ఓ వార్త కనిపించింది మొదట… ఇవాళ్టి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన.. మూడు రోజులపాటు దక్షిణాది ఆలయాలను సందర్శించనున్న పవన్…
అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరస రామస్వామి, అగస్త్య జీవసమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాల సందర్శన…
సనాతనధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ పర్యటనకు ప్రాధాన్యత…… ఇదీ ఓ వాట్సప్ న్యూస్ గ్రూపులో కనిపించిన ఓ వార్త… (సనాతన ధర్మపరిరక్షణకూ దక్షిణాది గుళ్ల సందర్శనలకూ, దర్శనాలకూ లింక్ ఏమిటట..? సరే, వదిలేయండి…)
.
Ads
తరువాత కాసేపటికి మరో వార్త… అందులో పవన్ కల్యాణ్ అకీరాతో కలిసి కొచ్చిలోని అగస్త్య ఆలయంలో కనిపించాడు… వీడియోలు కూడా… సో, దక్షిణాది గుళ్ల సందర్శన స్టార్టయింది… వోకే, తన ఇష్టం, తన ఆచరణ, తన భక్తి… ఐతే… నిన్న తను ఒక కీలకమైన మీటింగుకు హాజరు కాలేదు… చంద్రబాబు తన మంత్రులు, సంబంధిత శాఖల కీలకాధికారులతో భేటీ అది…
అందులో నాదెండ్ల మనోహర్ చంద్రబాబుకు ఓ వివరణ ఇచ్చాడు… పవన్ కల్యాణ్‌కు రెండు వారాలుగా తీవ్రమైన నడుం నొప్పి, వైరల్ ఫీవర్ అన్నాడు… లేవలేకపోతున్నాడు… కానీ తెల్లారేసరికి హఠాత్తుగా అన్ని నొప్పులూ ఎలా హాంఫట్ అయిపోయాయి… అదే మీటింగులో చంద్రబాబు చెబుతున్నాడు…
అవును, నేను కూడా తనతో మాట్లాడాలని ట్రై చేశాను, అందుబాటులోకి రాలేదు అని… ఒక సీఎం ప్రయత్నిస్తే ఒక డిప్యూటీ సీఎం అందుబాటులోకి రాలేదు అనే ఆ వ్యాఖ్యే విచిత్రంగా ధ్వనించింది… పైగా తెల్లారే చకచకా నడుస్తూ సుదూర ప్రాంతాలకు వెళ్తున్నాడు… ఏదో తేడా కొడుతున్నట్టు ఉంది కదా…
కొన్నాళ్ల ముందు కేబినెట్ మీటింగుకు కూడా హాజరు కానట్టు గుర్తు… హాజరు కాలేకపోతున్నట్టు సమాచారం మాత్రం ఇచ్చాడు… కానీ ఈసారి ఏదీ లేదు… ఏం జరుగుతోంది..? అసలే లోకేష్ యాక్టింగ్ సీఎం అయిపోతున్నట్టు వార్తలు… తనను కూడా డిప్యూటీ సీఎంను చేయాలని టీడీపీ కేడర్ కొన్నాళ్లు రచ్చ మొదలుపెట్టినా సరే, చంద్రబాబు వాటికి తెరవేశాడు…
నిజానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే విశేషాధికారాలు ఏమీ ఉండవు… తోటి మంత్రులకు ఉన్నట్టే ప్రొటోకాల్… కానీ కొన్ని సందర్భాల్లో పవన్ కల్యాణ్ మరీ సీఎం రేంజులో వ్యవహరించాడు… అదీ కూటమి ప్రభుత్వంలో కొందరికి నచ్చడం లేదనీ వార్తలు… ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ చంద్రబాబు మీటింగులకు హాజరు గైర్హాజరు కావడం ఆసక్తికరమే…
సిక్స్ హామీల అమలులో కిందామీదా పడుతోంది ప్రభుత్వం… రేవంత్ రెడ్డి నయం వాగ్దానాల అమలుకు ఏదోరకంగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు… కానీ చంద్రబాబు మాత్రం ఆర్థిక స్థితి బాగాలేదనీ, సంపద సృష్టి జరిగేంతవరకూ వేచి ఉండాలనీ అంటున్నాడు… సంపద సృష్టి అనేది ఓ భ్రమపదార్థం, అది తనకూ తెలుసు… ఈ స్థితిలో సీఎం, డిప్యూటీ సీఎం నడుమ ఆల్రెడీ స్పర్థలు స్టార్టయ్యాయా అనే సందేహాలకు తావిస్తున్నది పవన్ కల్యాణ్ వ్యవహారశైలి…
ఒకవైపు హరిహర వీరమల్లు షూటింగ్ కంప్లీటయిపోతోందని వార్తలు… అందులో బిజీ అయిపోయాడా పవన్ కల్యాణ్..? పోనీ, అదే చెప్పొచ్చు కదా..! ఒకవైపు బీజేపీ చిరంజీవిని దువ్వుతోంది, విశేష ప్రాధాన్యం ఇస్తోంది… రాజకీయాల్లోకి నేను మళ్లీ రాను అంటూనే పవన్ కల్యాణ్ నా పొలిటికల్ టార్గెట్లను నెరవేరుస్తాడనీ చిరంజీవి వ్యాఖ్యానాలు చేస్తున్నాడు… ఈ జనసేన నా పాత ప్రజారాజ్యానికి రూపాంతరం అంటున్నాడు… అసలు ఏమిటి ఆ టార్గెట్లు..? కూటమిలోని రెండు పార్టీల నడుమ ఏదో జరుగుతోంది..? ఏమిటది..?
Share this Article