.
నిజమే… తెలంగాణ కాంగ్రెస్, ప్రభుత్వవర్గాల్లోనే ఓ చర్చ సాగుతోంది… ఎలాగూ అవకతవక పాలన విధానాలతో ప్రభుత్వం మీద క్రమేపీ వ్యతిరేకత పెరుగుతోంది… బీఆర్ఎస్ ప్రతి ఇష్యూను అవకాశంగా తీసుకుంటూ ముప్పేట దాడి చేస్తోంది…
మీడియా, పాలిటిక్స్, ఎత్తుగడలు, గాలి పోగేసి రాద్ధాంతం, సోషల్ మీడియా, మీమ్స్, రీల్స్… వాట్ నాట్..? ప్రభుత్వ పనితీరు, విధానాల మీద ఒక ప్రతిపక్షం ఎలా దూకుడుగా విరుచుకుపడొచ్చో హరీష్, కేటీయార్ చేసి చూపిస్తున్నారు…
Ads
కేసీయార్ ఫామ్ హౌజు దాటని రాజనీతిజ్ఞరాహిత్యం నడుమ కూడా… ఆ ఇద్దరే ముఖ్యనేతలు తప్ప మిగతా గొంతులకు పెద్దగా పార్టీలోనే ప్రాధాన్యం లేకపోయినా… కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని పదే పదే ఇరకాటంలో పెడుతోంది… దీనికి ప్రతిగా అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి కౌంటర్ చేతకావడం లేదు…
పాజిటివ్‌ను జనంలోకి తీసుకుపోలేదు, వచ్చే నెగెటివిటీని ఆపుకోలేదు, ప్రచార దాడులకు కౌంటర్ లేదు… నిజంగా కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని చూస్తే మరీ జాలేసింది ఎక్కడంటే..? అబ్బే, మొన్నటి పిచ్చి ట్విట్టర్ పోల్‌తో తనంతటతనే బట్టలిప్పుకున్న ఉదంతం కాదు… కులగణన, వర్గీకరణ…
నిజానికి ఈ రెండు అంశాలూ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మంచి మైలేజీ తీసుకురావాలి… జాగ్రత్తగా ప్రచారాన్ని ప్లాన్ చేసుకుని ఇంప్లిమెంట్ చేసినట్టయితే..! కానీ ఏం జరిగింది..? మైలేజీ రాలేదు కదా, ఉల్టా వ్యతిరేకత అంటే, కౌంటర్ ప్రాడక్ట్ అవుతున్నాయి…
చివరకు సొంత పార్టీ నేతలు కూడా బీసీ కులగణనను, ఎస్సీ వర్గీకరణను చెండాడుతుండటంతో మరింత బలంగా నెగెటివ్‌గా జనంలోకి వెళ్లిపోతున్నాయి… సరే, ఆషామాషీ కులగణన అనే ఆరోపణలు, అశాస్త్రీయ ఎస్సీ వర్గీకరణ తీరు అనే విమర్శలను కాసేపు పక్కన పెడితే…
ఈ రెండు కీలక సందర్భాలను బలంగా జనంలోకి పాజిటివ్‌గా తీసుకెళ్లాలనే సోయి ఏమాత్రం కనిపించలేదు… ఫర్ డిబేట్ సేక్, ఒకటి అనుకుందాం… అరె, కేసీయార్ ఇలాంటివేమీ చేయడు గానీ, ఒకవేళ చేసి ఉంటే..?
మీడియాలో ఆ కులగణన సర్వేను ఊదరగొట్టేవాళ్లు… ప్రజాప్రతినిధులు తమ తమ నియోజకవర్గాల్లో మస్తు ప్రచారం చేసుకునేవాళ్లు… ఫస్ట్ కేసీయార్ కుటుంబం నుంచి, ప్రధాన కార్యదర్శి కుటుంబం నుంచి సర్వే ప్రారంభమయ్యేది… మీడియాలో టాంటాం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల కుటుంబ సర్వే ఫోటోలు…
తరువాత అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల ఎజెండాను ప్రచారం చేసేవాళ్లు… అసెంబ్లీలో ఆ నిర్ణయాల ఆమోదం జరిగిన వెంటనే ఊరూరా ఆయా నిర్ణయాల లబ్దిదారులు, ఆ సంఘాలతో కేసీయార్ చిత్రపటాలకు పాలాభిషేకాలు జరిగేవి… పటాకులు కాల్చేవాళ్లు… ఓ ఉత్సవంగా, చారిత్రిక సందర్భాలుగా చిత్రించేవాళ్లు…
కాంగ్రెస్ పార్టీ ఏం చేయగలిగింది..? ఈ తరహా క్యాంపెయిన్‌లో కనీసం ఒక్క శాతమైనా చేయగలిగిందా…? ఒక్క ఈనాడు, ఒక్క సాక్షికి ఇచ్చే ఫస్ట్ పేజీ యాడ్ డబ్బుతో రాష్ట్రంలోని ప్రతి మండలంలోనూ ఏదో ఒక కార్యక్రమం చేయించగలిగేవాళ్లు కాదా… కనీసం అదీ చేతకాలేదా..?
పార్టీ, ప్రభుత్వ మీడియా రిలేషన్స్ ఫ్లాప్… సోషల్ మీడియా వాడకమూ ఫ్లాప్… వెరసి, విశేష నిర్ణయాలు తీసుకుని, కాస్తోకూస్తో పాజిటివిటీని మూటగట్టుకోవాల్సింది పోయి, ఉల్టా నెగెటివిటీని సంపాదించుకుంది… ఫాఫం… ఇదుగో నమస్తే తెలంగాణ క్యాంపెయిన్ చూడండి ఓసారి… ఆ పత్రికను ఎవడు చదువుతున్నాడు అనే ప్రశ్న కాదు, మాకెందుకు ఇవి చేతకావు అనే ప్రశ్న వేసుకోవాలి పార్టీ ముఖ్యులు, ప్రభుత్వాన్ని నడిపే ముఖ్యులు..!!
Share this Article