Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

…. చివరకు సన్యాసంలోనే నిజమైన సౌఖ్యం ఉందని గ్రహించి…

January 29, 2025 by M S R

.

“కౌపీన సంరక్షణార్థం” అని బాగా వాడుకలో ఉన్న సంస్కృతం సామెత. అందరికీ తెలిసిందే అయినా…
గోచిగుడ్డ నుండి మొదలయిన అంతులేని మహా సంసార ప్రయాణం కథ మళ్లీ మళ్లీ తెలుసుకోదగ్గదే.

ఒకానొక ఊరు. పంటపొలాలతో, ధన ధాన్యాలతో పచ్చగా, హాయిగా ఉంది. ఊరిని ఆనుకుని ఊరికి కొండగుర్తుగా ఒక కొండ. ఆ కొండ మీద ఒక శిథిలాలయ మంటపం. ఎక్కడ నుండి, ఎప్పుడొచ్చాడో తెలియదు కానీ…ఒక సన్యాసి వచ్చి ఆ మంటపం కింద గూడు కట్టుకున్నాడు.

Ads

పశువుల కాపర్లు ఎవరయినా కొండమీదికి వెళ్లినప్పుడు తాము తెచ్చుకున్న సద్ది మూట విప్పి ఓ ముద్ద పెడితే తింటాడు. పెట్టకపోతే పెట్టాలని చేయి చాచి అడగడు. వచ్చినవారే దయదలిచి ఒక కాయో పండో ఇచ్చి వెళ్లేవారు.

సన్యాసికి ఒంటి మీద ఒక గోచీ గుడ్డ, కొమ్మకు ఆరేసుకున్న మరో గోచీ గుడ్డ తప్ప ఇంకెలాంటి స్థిర చరాస్తులు లేవు. ఉండాలని కోరుకోలేదు. కాలం అలా గడిచిపోతూ ఉంటే కాలం ఎందుకవుతుంది?
ఆరేసుకున్న గోచీ గుడ్డను ఎలుకలు కొరకడంతో సన్యాసికి ఎక్కడలేని కష్టాలు మొదలయ్యాయి.

సర్వసంగ పరిత్యాగి ఈ విషయం మీద లోలోపల చాలా నలిగిపోతున్నాడు. ఒక శుభ ముహూర్తాన తన బాధను పశుల కాపర్లతో పంచుకున్నాడు. అయ్యో స్వామీ! ఇదా మీ బాధ? అందుకా ఈ మధ్య దిగులు దిగులుగా ఉన్నారు? రేప్పొద్దున కొండ మీదికి వచ్చేప్పుడు ఒక పిల్లిని తీసుకొచ్చి ఇక్కడ వదిలి వెళతాం. మీ సమస్యకు శాశ్వత పరిష్కారం అన్నారు. అన్నట్లుగానే పొద్దున్నే చంకలో పిల్లిని పెట్టుకుని వెళ్లారు. సన్యాసి రెండ్రోజులు గమనించాడు. ఎలుకలు మాయం. గోచీ గుడ్డ భద్రం.

అయితే ఆ కొండమీద సరయిన ఆహారం దొరకక పిల్లి మూడో రోజుకు కళ్లు తేలేసింది. సన్యాసి మనసు చివుక్కుమంది. మళ్లీ పశుల కాపర్లనే సలహా అడిగాడు. ఒంటరి పిల్లి బిక్కు బిక్కుమంటూ ఉంది. పైగా పిల్లికి పాలు పోయాలి…అని రెండో పిల్లిని కూడా ప్రవేశపెట్టారు.

పాల క్యాన్, గిన్నెలు, ప్లేట్లు ఎలాగూ ఉంటాయి. వారం తిరగ్గానే సన్యాసి మళ్లీ మొహం వేలాడేసుకుని ఉండడాన్ని పశుల కాపర్లు జీర్ణించుకోలేకపోయారు. ఏమి స్వామీ! ఏమయ్యింది? అని అడిగారు. జంట పిల్లులు మ్యావ్ మ్యావ్ అని నా దుంప తెంచుతున్నాయి…అని బాధపడ్డాడు. మరుసటి రోజు ఉదయాన్నే రెండు అడవి కుక్కలను ప్రవేశపెట్టారు. తోడుగా రెండు ఆవులను కూడా ముందు జాగ్రత్తగా తెచ్చి కట్టి పడేసి, ఒక గుడిసె, పందిరి వేసి పెట్టారు.

సన్యాసి ఇవన్నీ చూసుకోలేక తపస్సు దారి తప్పుతోందని గ్రహించి ఊళ్లో ఈ విద్యలన్నీ తెలిసిన ఒక అనాథ యువతిని కొండమీద ఆశ్రమంలో ప్రవేశపెట్టారు. ఒకానొక కారు చీకటి కమ్మిన వేళ ఆ యువతిలో సన్యాసికి కాంతి రేఖ కనిపించింది. అంతే పెళ్లి కాకుండానే శోభనం జరిగిపోయింది.

విషయం తెలుసుకున్న ఊరి పెద్దలు పంచాయతీ పెట్టి శాస్త్రోక్తంగా పెళ్లి చేశారు. ఇంత సంసారంతో ఈ కొండమీద ఉండలేను…కొండ దిగి ఊళ్లోకి వచ్చేస్తాను అని సంసారిగా మారిన సన్యాసి చేసిన డిమాండును ఊరి జనం పెద్ద మనసుతో అంగీకరించారు. ఊరవతల అవుటర్ రింగ్ రోడ్డును ఆనుకుని సరికొత్త సంసారి సువిశాలమయిన గృహాశ్రమం కట్టుకుని పిల్లాపాపలతో, గొడ్డూ గోదాతో హాయిగా కాలం గడపసాగాడు.

ఈ సన్యాసి సంసారిగా ఎందుకు మారాడు అని ఎవరయినా అడిగితే…ఆరోజు నుండి “కౌపీన సంరక్షణార్థం” అని సమాధానం వస్తోంది. కౌపీనం అంటే గోచీ గుడ్డ. సంరక్షణార్థం అంటే రక్షించుకోవడానికి. గోచీ గుడ్డను రక్షించుకోవడానికి జరిగిన సన్యాసి పరిణామక్రమ సిద్ధాంతమిది.

సందర్భం:-

కౌపీన సంరక్షణార్థం సన్యాసేమో కాషాయం వదిలి…సాంసారం బాటపడితే…డ్రగ్స్ కేసు వార్తల్లో పేరుపొందిన నటి మమతా కులకర్ణి ప్రస్తుత మహాకుంభమేళాలో ప్రాపంచిక సుఖాలు వదిలి…కాషాయం స్వీకరించింది.

“ఓడలు బండ్లవుతాయి-
బండ్లు ఓడలవుతాయి”.

2016 లో కెన్యాలో రెండువేల కోట్ల డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ఆమె భర్త విక్కీ గోస్వామితోపాటు అరెస్ట్ అయ్యింది మమతా కులకర్ణి. అది గతం. గతం గతః. ఈమె ఆమె కాదు. ఈమె శ్రీయామై మమతానందగిరి. ఈమె ఈమే. డ్రగ్స్ కేసు నుండి బయటపడడానికే తెలివిగా సన్యాసం స్వీకరించిందని అనుకునేవారి కళ్ళు పేలిపోవూ!

“…ఉన్నావా!
అసలున్నావా!
ఉంటే కళ్ళు మూసుకున్నావా?”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions