.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు మీద నేషనల్ మీడియాలో చాలా విశ్లేషణలు వచ్చాయి… కొన్ని రొటీన్ ఫార్ములా రివ్యూలు… ప్రభుత్వ వ్యతిరేక వోటు పనిచేసిందనీ, కేజ్రీవాల్ పార్టీ నుంచి నాయకుల్ని బీజేపీ కొనేసిందనీ, కేజ్రీవాల్‌పై అవినీతి కేసుల ప్రభావం బాగా పడిందనీ… ఇలా…
ఒక విశ్లేషణ కాస్త డిఫరెంటుగా… ఒక వ్యక్తిని ఫోకస్ చేసింది… ఆ వ్యక్తి చాణక్యం వల్లే ఢిల్లీలో బీజేపీ గెలవగలిగిందని దాని సారాంశం… గత రెండు ఎన్నికల్లో ఓసారి 67, మరోసారి 62 సీట్లతో అత్యంత బలంగా ఉన్న ఆప్ పార్టీని ఓడించడం చాలామందికి నమ్మశక్యం కావడం లేదు ఇప్పటికీ… అంత సులభమూ కాదు…
Ads
కానీ ఆయన జనవరిలో చెప్పాడు, తన పని మీద తనకున్న నమ్మకంతో… ‘మేం రెండొంతుల మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం’ అని..! ఆయన పేరు వైజయంత్ జైపాండా… ఢిల్లీ పార్టీ ఇన్‌ఛార్జి తను… బీజేపీ విజయం వెనుక ప్రధాన సూత్రధారి, ప్రణాళికకర్త తనే అంటారు బీజేపీ కేడర్… మోడీ, అమిత్ షా, నడ్డా తదితరులు తనకు ‘కార్యాచరణ స్వేచ్ఛ’ను ఇచ్చారు…
నిజానికి ఆయన సంఘ్ నుంచి ఎదిగిన నాయకుడు కాదు… తను బేసిక్‌గా బిజూ జనతాదళ్ నాయకుడు… తొమ్మిదీపదేళ్లు ఆ పార్టీలో ఉన్న ఆయన 2019లో నవీన్ పట్నాయక్‌ను వదిలేసి బీజేపీలో చేరాడు… అంటే బీజేపీలో తన వయస్సు ఐదారేళ్లు, అంతే… 2021లో అస్సాం ఎన్నికల బాధ్యతనూ తను నిర్వర్తించాడు, అక్కడ ఎన్‌డీఏ గెలిచింది…
తరువాత 2024 అక్టోబరులో తనకు ఢిల్లీ బాధ్యతలు ఇచ్చారు… 1998 నుంచి ఢిల్లీలో పార్టీ అధికారంలో లేదు… మరోవైపు ఆప్ బలం తక్కువ కాదు… ఈ స్థితిలో బీజేపీ హైకమాండ్ తనపై నమ్మకాన్ని ఉంచింది… ప్రస్తుతం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు తను…
బీజేపీ మేనిఫెస్టో, సంఘ్‌తో సమన్వయం, ప్రచార సరళి, ఇంటింటికీ సంఘ్ కార్యకర్తల ప్రచారం, పెద్ద నాయకుల మీటింగులు, ప్రధాని మోడీతో చెప్పించాల్సిన హామీల దగ్గర నుంచి… తెర వెనుక పార్టీ వ్యవహారాలన్నీ చక్కబెట్టింది ఈయనే… అందుకే బీజేపీ విజయాన్ని అందరికన్నా ఎక్కువ ఆస్వాదిస్తున్నది కూడా ఈయనే..!!
అన్నట్టు… స్మృతి ఇరానీ, పర్వేశ్ వర్మ, బాన్సురి స్వరాజ్ తదితరుల పేర్లకు బదులు రేఖా గుప్తా పేరును బలంగా ప్రతిపాదించి, అందరినీ ఒప్పించి సీఎం పీఠం మీద కూర్చోబెట్టడంలోనూ ఈయనదే ప్రధాన పాత్ర అట..!
Share this Article