.
Prabhakar Jaini ……. ఓటీటీలో గేమ్ ఛేంజర్ సినిమా చూశాక నాకు అనిపించిన విషయాలు ఇవి… రాంచరణ్‌ను దర్శకుడు శంకర్ బలిపశువును చేశాడు…
నిజంగానే, శంకర్ ఆలోచనాసరళి గతి తప్పిందని ఈ సినిమా చూసిన తర్వాత అర్థమైంది. సినిమా మొత్తాన్ని రీఎడిట్ చేసి సెకండ్ హాఫ్‌ను ముందు చూపించి, ఫస్ట్ హాఫ్‌ను తరువాత చూపించే విధంగా స్క్రీన్ ప్లే రాసుకుని ఉంటే సినిమా సక్సెస్ అయ్యేది.
Ads
అనవసరమైన పాత చింతకాయ పచ్చడి బిల్డప్‌ల కన్నా సెకండ్ హాఫ్‌లో రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉంది. విషాదం, సెంటిమెంట్ పండేది. ఆ కథాబలంతో మిగిలిన కథను చెబితే, సినిమా ఇంట్రెస్టింగుగా ఉండేది.
పేలవమైన ప్రారంభం మూలంగా బలమైన సెకండ్ హాఫ్‌కు కూడా విలువ లేకుండా పోయింది. హీరో హీరోయిన్ల మధ్య అసలు కెమిస్ట్రీ కుదరలేదు. ఆ ‘డోప్’ అనే మాటకు అర్థం తెలుసా? దాన్ని పాటలో ఇరికించడానికి చెత్త ఎక్స్‌ప్లనేషన్!
పాటలు పెద్ద మైనస్. అవసరం లేని, పనికి రాని ఆడంబరాలను గ్రాండియర్‌గా చూపించాలనే అర్థరహిత తపన తప్ప సినిమాకు ఏది అవసరమో అది చేయలేదు. ఆ పాటలకు పెట్టిన ఖర్చుతో నేను యాభై మంది తెలుగు సాహిత్య, సామాజిక, దేశభక్తుల జీవిత చరిత్రల సినిమాలను నిర్మించేవాణ్ణి.
దిల్ రాజు పేరు భారత సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేవాణ్ణి. కానీ, మన వాళ్ళకు అరవ ఆవ, యావ అంటే ఇష్టం కదా? IPS పాత్ర ఎలివేషన్ శుద్ధ దండగ. దానికి హెలికాప్టర్లు, యుద్ధాలు, కొన్ని కోట్ల ఖర్చు వృధా. కలెక్టరుగా సెలెక్ట్ అయినవాడు రైల్లో లుంగీ కట్టుకుని పడుకుంటాడా? విలన్లు అయిన వాళ్ళంతా ఎప్పుడూ రాసక్రీడల్లోనే తేలుతుంటారా?
రెండు జిల్లాల మధ్య సరిహద్దు అనేది బుర్ర తక్కువ సంఘటన. ఒక కలెక్టరు మరొక కలెక్టరును సస్పెండ్ చేయగలడా? సెన్స్ లెస్! దానికి బ్రహ్మానందంను పెట్టి ఆయన పరువును, సినిమా పరువును, హీరో పరువును తీసారు. పక్కా జిల్లా కలెక్టర్ చెప్తే, ఇంకో జిల్లా కలెక్టర్ కింద పనిచేసే తన టైపిస్ట్ అతనికే సస్పెన్షన్ ఆర్డర్ టైప్ చేస్తారా?
ఒక జూనియర్ మోస్ట్ ఐఏయస్ ఆఫీసరును రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నియమిస్తారా? అసలు ఎన్నికల కమీషనర్ గా నియమించబోయే ముగ్గురు ఆఫీసర్ల పేర్లను రాష్ట్ర ప్రభుత్వమే పంపాలన్న మినిమం పరిఙ్ఞానం కూడా లేదు డైరెక్టరుకు. అప్పుడు రామ్ చరణ్ పేరును సీయం ఎందుకు పంపుతాడు?
సినిమా మొత్తంలో అసహ్యమైన పాత్ర సునీల్ ది. వెగటు, వెకిలి హాస్యం. ఇది గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామం. నిర్మాతను సెట్లోకి రానివ్వకపోవడం, కథ గురించి ఆయనకు చెప్పకపోవడం, తనేం చేస్తున్నాడో దర్శకునికే అంతు చిక్కకుండా పోవడం వలన వచ్చిన ప్రారబ్ధం ఇది.
లేకపోతే రాజమౌళి శాపం పనిచేస్తుందా? ఆయన సినిమాలో నటించిన తర్వాత రెండు మూడు సినిమాల వరకు హీరోలను అపజయం వెంటాడుతుందనే వారు అప్పట్లో. ఇప్పుడూ అదే రిపీట్ అవుతుందా? దేవర, గేమ్ ఛేంజర్, రెండూ RRR అనే అభూతకల్పనల చిత్రం తర్వాత వచ్చినవే?
పైరవీలు చేసి అవార్డులు కొట్టడం కాదు. మన కథ, మన టెక్నిక్, మన దమ్ము చూపించి అవార్డులేం ఖర్మ, ఆస్కారులే కొట్టొచ్చు. అటువంటి సత్తా కలిగిన తెలుగు దర్శకులు, కమర్షియల్, రొడ్డకొట్టుడు సినిమాల యావలో ఉన్నారు. మనమేం చేస్తాం? మన ఖర్మ అనుకోవాలి! అంతే!
ఒక చిన్న సంతోషం ఏమిటంటే సినిమాలో హీరో, మెయిన్ విలన్లు, డైరెక్టర్, నిర్మాత అందరూ క్లీన్ షేవ్ తో నున్నగా ఉన్నారు. ఈ మధ్య ఏ సినిమా చూసినా మొత్తం నటులంతా, డైరెక్టర్లు, నిర్మాతలూ బూచోళ్ళలాగా పెద్ద పెద్ద గడ్డాలు పెంచుకునే ఉంటున్నారు. పేన్లూ గట్రా దూరవా? అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా ఫీలవుతున్నారో ఏమో?
Share this Article