.
బురద రాజకీయం… క్షుద్ర రాజకీయం… ఇలాంటి పదాలెన్ని వాడినా సరే… బీఆర్‌ఎస్ ముఖ్యులు హరీష్ రావు, కేటీయార్ చేస్తున్నది అదే… కచ్చితంగా అదే… ఈ మాట ఎందుకు అంటున్నానంటే కాస్త సీరియస్‌గా, చివరి దాకా చదవండి…
ఎస్ఎల్‌బిసి ప్రమాదం నిజంగా ఎందుకు జరిగిందో తెలుసా..? 8 మంది విషయంలో ఆశలు ఎందుకు వదిలేసుకున్నామో తెలుసా..? కేసీయార్..! SLBC పనులు మొత్తానికే ఆపేశాడు… కారణం రేవంత్ రెడ్డి చెప్పినట్టు కమీషన్లు భారీగా రావడం లేదు కాబట్టి అనే విమర్శ ఎలా ఉన్నా… పనులు ఆపేయడమే అసలు సమస్య…
Ads
సాఫీగా టన్నెల్ బోరింగ్ మిషన్ పనిచేస్తూ పోతుంటే, సొరంగం చుట్టూ ఎప్పటికప్పుడు గ్రౌటింగ్ జరుగుతూ ఉంటే… సీపేజీలు, మట్టి లూజ్ కావడం, విరిగిపడటం వంటివి తక్కువ… ఎప్పుడైతే ఆపేశారో అంతా అస్తవ్యస్తం అయిపోయింది…
ప్రభుత్వ నిర్లక్ష్యం అనే దిక్కుమాలిన విమర్శలు… అది ప్రమాదం… మేడిగడ్డలో నాణ్యత నిర్లక్ష్యం… తెలిసీ చేసిన తప్పులు… ఇప్పుడు పిల్లర్లు కాదు, ఒక బ్లాకే మళ్లీ కట్టాలి… సచివాలయం పెచ్చులు కూలతాయి, సుంకిశాల రిటెయినింగ్ వాల్ కొట్టుకుపోతుంది… అవన్నీ పక్కనపెట్టి ఎస్ఎల్‌బీసీ మీద పడ్డారు…
హరీష్‌రావు సందర్శన అట… తను ఇరిగేషన్ మినిస్టర్‌గా ఉన్న కాలమే కదా ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్టునే బొంద పెట్టడానికి ప్రయత్నించింది… అక్కడ కుర్చీ వేసుకుని కూర్చుంటా, ఎట్లా పనులు జరగవో చూస్తా అని కేసీయార్ అప్పట్లో బోలెడు మాటలు మాట్లాడాడు కదా, మరెందుకు ఆపేసినట్టు… మేడిగడ్డకు పోయి ఏం పీకుతారు అని ప్రశ్నించాడు కదా అప్పట్లో… మరి ఇప్పుడు హరీష్ రావు పోయి ఏం చేస్తాడు కేసీయార్..?
ఘటన జరిగి ఇన్ని రోజులైనా సహాయ చర్యలు స్టార్ట్ కాలేదు అనే హరీష్ విమర్శ తన స్టేటస్ ఆఫ్ మైండ్ ఏమిటో చెబుతోంది… (ఇంకా ఈయనపై బీజేపీకి చావని షిండే ఆశలు)…
60 మందికి పైగా మరణించిన కొండగట్టు బస్సు ప్రమాదం జరిగితే కేసీయార్ ఎలా ప్రవర్తించాడో మరిచినట్టున్నాడు హరీష్‌రావు, కేటీయార్… కవిత విమర్శలను వదిలేయండి.., గతంలో మనమేమిటి..? ఇప్పుడేం చేస్తున్నామనే సోయి లేకపోతే ఎలా..? ప్రతిదీ రాజకీయానికి వాడుకోవాలా..? చివరకు ప్రమాదాలను కూడా..! very much disgusting…
రేవంత్ రెడ్డి ఇది విడిచిపెట్టి హెలికాప్టర్లలో తిరుగుతున్నాడు, ప్రచారానికి పోతున్నాడు, ఢిల్లీకి వెళ్తున్నాడు వంటివన్నీ మతిలేని పిచ్చి విమర్శలు… ఉత్తమకుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి రెగ్యులర్‌గా వెళ్తూ సమీక్షిస్తున్నారు… జూపల్లి కృష్ణారావును మెచ్చుకోవాలి, సొరంగంలో పైనుంచి మట్టిపెళ్లలు కూలిన ప్లేసు దాకా వెళ్లాడు… రెగ్యులర్ సమీక్ష… అక్కడి ఎమ్మెల్యే వంశీకృష్ణ అక్కడే ఉంటున్నాడు… దేశంలో పేరెన్నిక గన్న ఇంజినీరింగ్ ఎక్స్‌పర్ట్స్ అందరూ అక్కడే ఉన్నారు… టెలికాం సిగ్నల్స్ కూడా ఉండవు అక్కడ…
