.
సరిగ్గా రెండున్న దశాబ్దాలకు పూర్వం.. 1997. అది, కాచిగూడ తారకరామ సినిమా హాల్… ఫస్ట్ డే, ఈవినింగ్ ఫస్ట్ షో చూడాలని గట్టి పట్టుబట్టి ఓ సినిమా చూశాను.
బిగ్ స్క్రీన్ పై ఎంజీఆర్, కరుణానిధి పాత్రలు ప్రత్యక్షమయ్యాయి. అందులో కరుణానిధి మినహా.. అప్పటికే ఎంజీఆర్ కన్నుమూశాడు. మరెట్లా సిల్వర్ స్క్రీన్ పై కనిపించాడంటే.. ఇద్దరు సినిమా రూపంలో.
Ads
తమిళ రాజకీయాల్లో ఎంజీఆర్, కరుణానిధి ఇద్దరూ ఇద్దరే. ఇద్దరూ రెండు కళ్లు, రెండు చేతులు, రెండు కాళ్లు, రెండు చెవుల లాంటివారే.
వారి స్ఫూర్తితో మణిరత్నం తెరకెక్కించి ఒకేసారి రెండు భాషల్లోనూ విడుదల చేసిన చిత్రమే తమిళ ఇరువరు, తెలుగు ఇద్దరు.
ఆ ఇద్దరే ఒకరు మోహన్ లాల్.. ఇంకొకరు ప్రకాష్ రాజ్.
రెండున్నర దశాబ్దాలైంది కదా సినిమా తీసి… ఇప్పుడోసారి మళ్లీ దాన్ని సిల్వర్ స్క్రీన్ పై… ఆ అవకాశంగనుక లేకుంటే, మీ ఇంట్లో ఓటీటీలో చూడండి. ఎలాంటి ఫీల్ పొందుతారో మీకే అర్థమైతుంది.
గిట్టాక మట్టిలో కలిసే ఈ దేహాన్ని ఒడలు మన్నంట అని చెప్పిన తీరు.. ప్రాణమున్నంతవరకూ జీవం నిప్పులాంటిదని ఉసురు నిప్పంట అన్న పదాలు గ్రాంథికమనిపించి అర్థం కాకపోయి ఉండొచ్చు. కానీ, రాజకీయ ప్రత్యర్థైన తన ఆత్మబంధువైన మిత్రుడి మరణంతో కృంగిపోయిన ప్రకాష్ రాజ్ రూపంలో వేటూరి చెప్పిన ఆ కవిత్వం మనసును తట్టిలేపుతుంది.
పూనగవే పూలది లేనగవే వాగుది అంటూ తన నీడతో పోటీపడి ఆడే ఐశ్వర్య అందాలు.. వెనకనున్న నిండు చందమామకు సైతం అసూయగొల్పేవి. శశివదనే అంటూ నాట, మాండు రాగాల కలయికలో సన్నటి తీగలాంటి ఉన్నికృష్ణన్ మేల్ వాయిస్ కు కాంట్రాస్ట్ గా బాంబే జయశ్రీ గంభీరమైన గొంతు కలిసి ఎంతలా మైమరిపిస్తుందో… పూనగవే ప్రశాంతంగా వింటే అంతకన్నా ఆనందాన్నిస్తుంది.
నీలవర్ణం సెలవంటే ఆకశమే గాలి కదా.. సూర్యుడునే వేకువ విడితె తొలి దిశకు తిలకమెలా.. ?
నన్నికపై విడిచావా నా ఉసురిక నిలవదులే అంటూ పాత పాటల శైలిలో సాగే ఈ పాట బ్యూటీ ట్యూన్ మెస్మరైజ్ చేసేది.
కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత క్యారెక్టర్స్ అందరికీ తెలిసినవే. అలాంటి ద్రవిడ రాజకీయాల స్ఫూర్తితో వారి జీవితాలను ప్రతిబింబిస్తూ తెరకెక్కించడం వరకైతే కొంత క్యూరియాసిటీని బ్యాగ్ చేసుకోవచ్చునేమోగానీ.. అంతకుమించి తీయగల్గితేనే సినిమా మాస్టర్ పీస్ అవుతుంది.
ముఖ్యంగా మణి ఆలోచనలకు సంతోష్ శివన్ అనే కెమెరా కన్ను జోడించి.. సిల్వర్ స్క్రీన్ పై కలర్ సినిమాలు ఊపేస్తున్నకాలంలో.. అక్కడక్కడా బ్లాక్ అండ్ వైట్ సీన్సునూ పండిస్తూ సినిమాను గత చరిత్రలోకి తీసుకెళ్లారు. అందుకే మణిరత్నం సినిమాల్లోనే ది బెస్ట్ గా క్రిటిక్స్ ఇద్దరు సినిమాను చెబుతారు.
