.
హేమిటో… కేంద్ర మంత్రి, అదీ హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి… బండి సంజయ్ ఇంకా తాను కరీంనగర్‌లోనే ఉండిపోయినట్టు కనిపిస్తోంది… తను చేసే ప్రతి వ్యాఖ్య హుందాగా, తన మీద గౌరవం పెరిగేలా చూసుకోవాలి…
ప్చ్, అది లోపించినట్టుంది… లేెకపోతే కాంగ్రెస్ పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఏమిటి..? ఎన్‌డీయే ఇండియన్ టీమ్ ఏమిటి…? బీజేపీ శ్రేణులకు నచ్చుతుందేమో ఈ పోకడ, కానీ చవకబారు రాజకీయ వ్యాఖ్యల కిందకు వస్తాయి… ప్రధాన ప్రతిపక్షాన్ని ఓ శత్రుదేశపు క్రికెట్ జట్టుగా పరిగణించడం ఏమిటి అసలు..? కాంగ్రెస్ వాళ్లు వేరే దేశస్తులు ఎట్లయ్యారు…? పోల్చడంలో కూడా కాస్త హేతువు, పద్ధతి, మర్యాద అవసరం రాజకీయాల్లో…
Ads
అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు… ఎందుకు..? అసలు శాసనమండలి ఉనికే వృథా అనే అభిప్రాయం దేశమంతా ఉంది… అదొక రాజకీయ పునరావాస కేంద్రంగా భావిస్తున్నాయి పార్టీలు… ఇక ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు ఓ కోడ్, పైగా సెలవులు కావాలా..?
అంతేనా..? ఏమయ్యా, రేవంతూ, ఈ ఎన్నికను రెఫరెండమ్‌గా ప్రకటిస్తావా..? ఓడిపోతే ఏం చేస్తావు..? అని సవాల్ విసురుతాడు… ఇదేమిటి..? గ్రాడ్యుయేట్స్, టీచర్ల వోట్లు ఎన్ని.,.? ఆ రెండు సెక్షన్ల తీర్పు, పైగా ఆ వోట్ల సంఖ్య ప్రజాభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తాయా..? ఇదెలా రెఫరెండమ్ అవుతుంది..? రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన బీఆర్ఎస్ అసలు పోటీలోనే లేదు…
నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతోంది… మరోవైపు బీఆర్ఎస్ ఓవరాక్షన్ కూడా జనానికి పెద్దగా నచ్చడం లేదు… ఈ స్థితిలో బీజేపీ రాష్ట్ర రాజకీయాల్లో ఇంకాస్త ఎదగడానికి ప్రయత్నించాలి సీరియస్‌గా… ఇప్పుడు టీడీపీ, జనసేన కూడా సపోర్ట్… (సరే, చంద్రబాబు, పవన్ కల్యాణ్ మద్దతు ప్లస్సా మైనసా అనేది వేరే చర్చ…)
కానీ ఏం జరుగుతోంది..? ఇదుగో సంజయ్ ధోరణి ఇదీ… మరోవైపు రాజాసింగ్ అతివాదం… కిషన్‌రెడ్డిది ఓ బాట… అవసరార్థం బీజేపీలోకి వచ్చిన ఈటలది మరో పోకడ… బీజేపీ బండిని ఎవరు ఎటువైపు లాక్కుపోతున్నారో వాళ్లకే తెలియదు… బహుశా మోడీ, అమిత్ షా స్వయంగా తెలంగాణలో కొన్నాళ్లు తిష్ట వేసినా పెద్ద ప్రయోజనం ఉండదేమో అన్నట్టుగా ఉంది…
ఫార్ములా కేసులో కేటీయార్‌ను ఎందుకు అరెస్టు చేయలేదో చెప్పు రేవంత్ అనే సూటి ప్రశ్న, విద్యుత్తు కొనుగోళ్ల విచారణ రిపోర్టును ఎందుకు బయటపెట్టడం లేదనే విమర్శలు మాత్రం సంజయ్ మాటల్లో వాల్యూ ఉన్నవి… నిజంగానే రేవంత్ బీఆర్ఎస్ నేతల జోలికి పోవడానికి ఎందుకు భయపడుతున్నాడనే భావన ప్రజల్లో కూడా ఉంది…
ఫోన్ ట్యాపింగ్ సీబీఐకి అప్పగించు, వెంటనే నిందితుల్ని అరెస్టు చేస్తాం అంటాడు సంజయ్… సీబీఐకి అప్పగిస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు… అసలే బీఆర్ఎస్, బీజేపీ లోపాయికారీ అవగాహన అని జనం సందేహం… ఇక సీబీఐకి అప్పగిస్తే ఏం జరుగుతుంది..? సో, ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ నేతలకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని లెక్క..!!
Share this Article