అంతెందుకు..? హరీష్ రావూ… మన దేశంలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని రీతిలో రెస్క్యూ ఆపరేషన్ సాగుతోంది… 11, మళ్లీ చదవండి పదకొండు విభాగాలు రంగంలో ఉన్నాయి… 1) ఎన్డీఆర్ఎఫ్ 2) ఎస్డీఆర్ఎఫ్ 3) సింగరేణి రెస్క్యూ టీమ్స్ 4) ర్యాట్ హోల్ మైనర్స్ 5) ఇండియన్ ఆర్మీ 6) ఇండియన్ నేవీ 7) బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ 8) హైడ్రా 9) జీఎస్ఐ 10) ఎన్‌జీఆర్ఐ… వీళ్లు గాకుండా ఎల్అండ్‌టీ, నవయుగ కంపెనీల ఎక్స్‌పర్ట్స్… నాడు ది గ్రేట్ ఉత్తరాఖండ్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన నిపుణులు కూడా…
ఇప్పుడు తాజాగా మార్కోస్… The Marine Commando Force (MARCOS) ఎయిర్, ల్యాండ్ అండ్ సీ… అన్నింటా ఇలాంటి ఆపరేషన్లకు పెట్టింది పేరైన కమాండోలు… ఎస్, దేశం, మన తెలుగు రాష్ట్రాలు ఎప్పుడూ వినని స్థాయిలో రెస్క్యూ ప్రయత్నాలు… ఇప్పుడు అక్కడికి వెళ్లి బీఆర్ఎస్ టీమ్ చెత్తా రాజకీయం కాకపోతే చేసేది ఏముంది అక్కడ..? కావల్సింది ప్రచారం… అదీ క్షుద్రం…
అసలు 44 కిలోమీటర్ల సొరంగమే ప్రపంచంలోకెల్లా విశిష్టం… అటువైపు ఒక టీబీఎం, ఇటువైపు ఇంకో టీబీఎం… మధ్యలో పనులు ఆగిపోయి రెండూ వేస్ట్… ఇది మూడో టీబీఎం… ప్రపంచ ప్రఖ్యాత టన్నెల్ బోరింగ్ మిషన్ డ్రైవర్ లీడ్ చేస్తున్నాడు… ఈ పనులు చేసే జేపీ అసోసియేట్స్ కూడా ప్రొఫెషనల్ ఇంజినీరింగ్ కంపెనీ… YS గనుక బతికి ఉంటే దశాబ్దం క్రితమే పూర్తయ్యేది ఈ సొరంగం…
పైనుంచి కూలిన రాళ్లు, మట్టి పెళ్లలతో టన్నెల్ బోరింగ్ మిషన్ విరిగిపడి, విడిభాగాలు మీటర్ల కొద్దీ దూరం పరుచుకున్నాయి ఇప్పుడు… నిమిషానికి 3 వేల లీటర్ల నీరు పైనుంచి కారుతోంది… రాళ్లు, మట్టిపెళ్లలు… వెరసి బురద… పాపం శమించుగాక, ఇన్నిరోజులైంది, ఆ ఎనిమిది మంది మీద ఆశలు వదులుకోవల్సిందే… బయటికొస్తేనే అదొక అద్భుతం…
ట్రాక్ చిన్నాభిన్నం… నీటిని బయటికి పంప్ చేస్తున్నారు వోకే, చివరకు బురదనూ సక్ చేసి బయటికి చిమ్మేసే యంత్రాలు తెచ్చారు… కానీ రాళ్లు…? ఇప్పుడిక టీబీఎం స్పేర్ పార్ట్స్ బయటికి తెస్తూ ప్రమాద స్థానానికి వెళ్లాలి… ఆ తరువాత..? ఒకవేళ కాంగ్రెస్ సర్కారు చిత్తశుద్ధితో ఉంటే మళ్లీ జీరో నుంచి స్టార్ట్ చేయాలి ఈ ప్రాజెక్టు…
సిట్యుయేషన్ పూర్వాపరాలు ఇవీ… ఇక్కడ నేను మోడీని మెచ్చుకుంటున్నాను… ప్రమాదం జరిగిన గంటల్లోనే స్పందించి, ఆరా తీసి, ప్రతి విభాగమూ దీనిపై కాన్సంట్రేట్ చేయాలని అన్ని కేంద్ర విభాగాలకూ ఆదేశాలు ఇప్పించాడు… ఒక్క చిన్న పొలిటికల్ చెత్తా స్టేట్‌మెంట్ లేదు, ఓ ప్రధానిగా హుందాగా వ్యవహరించాడు… స్టేట్ బీజేపీ కూడా అది అర్థమై సంయమనం పాటిస్తోంది… ఇక అదే బీజేపీ రహస్య స్నేహితుడు బీఆర్ఎస్ క్షుద్ర రాజకీయం ఏమో ఇలా ఉంది…
రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిందించడానికి… అనేక ఫెయిల్యూర్స్ ఉన్నాయి… ప్రభుత్వానికి ఓ దశ లేదు, ఓ దిశ లేదు… అదే తిట్టండి, జనంలో ఎండగట్టండి, నిలబెట్టండి, కడగండి… కానీ ప్రమాదాల్ని క్షుద్ర రాజకీయాలకు వాడకండి…. రేవంత్ రెడ్డికి ఎలాగూ బీఆర్ఎస్ నాయకుల్ని పాత అక్రమాల్లో ఫిక్స్ చేసే సత్తా లేదు, కనీసం ఇలాంటి క్షుద్రరాజకీయాలకు అనుమతించకుండా నియంత్రించడం చేతనవుతుందా..?!
Share this Article