ఏ ముహూర్తంలో మణి మళయాళ రైటర్ వాసుదేవనాయర్ తో సంభాషించాడో ఆ సమయంలో పురుడు పోసుకున్న ఐడియా ఇద్దరు సినిమాగా రూపుదిద్దుకుంది.
ఇద్దరు సినిమాలో ఎంజీ రామచంద్రన్, కరుణానిధి పాత్రల్లో మోహన్ లాల్, ప్రకాష్ రాజ్ గురించి ఎలా చెప్పుకుంటున్నామో… ఈ ఇద్దరు సినిమాను మాస్టర్ పీస్ గా మల్చిన మణిరత్నం ఆయన వెనుకున్న కెమెరా కన్ను సంతోష్ శివన్ గురించీ అంతకన్నా ఎక్కువే చెప్పుకోవాలి.
ఒక విజువల్ ఫీస్ట్ ఎలా సృష్టించాలో సంతోష్ శివన్ కు తెలుసు. ఆ విషయం మణిరత్నంకు అంతకన్నా ఎక్కువే తెలుసు. అందుకే ఈ ఇద్దరి కలయికలో కెమెరా ఫ్రేమ్స్ మనతో మాట్లాడతాయి. 1950ల నాటి సినిమా, రాజకీయ నేపథ్యాలను ఒడిసిపట్టి తెరకెక్కించే క్రమంలో.. ఇతర దర్శకుల సినిమాల్లో కనిపించని.. మణిరత్నంకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి షాట్స్ అబ్బురపరుస్తాయి.
సినిమా సెట్టింగ్స్ లో పనిచేస్తున్నప్పుడు ఆనంద్ (ఎంజీఆర్) పాత్రలోని మోహన్ లాల్ కళ్లు ఓ ఖాళీ సింహాసనంపై పడతాయి. ఆ సింహాసనంపైన మోహన్ లాల్ కూర్చునేందుకు వెళ్లుతూ.. దాన్ని చూసి మురిసిపోవడం వంటివి భవిష్యత్తులో తాను ఊహించుకుంటున్న రాజకీయ సింహాసనాన్ని సింబాలిక్ గా చూపించే షాట్ అది. గ్లింప్స్ ఇన్ ఆంబిషన్ మనకు కనిపిస్తుంది.
అదే సింహాసనం ముందు ఆనంద్ (ఎంజీఆర్) పాత్రధారి మోహన్ లాల్ నిల్చున్నప్పుడు.. సమరసూర్యం (కరుణానిధి) పాత్రలోని ప్రకాష్ రాజ్ కవితలతో మంత్రముగ్ధుణ్ని చేస్తూ మోహన్ లాల్ వైపు వస్తుంటాడు. తనవైపు వస్తున్న ప్రకాష్ రాజ్ ను అలా చూస్తూ ఉండిపోతూనే.. మోహన్ లాల్ సహజంగానే వెనక్కి వెళ్లుతూ ఉంటాడు. ఆ క్రమంలో ఆనంద్ సమరసూర్యానికిచ్చే గౌరవాన్ని.. అదే సమయంలో సమరసూర్యం అప్పర్ హ్యాండ్ గా ఉండాలనుకునే మనస్తత్వాన్నీ ప్రతిబింబిస్తుంది మణి, సంతోష్ కలిసి తీసిన ఆ షాట్.
అదే సమయంలో మోహన్ లాల్ వైట్ అండ్ వైట్ డ్రెస్ తన ఆశయంలో సరళతను ప్రతిబింబిస్తే.. ప్రకాష్ రాజ్ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సింగ్ ఆయన తెలివితేటలతో పాటు, నియంతృత్వాన్నీ పట్టిచూపేలా.. నలుపు, తెలుపు ఛాయల్లో రాజకీయ చదరంగాన్ని స్ఫురించేలా చిత్రీకరించిన ఆ సీన్ ఇంకో అద్భుతం. ఎందుకంటే, ఓవైపు స్నేహం, పరస్పర గౌరవం.. ఇంకోవైపు ఆధిపత్య ధోరణి ఇవన్నీ ఒకే ఫ్రేములో బంధించడమంటే దాని వెనుక ఎంతో సృజనాత్మక కసరత్తు జరిగుండాలి.
