.
మనదేశంలో తాంత్రిక ఆలయాలలో ‘తారాపీఠ్’ కి ఒక ప్రత్యేకత ఉంది.ఇది తాంత్రిక దేవాలయంగా ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ తారాదేవి అమ్మవారికి శవ భస్మంతో అర్చన జరుగుతుందనీ అంటారు. తాంత్రిక శక్తులు కోరుకునే వారు ఈ అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తుంటారు. అందు కోసం ప్రత్యేక పూజలు కూడా చేస్తుంటారు.
గౌహతిలోని కామాఖ్య ఆలయం కూడా వామాచార అర్చన రీతులకు పెట్టింది పేరు… సరే, తారాపీఠ్ విషయానికి వస్తే…
Ads
ఈ ఆలయానికి సమీపంలో ఉన్న శ్మశానం లో అఘోరాలు, తాంత్రికులు, మంత్రగాళ్ళు తాంత్రిక శక్తి కోసం పూజలు చేస్తుంటారు. వారి పూజలు భయంకరంగా ఉంటాయని చెబుతుంటారు.ఈ ఆలయం పశ్చిమ బెంగాల్ లోని బీర్బుమ్ జిల్లాలో ‘తారాపీఠ్’ అనే చిన్న పట్టణంలో ఉంది.పెద్ద సంఖ్యలో ఇక్కడికి భక్తులు వస్తుంటారు. ఇక్కడ అమ్మవారిని ఏది అడిగినా కరుణించి ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం.
అమావాస్య రోజుల్లో అమ్మవారి విగ్రహానికి అద్భుతమైన శక్తి ఉంటుందని … ఆ సమయంలో దేవిని ఉపాసన చేసిన వారికి తాంత్రిక శక్తులు సిద్ధిస్తాయని అంటారు. ఆరోజుల్లో పక్కనే ఉన్న శ్మశానంలో తాంత్రిక పూజలు ఎక్కువగా జరుగుతుంటాయి. విదేశాల నుంచి కూడా ఇక్కడికి ఎక్కువ మంది పర్యాటకులు వస్తుంటారు.
దేవాలయంలో అమ్మవారికి రెండు విగ్రహాలు ఉన్నాయి. ఒక విగ్రహం శివుడికి పాలు ఇచ్చేదిగా కనిపిస్తుంది. ఇది రాతితో నిర్మితమైన నల్లటి విగ్రహం. ఈ విగ్రహం ఎల్లప్పుడూ పూలతో కప్పిఉంటుంది. కేవలం అమ్మవారి మొహం మాత్రమే చూడటానికి వీలవుతుంది. మరొకటి వివిధ లోహాలతో చేసిన విగ్రహం. ఈ విగ్రహ రూపం భయంకరంగా ఉంటుంది.
నాలుగు చేతులతో, రుధిరవర్ణ నేత్రాలతో అమ్మ ఆగ్రహంగా ఉంటుంది. చేతుల్లో ఆయుధాలను కలిగి ఉంటుంది. కపాళ హారాన్ని ధరించి భయం గొలిపే రీతిలో ఉంటుంది. ఈ రూపాన్నే తాంత్రికులు ఎక్కువగా పూజిస్తుంటారు. ఇక్కడ జంతు బలులు ఎక్కువగా జరుగుతుంటాయి. మామూలు భక్తులు కూడా అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు జంతువులను తెచ్చి బలి ఇస్తుంటారు.
ఇక ఆలయం పక్కన ఉన్న శ్మశానంలో ఉంటూ తాంత్రికులు అమ్మవారికి పూజలు చేస్తుంటారు. అఘోరాలు కూడా ఇక్కడ ఉంటారు. దేవీ ఉపాసకులు తాంత్రిక విద్యల సాధన కోసం ఇక్కడికి వస్తుంటారు. తారామతి దేవి శ్మశానంలో ఎక్కువగా సంచరిస్తారని తాంత్రిక స్వాముల నమ్మకం. అందుకే వారు రాత్రిళ్ళు ఇక్కడ పూజలు చేస్తుంటారు. భక్తులు కూడా ఆలయానికి వెళ్లి దేవిని కొలిచి వెనక్కి వెళతారు కానీ శ్మశానం వైపు వెళ్లరు.ఈ ఆలయం దేశంలోని 51 శక్తి పీఠాలలో ఒకటి.
కన్నె పిల్లలు ఎవరూ అటు వైపు చూడరు. కలకత్తా ఎయిర్ పోర్టు నుంచి 216 కిలోమీటర్ల దూరంలో ఈ ‘తారాపీఠ్’ ఉంది. అక్కడ నుంచి ప్రైవేట్ ట్యాక్సీల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. తారాపీఠ్ కి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో రాంపుర్హాట్ రైల్వే స్టేషన్ నుంచి బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. ఆలయం పరిసరాల్లో హోటళ్లు కూడా ఉన్నాయి. వసతి సదుపాయానికి ఇబ్బంది లేదు… ——- KN MURTHY
Share this Article