.
ఓ వాట్సప్ న్యూస్ గ్రూపులో ఓ చిన్న వార్త ఆసక్తికరం అనిపించింది… ముందు అది చదవండి…
30 సంవత్సరాల తర్వాత చంద్రబాబునాయుడు గారి నివాసంలో (ఉండవల్లి) డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు నాయుడు గార్ల కలయిక…
Ads
డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రచించిన “ప్రపంచ చరిత్ర” (ఆది నుండి.. నేటి వరకు..) పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించి కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ గారు, మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు మరియు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు పాల్గొనే విషయమై..
– కొండలరావు
ఎడిటర్ , గుండ్లకమ్మ
ఫోటో ఉంది కదా, నమ్మొచ్చు… ఆ కలయిక జుబ్లీ హిల్స్ రాజప్రాసాదంలో కాదు… ఇంకా ఎవరికీ అందులోకి ప్రవేశం లేదు… ఆ వైభోగాన్ని ఎవరు చూసినా దిష్టి తగులుతుందని కావచ్చు, ముఖ్యులను కూడా రానివ్వరు…
సరే, ఈ వార్తలో ఇంట్రస్టింగు అనిపించింది 30 ఏళ్ల తరువాత ఇద్దరు షడ్డకులు కలవడం…! ఇద్దరూ కలిసి మామకు వెన్నుపోటు పొడిచి, కుర్చీ దింపారు… తరువాత వెంకటేశ్వరరావు తప్పు తెలుసుకున్నాడు అనడంకన్నా చంద్రబాబు తత్వాన్ని మరింతగా చూసి, ఓరకమైన ఏవగింపుతో దూరం జరిగాడు అంటారు మరి…
రాజకీయాలు అంటే అంతే… అందులో కుటుంబబంధాలు, ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు జాన్తా నై… సొంత మామకు వెన్నుపోటు మాత్రమే కాదు… సొంత షడ్డకులే రాజకీయ వైరుధ్యాలతో 30 ఏళ్లు దూరదూరం ఉన్నారంటేనే అర్థమవుతోంది కదా…
నిజానికి వెంకటేశ్వరరావు ఇప్పుడు రాజకీయాల్లోనే లేడు… తన రచనావ్యాసంగం తప్ప వేరే వ్యాపకం లేదు… కానీ ఆయన భార్య పురంధేశ్వరి ఇప్పటికీ చురుకైన రాజకీయవేత్త…. ఎప్పుడూ వాళ్లు ఒక కూటమిలో లేరు… ఆమె ఎక్కువకాలం కాంగ్రెస్‌లో ఉంది… తీరా చంద్రబాబు కాంగ్రెస్‌కు దగ్గరయ్యాక ఆమె బీజేపీలో ఉంది…
ఇన్నాళ్లకు ఆ రెండు కుటుంబాలూ ఒకే అధికార కూటమిలో ఉన్నాయి… సో, ఇప్పుడు ఆ దూరం తరిగి, ఒక కలుసుకున్నారు… ఆయనది తన సొంత పార్టీ, ఆమెది బీజేపీ… వెంకటేశ్వరరావు వయస్సు 71 ఏళ్లు ఇప్పుడు… చంద్రబాబు వయస్సు 74 ఏళ్లు… ఓ మూడేళ్లు పెద్ద… మరి ఈ వయస్సు దాకా రాజకీయ వైరుధ్యాలు మరిచిపోయి, ఎందుకు కలవలేకపోయాయి ఈ కుటుంబాలు… షడ్డకులే కదా…
ఈ ప్రశ్నకు చంద్రబాబు దగ్గర కూడా సమాధానం ఉండదు… ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అదే… చూశాం కదా, జూనియర్ ఎన్టీయార్‌ను కూడా తన ప్రచారానికి వాడుకుని, తరువాత దూరం పెట్టేశాడు, తన లోకేష్‌కు థ్రెట్ అవుతాడు కదా… పైగా తన వియ్యంకుడు బాలయ్యకు జూనియర్ అంటే అస్సలు గిట్టదు… ఎన్టీయార్‌కు నటవారసుడు జూనియర్ కావద్దని..!
రాజకీయాలు, వైరుధ్యాలు ఒక దశ వరకే… అవి సొంత కుటుంబ బంధాల్ని కూడా దెబ్బతీసేంతగా పెరగనివ్వొద్దు… ఈ మాట వాళ్లిద్దరికీ ఇప్పటివరకూ ఎవరూ చెప్పలేకపోయారు… ఐనా చెప్పనిస్తే కదా..!!
Share this Article