ఇంకో అదిరిపోయే ఫ్రేమ్ గురించీ చెప్పుకోవాలి. ఆనంద్ కింద బేస్ మెంట్ పైన ఉంటే.. కోటపైన రెపరెపలాడుతున్న తన పార్టీ జెండా పక్కన.. పైన ఆకాశాన్ని కూడా సింబాలిక్ గా చూపిస్తూ తానెంత ఎత్తులో ఉన్నాడో సమరసూర్యం పాత్ర చెబుతుంది. మూలాలు మరవని ఆనంద్ పాత్ర మాత్రం దురాశకు దూరంగా నేల విడిచి సాము చేయొద్దనే సారాంశాన్నిస్తుంది.
సినిమా టాకీస్ లో కల్పన (జయలలిత) పాత్రధారి ఐశ్వర్యారాయ్ ను ఆడిషన్స్ కోసం పరిశీలిస్తున్నప్పుడు.. అద్దంలోని ఆమె ప్రతిబింబాన్ని చూస్తూ.. తన పక్కనున్న భార్య రమణి (జానకీ రామచంద్రన్) పాత్రధారి గౌతమిని కూడా మర్చిపోయి మెస్మరైజ్ అవుతాడు ఆనంద్. తన మొదటి భార్య పుష్పవల్లే తిరిగి మళ్లీ పుట్టిందా అన్నట్టు సాగే ఆనంద్ ఊహాచిత్రణను ఒడిసిపట్టే చిత్రీకరణ మరో హైలెట్.
ఆనంద్ సమరసూర్యం నీడ నుంచి బయటపడి కొత్త పార్టీ పెట్టే క్రమమది.. ఓ నాయకుడి సంస్మరణ సభ సందర్భంగా ఆనంద్ ఉద్వేగభరిత ప్రసంగాన్ని రెండున్నర నిమిషాల పాటు 360 డిగ్రీల కోణంలో కెమెరా తిప్పుతూ తీసిన ఆ షాట్ ఆ సినిమా ప్రధాన లక్ష్యాన్ని తెలియపర్చే ఓ గుండెకాయలాంటిది.
ఆనంద్ గద్దెనెక్కాక సమరసూర్యంతో నేరుగా కలిసినప్పుడు ఆనంద్ లోని ఆశావహ దృక్పథం, ప్రశాంతత నుంచి క్రమంగా తన ధర్మాగ్రహాన్ని చూపిస్తూనే… ముఖాముఖి మాట్లాడుకుంటున్నప్పుడు ఆనంద్ తో సమరసూర్యం సూటిగా కళ్లల్లోకి చూడని ఆ సీన్ కూడా మరో హైలెట్.
సమరసూర్యం తన కుర్చీలో అటూ ఇటూ తిరుగుతూ.. పైకి సంయమనంగానే కనిపిస్తున్నా, అంతర్గతంగా ఆనంద్ పై అసూయతో రగిలిపోవడాన్ని ప్రతిబింబించేలా తీసిన ఆ సీన్ మరో మాస్టర్ పీస్.
కేవలం నటీనటుల నటన, హావభావాలు, డైలాగ్స్, పాటలు, ఫైట్సే కాదు.. సినిమాలోని ప్రతీ డిపార్ట్మెంట్ ప్రతిభా కనబడాలి. ప్రతీ షాట్ ఒక అంతర్లీనమైన ఓ సమాచారాన్నందించాలి.. షాట్ చిత్రీకరించే పరిసరాలు ఆ సమయంలో చిత్రీకరించే సబ్జెక్ట్ ఆంబియెన్స్ ను కళ్లగ్గట్టాలి.
ఇలా దృశ్యాలతో, సంగీతంతో, అద్భుతమైన నటీనటులతో, తమిళులు బాగా మెచ్చే సబ్జెక్టుతో, పకడ్బందీ స్క్రీన్ ప్లే, కథ, మాటలు, దర్శకత్వంతో నిర్మించగల్గాడు కాబట్టే.. ఇద్దరు ఓ మణియై, ఓ రత్నమై నిల్చింది.
ఈ సినిమా 1997 టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో మాస్టర్స్ విభాగంలో ప్రదర్శించారు. విమర్శకుల ప్రశంసలతోపాటు బెల్గ్రేడ్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రం పురస్కారాన్ని, రెండు జాతీయ చలనచిత్ర పురస్కారాలను పొందింది.
2012లో, ఇద్దరు సినిమాను విమర్శకుడు రాచెల్ డ్వెయర్ 2012 బ్రిటీష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సైట్ అండ్ సౌండ్ 1000 ఆల్-టైమ్ అతిగొప్ప చలనచిత్రాల జాబితాలో చేర్చారు, ఈ జాబితాను అత్యంత విలువైన సినిమా పోల్ గా ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటుంటారు…….. { రమణ కొంటికర్ల… }
Share this Article