.
అనుకుంటాం గానీ… అల్లుళ్లే కాదు, మేనల్లుళ్లు కూడా దశమగ్రహాలే సుమీ… కాకపోతే అల్లుళ్లు బయటి నుంచి మన ఇంటికి వచ్చినవాళ్లు… మేనల్లుళ్లు మన ఇంటివాళ్లు… ఎవరైతేనేం..? సేమ్ సేమ్… రాజకీయాల్లో, వారసత్వ పంచాయితీల్లో…
ఎన్టీయార్- చంద్రబాబు పాత కథ కాదండీ బాబూ… జామాతా దశమగ్రహం అనే మాట ఏనాటి నుంచో ఉన్నదే… లోకానుభవం అది… సరే, రాజకీయాల్లో మేనల్లుళ్ల సంగతికొద్దాం… ఇప్పుడు కాదు గానీ… ఒక దశలో ముగ్గురు మహిళా ముఖ్యమంత్రులు… బెంగాల్, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్…
Ads
మాయావతి, మమతా బెనర్జీ, జయలలిత… ముగ్గురూ తమ పార్టీలకు సుప్రీం బాసులు… ప్రాంతీయ పార్టీలు… పెళ్లిళ్లేవు, కనుక రాక్తవారసుల్లేరు… జయలలితకు శశికళే అన్నీ… ఒకసారి బయటకు వెళ్లగొట్టినా సరే, మళ్లీ తెచ్చుకుని నెత్తిన పెట్టుకుంది, అనుభవించింది… అదో సపరేట్ స్టోరీ…
మమతా బెనర్జీకి ఓ మేనల్లుడున్నాడు… అభిషేక్ బెనర్జీ… తెర వెనుక తనదే ఆధిపత్యం… పార్టీ మీద, ప్రభుత్వం మీద… ప్రతిపక్షాల మీద దాదాగిరీలోనా… యాక్టింగ్ సీఎం… వేరే దిక్కులేదు, తనను వదులుకోలేదు ఆమె… ఇది ఓ మేనల్లుడి కథ…
మాయావతిది మరో కథ… తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను పార్టీకి సంబంధించిన అన్ని పదవుల నుంచి తప్పిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది… నిన్నటిదాకా నేషనల్ పార్టీ కోఆర్డినేటర్ తను… గతంలో కూడా ఓసారి ఇలాగే పార్టీ నుంచి బయటికి పంపించినట్టు ప్రకటించింది… మళ్లీ తెచ్చి పార్టీ బాధ్యతలు ఇచ్చింది… ఇప్పుడిక మళ్లీ…
ఆకాశ్ తనకు మేనల్లుడు… కానీ తనకూ ఓ మామ ఉంటాడు కదా… అశోక్ సిద్ధార్థ్… పార్టీ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే బ్యాచ్ అట… మొత్తం పార్టీనే రెండుగా చీల్చే ప్రయత్నం చేశాడనే కోపంతో మాయావతి రెండు నెలల క్రితమే తనను బహిష్కరించింది… ఇప్పుడిక ఆకాశ్‌ను కూడా పంపించేసింది…
అంతేకాదు, ఇక తన జీవితాంతం పార్టీకి వారసులంటూ ఎవరూ ఉండరనీ ఖండితంగా చెప్పింది… ఆకాశ్ తండ్రి మీద మాత్రం తనకు కాస్త సాఫ్ట్ కార్నర్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు తను… సో, ఇప్పుడు తనను ప్లస్ రామ్‌జీ గౌతమ్ అనే రాజ్యసభ ఎంపీని జాతీయ సమన్వయకర్తలుగా నియమించింది… మళ్లీ కుటుంబసభ్యుడి మీదే నమ్మకం…
ఒక నితిశ్… వారసుల్లేరు… వారసుడు అనుకున్న ప్రశాంత్ కిశోర్ చెడగొట్టుకున్నాక, ఈమధ్య ఎవరినో కాస్త ట్యూన్ చేస్తున్నాడు… ఒక నవీన్ పట్నాయక్… వారసుల్లేరు… నువ్వేరా నా వారసుడివి అని తమిళనాడుకు చెందిన పాండ్యన్ అనే ఓ ఐఏఎస్ అధికారిని నెత్తిన పెట్టుకుంటే వర్కవుట్ కాలేదు, పార్టీ ఓటమి పాలైంది… ఇప్పుడు పాండ్యన్ పరిస్థితేమిటో తెలియదు…
ఒక పినరై విజయన్… అల్లుడే వారసకిరణం… ఒక శరద్ పవార్… మగవారసుల్లేరు… అన్న కొడుకును చేరదీస్తే మొత్తం పార్టీకే ఎసరుపెట్టాడు… ఇలా బోలెడు వారసకథలు… ఏతావాతా చెప్పొచ్చేదేమిటీ అంటే రాజకీయాల్లో కొడుకులు, అల్లుళ్లు… వాళ్లు లేకపోతే ఇతర కుటుంబసభ్యులే వారసులు… అల్లుళ్లకన్నా మేనల్లుళ్లు ఏమీ తక్కువ కాదు… (అవసరమైతే షిండేలు కూడా కాగలరు…) ఇదీ కథ సారాంశం…
Share this Article