.
తెలంగాణ వైశ్య కుటుంబాల్లో ఎక్కువగా కనిపించే కొన్ని వంటకాలు ఇతర కుటుంబాల్లో కనిపించవు, చాలామందికి తెలియవు… ఉదాహరణకు.., పబ్బియ్యం (పప్పు బియ్యం, పోపు బియ్యం), పేనీలు, జంతకాలు, రైలు బండి పలారం ఎట్సెట్రా… (ఇవి ఏపీ, ఇతర వైశ్య కుటుంబాల్లో ఉన్నాయో లేదో తెలియదు..)
పేనీలు దీపావళికి మాత్రమే ప్రత్యేకం… మహారాష్ట్ర స్వీట్… ఇన్‌స్టంట్ స్వీట్… నెయ్యి లేదా డాల్డాతో చేయబడే పేనీల్లో చక్కెర కలిపిన పాలు పోసుకుని కలుపుకుని తినేయడమే… రైలు బండి పలారం అంటే ఏమిటని అడిగింది ఓ ఫేస్ బుక్ మిత్రురాలు…
Ads
ఇదొక చిరుతిండి, టిఫిన్… రైళ్లలో దూరప్రయాణాలకు వెళ్లినప్పుడు దీన్ని తీసుకుని వెళ్తుంటారు… కూరలు, చారులు, చట్నీలు, ఊరగాయ, పెరుగు గట్రా ఏమీ అక్కరలేదు… జస్ట్, డబ్బా ఓపెన్ చేసుకుని తినేయడమే… కాస్త ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది… అందుకని రైలు బండి పలారం అంటారని ఎవరో చెప్పారు… సరే, పేరు పుట్టుక చరిత్ర జోలికి వెళ్లకుండా సింపుల్‌గా అదేమిటో చెప్పాలనుకుంటే…
(కొత్తగా చేసుకునేవాళ్ల ఇంట్రస్టు కొద్దీ ఇంగ్రెడియెంట్స్ కాస్త మార్చుకోవచ్చు… తెలంగాణ కొత్త వైశ్య తరానికి కూడా ఈ పలారం (ఫలహారం, అనగా టిఫిన్, అల్పాహారం) ఎలా చేసుకోవాలో తెలియదు… పైగా ప్రయాస కాస్త ఎక్కువే…)
మీకు ఒకవేళ వినాయకచవితి ఉండ్రాళ్లు, కుడుములు చేయడం వస్తే ఈ వంటకం కూడా పరమ సులభం… దాదాపు సేమ్… కాకపోతే కుడుములకు ఆధరువులు కావాలి… ప్రత్యేకించి కొత్త లేత చింతకాయ తొక్కు ప్లస్ ముద్ద పప్పు సూపర్ కాంబినేషన్… ఈ రైలు బండి పలారానికి అవేవీ అక్కర్లేదు… కాస్త వివరంగా చెప్పాలంటే…
(steemed rice flored balls…) (పెద్ద ఇంగ్రెడియెంట్స్ కూడా అక్కర్లేదు…) (కుడుములను సన్నగా ముక్కలుగా కోసి రైలు బండి పలారం టైపులో పోపు పెడతారు చాలామంది చవితి రోజుల్లో…)
బియ్యప్పిండి రెండు కప్పులు, నీళ్లు ఒకటిన్నర కప్పులు, రెండు చెంచాల నూనె, ఓ స్పూన్ ఉప్పు… అంటే, తగినంత అని… ప్లస్ తాజాగా తురిమిన అరకప్పు కొబ్బరి, ఓ చిన్న ఉల్లిపాయ, ముప్పావు కప్పు పెసరపప్పు, పచ్చి మిర్చి నాలుగైదు చిన్నవి, కాస్త అల్లం, రుచికి సరిపడా ఉప్పు, సగం కప్పు నూనె, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, జిలకర, ఆవాలు, మినప్పప్పు, రెండు మూడు ఎండు మిర్చి… ఇవి చాలు…
పెసర పప్పు నానబెట్టండి అరగంటపాటు… ఓ పాన్‌లో నీళ్లు, ఉప్పు, నూనె వేసి మరిగించి, బియ్యపుపిండి వేసి చిక్కటి పిండిలా కలపండి, కుడుములకు కలిపినట్టే… కాస్త చల్లారనిచ్చి, చేతులు కాస్త నూనె పూసుకుని సన్నని రోల్స్ చేసుకొండి… ఫోటోలో చూశారుగా, అదే సైజు…
ఇక వీటిని ఉడికించాలి కదా… మామూలుగా మీరు కుడుములను ఎలా ఉడికిస్తారు..? ఎస్, అలాగే వీటినీ ఉడికించండి… ఇడ్లీ కుక్కర్ కూడా వాడొచ్చు… ఆవిరి మీద ఉడికించడం, అంతే… ఓ పావుగంట ఉడికాక పక్కన పెట్టేయండి…
నానబెట్టిన పెసరపప్పు, పచ్చి మిర్చి, ఉల్లిపాయ, అల్లం కూడా జార్‌లో వేసి పేస్టులా చేయండి… ఓ పాన్‌లో నూనె వేసి కాస్త వేడయ్యాక జిలకర, ఆవాలు, కరివేపాకు (పోపు) వేయండి, దానికి ఎండు మిర్చి, మినప్పప్పు జోడించండి… (నానబెట్టిన పెసరపప్పు యాడ్ చేస్తే బెటర్..) ఇక దీనికి పసుపు, ఉప్పు ప్లస్ తురిమిన కొబ్బరి, ముందు ప్రిపేర్ చేసుకున్న మసాలా కలపండి…
ఉడికించిన బాల్స్ ఉన్నాయి కదా… వాటిని ఇందులో వేసి ఆరేడు నిమిషాలు స్టవ్వు మీద ఉడికించండి… ఉప్పూకారం, మసాలాలు అన్నీ ఆ చిన్న బంతులకు సమానంగా అంటుకోవాలి… తరువాత కాస్త కొత్తిమీర కలిపేసి దింపేయడమే…
బాల్స్ చేయడానికి ముందే పెద్ద ముద్దలు చేసుకుని మురుకు మేకర్‌లో పెట్టి నూడుల్స్‌గా ఒత్తుకుంటే అవే జంతకాలు… అవి కొత్త ఆవకాయ, కొత్త బియ్యం, మామిడి రసంతో సూపర్… (కేరళలో ఇడియాప్పం అని చేస్తారు కానీ చేసే విధానం వేరు…) రైలుబండి పలారం చేయడానికి ఆ బాల్స్ ఒకే సైజులో గుండ్రంగా చేసుకోవడమే ప్రయాస… కానీ అదే దీని స్పెషాలిటీ కూడా..!!
Share this Article