.
ఓ మిత్రుడి సీరియస్ ప్రశ్న… ‘అందరూ ఛావా సినిమా మీద ఏదేదో రాస్తున్నారు… తిట్టేవాళ్లు, మెచ్చుకునేవాళ్లు, ప్రమోట్ చేసేవాళ్లు, సోషల్ మీడియాలో ఏకిపారేసేవాళ్లు… అవన్నీ పక్కన పెట్టండి కాసేపు…
వీక్కీ కౌశల్ నటనను ఆకాశానికెత్తుతున్నారు… అహో ఆంధ్ర భోజా అన్నట్టు కీర్తిస్తున్నారు… దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్, సంగత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌లనూ పొగుడుతున్నారు… కానీ ఒక్కరిని అందరూ విస్మరిస్తున్నారు, అన్యాయం కదా’’ ఇదీ తన ఫ్లో…
Ads
ఎవరిని విస్మరిస్తున్నారు..? నేషనల్ క్రష్ అని పేరు తెచ్చుకున్న రష్మిక గురించా..? అనడిగాను మొహం ప్రశ్నార్థకంగా పెట్టి… ‘ఎహె కాదు, ఆమె ఉంది, అంతే… పెద్దగా కీలక పాత్ర కాదు, ఆమె పాపులారిటీ ఈ సినిమాకు పెద్ద యూజ్‌ఫుల్ కూడా కాదు…’’ అన్నాడు తను… సరే, అది తన అభిప్రాయం…
మరి..? అన్నాను నేను… ‘మిత్రమా… ఏ సినిమా అయినా తీసుకో… విలన్ గట్టిగా ఉండాలి… దీటుగా పోటీపడాలి… పాత్ర కేరక్టరైజేషన్ మాత్రమే కాదు, విలన్ పాత్ర పోషించేవాడు కూడా హీరోకు దీటుగా నటన పర్‌ఫామ్ చేయాలి, అప్పుడే హీరోయిజానికి ఎలివేషన్, పండుతుంది ఆ పాత్ర…’ అన్నాడు తను…
‘నిజమే’ అని అంగీకరించాల్సి వచ్చింది నేను… నిజమే కాబట్టి… తను అక్షయ్ ఖన్నా గురించి చెప్పబోతున్నాడు… నాకర్థమైందిలే అని ఆపేశాను… ఎస్, ఔరంగబేజు పాత్ర పోషించిన అక్షయ్ ఖన్నా గురించి… ఈ ఛావా సినిమాకు సంబంధించి తనకు దక్కాల్సిన గుర్తింపు, క్రెడిట్స్, ప్రశంసలు దక్కలేదేమో అనిపించింది… తను తప్ప ఇంకెవరూ ఆ పాత్రలో అలా నటించేవాళ్లు కారేమో అన్నంతగా..!
తన లుక్కు, తన మేకప్పు మాత్రమే కాదు… ఆ పాత్రను ఔపోసన పట్టినట్టు… కళ్లల్లో ఆ క్రౌర్యం, పెద్ద డైలాగులు ఏమీ లేకపోయినా ఔరంగజేబును కళ్ల ముందుంచాడు… తన నటన ఒకరకంగా విక్కీ కౌశల్ పాత్రకు, తన నటనకు పెద్ద ఎలివేషన్…
వినోద్ ఖన్నా కొడుకు… ఎప్పుడో 1997లో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తే, ఈరోజుకూ బోలెడు భిన్నమైన పాత్రలు వేస్తున్నాడు గానీ ఛావాలో ఔరంగజేబు పాత్రే తన కెరీర్‌లో హైలైట్… మొన్న ఎక్కడో ఇంటర్వ్యూలో చెబుతున్నాడు… తన జుత్తు రాలిపోవడం గురించే బాగా బాధపడ్డాను అని…
నిజమే కదా… ఇండస్ట్రీలో బట్టతల అతి పెద్ద మైనస్ పాయింట్ కదా… ఎన్ని ప్రయత్నాలు చేసినా జుత్తు నిలవలేదు, అదొక్కటే నా కెరీర్‌లో నా రిగ్రెట్ అని నవ్వుతూ చెబుతున్నాడు… పర్లేదు అక్షయ్… నువ్వు ఇప్పుడు దేశమంతా పరిచయమైన తోపు విలన్‌వు…!!
Share this Article