుకుంటాయి .
చిరంజీవి నెగటివ్ పాత్ర . ప్లేబాయ్ . తన డాన్సులతో కుర్ర ప్రేక్షకులను ఉర్రూతలూగించారు . రాధికకు తెలుగులో మొదటి సినిమా . తమిళంలో అప్పటికే చాలా సినిమాల్లో నటించిన అనుభవం ఉండటం వలన సునాయాసంగా చేసేసింది . సినిమాలో క్రిటికల్ పాత్ర ఆమెదే .
మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చి ఓ పలుకుబడి ఉన్న కుర్రాడి చేత మోసగించబడి , భయపడకుండా ఎదురు తిరిగి న్యాయం కోసం పోరాడి , గెలిచాక పెళ్ళి చేసుకోను అని తెగేసి చెప్పే పాత్ర . కేవలం తన కొడుకు కర్ణుడులా కాకుండా రారాజుగా ఎదగాలనే ఇంత న్యాయ పోరాటం చేసానని చెప్పే పాత్ర . (ఫిలింఫేర్ అవార్డు పొందింది ఆమె)
ప్రశ్నించటాన్ని ఆనాటి సమాజం ఆమోదించింది కాబట్టి అలాంటి డైలాగులు వ్రాసారు . ఇప్పటి అనంత శ్రీరాంలు సమాజంలో అన్యాయాన్ని ప్రశ్నించటాన్ని ప్రశ్నిస్తారు , సవాలు చేస్తారు .
మరో గొప్ప పాత్ర ఊర్వశి శారదది . స్త్రీగా తానే మోసపోయిన లాయర్ శకుంతల పాత్ర . పాత్ర పేరు కూడా ఏరికోరి శకుంతల అని పెట్టి ఉంటారు . ముఖ్యంగా కోర్టు సీనుల్లో అదరగొట్టేసింది . ఆమెకు దీటైన ఎదురు లాయరుగా జగ్గయ్య . బహుశా జగ్గయ్య కాకుండా మరొకరు శారదకు పోటీగా నిలబడి ఉండకలిగే వారు కాదేమో !
ఈ నాలుగే ప్రధాన పాత్రలు . ఇతర పాత్రల్లో ఫటాఫట్ జయలక్ష్మి , అల్లు రామలింగయ్య , చాట్ల శ్రీరాములు , బేబీ తులసి , పుష్పలత , పి జె శర్మ నటించారు . అతిధి పాత్రలో దాసరి నారాయణరావు దాసరిగానే భారతీదేవి సంచలన న్యాయ పోరాటం మీద తన అభిప్రాయాన్ని తెలియపరిచే పాత్రలో తళుక్కుమంటారు .
చక్రవర్తి సంగీత దర్శకత్వంలో ఐకానిక్ సాంగ్ న్యాయం కావాలి స్త్రీలకు న్యాయం జరగాలి ప్రేక్షకులకు హత్తుకుపోతుంది . చిరంజీవి , రాధికల డ్యూయెట్లు , చిరంజీవి- హలం క్లబ్ డాన్సూ బాగుంటాయి . ముఖ్యంగా చిరంజీవి అభిమానులకు చాలా నచ్చుతాయి .
అమ్మో నాకు భయం , ఈరోజే ఆదివారము , బుడి బుడి బిడియంగా పాటలు బాగుంటాయి . అబలను కాను సబలని పాట యువతులకు బాగా నచ్చింది . తెలుగులో సక్సెస్ అయిన ఈ సినిమా చాలా భాషల్లో రీమేక్ అయింది .
1983లో హిందీ లోకి ముఝే ఇన్సాఫ్ చాహియేగా తీయబడింది . మిధున్ చక్రవర్తి , రేఖ , రతి అగ్నిహోత్రి నటించారు . 1984లో కన్నడంలో కేరళిది హెన్నుగా అనే టైటిలుతో విడుదల అయింది . శంకర నాగ్ , మంజుల , జయంతి నటించారు .
తమిళంలోకి విధి టైటిలుతో సుజాత , మోహన్ , పూర్ణిమలు ప్రధాన పాత్రధారులుగా వచ్చింది . మళయాళం లోకి తాళం తట్టియా తరట్టు టైటిలుతో రాజకుమార్ , మేనక , లక్ష్మిలతో వచ్చింది . మేనక అంటే కీర్తి సురేష్ తల్లి .
చిరంజీవి- రాధికల హిట్ జోడీ ప్రభంజనం ఈ సినిమాతోనే మొదలయింది . సంచలనం రేపిన ఈ సినిమా తరచూ ఏదో ఒక చానల్లో వస్తూనే ఉంటుంది . ముఖ్యంగా విమెన్స్ డే వంటి సందర్భాలలో . చూసి ఉండకపోతే తప్పక చూడండి . యూట్యూబులో ఉంది . కీలక సీన్ల వీడియోలు కూడా… #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగుసినిమాలు
ఆ సినిమా షూటింగులో తనకు ఎదురైన అవమానాన్ని చిరంజీవి చెప్పే వీడియో…
Share this Article