.
Paresh Turlapati ………. రాజకీయ నాయకులకు దేవుడిచ్చిన వరం రెండు నాలుకలు….. అవసరానికీ.. సందర్భానికీ తగ్గట్టుగా సరైన సమయంలో ఆ నాలుకలు తమ పని తాము చేస్తాయి
వైఎస్ఆర్ మరణానికి ముందు వరకూ విజయ సాయి రెడ్డి జగన్ వ్యాపార సామ్రాజ్యానికి ఆడిటర్ గానే చాలామందికి తెలుసు… వైఎస్ మరణంతో జగన్ విజయ సాయి రెడ్డిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చారు.
Ads
తీసుకురావడమే కాదు, పార్టీలో దాదాపు నెంబర్ టూ స్థానం ఇచ్చి ప్రోత్సహించారు, సీబీఐ పెట్టిన కేసుల్లో జగన్ తో పాటు విజయసాయి రెడ్డి కూడా ఇరుక్కున్నారు, ఆ టైమ్ ఇద్దరికీ విషమ పరీక్షే…
జగన్ను కాదని విజయసాయి ఒంటరి పోరాటం చేయలేడు, అప్పట్లో రాజకీయ వర్గాల్లో విజయసాయి పలుకుబడి అంతంత మాత్రమే, అన్చేత విజయ సాయికి కూడా జగన్ మినహా వేరే ఆల్టర్నేటివ్ లేదు
అటువంటి విపత్కర పరిస్థితుల్లో…
అదృష్టం జగన్నూ.. విజయసాయినీ ఒకేసారి వరించింది, జగన్ సిఎం అయ్యారు… విజయసాయి రాజ్యసభ సభ్యుడు అయ్యాడు, అందివచ్చిన అవకాశాన్ని విజయసాయి దొరకబుచ్చుకుని ఢిల్లీలో చక్రం తిప్పారు…
ఎంతలా అంటే కేసులూ.. సీబీఐ.. కోర్టులు.. విచారణలతో ఉక్కిరిబిక్కిరి అయిన విజయసాయి ఎంపీ అయిన తర్వాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రధాని మోడీ చేత హాలో మిస్టర్ విజయసాయి అని పేరుతో పిలిపించుకునేంత…
ఆ పలుకుబడిని విజయసాయి స్వామి కార్యానికీ.. స్వ కార్యానికీ ఉపయోగించుకున్నారు, ఐదేళ్ల పాటు ఏపీలోనూ.. కేంద్రంలోనూ చక్రం తిప్పారు, ఒకరకంగా జగన్ కూ మోడీ కి మధ్య వారధిలా విజయసాయి పనిచేశారని రాజకీయవర్గాల్లో టాక్ ఉంది…
2024 లో ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కొంతకాలం వరకు ఆక్టివ్ గానే ఉన్న విజయసాయి ఈ మధ్య హఠాత్తుగా వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఇకపై రాజకీయాల్లోకి రానని వ్యవసాయం చేసుకుంటానని ప్రకటనలు ఇచ్చి సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు… (ఏపీ పాలిటిక్స్, ప్రపంచంలోకెల్లా సంక్లిష్టం…)
ఇదంతా చెప్పింది మొదటి నాలుక, ఇప్పుడు ఆ రెండో నాలుక ఏం చేస్తుందో చూద్దాం… రాజకీయాలకు రాం రాం, వ్యవసాయం చేసుకుంటాను అని మొదటి నాలుకతో అన్నవాడు రెండో నాలుకతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజెపీ పెద్దలతో తరచూ మాట్లాడుతున్నాడని గుసగుసలు బయటికి వచ్చాయి…
ఆ గుసగుసలు నిజమే అనిపించేలా… యిదిగో ఇప్పుడు విజయసాయి ఉప రాష్ట్రపతి ధన్కర్ దంపతులకు పుష్ప గుచ్ఛం ఇచ్చి మరీ శంషాబాద్ ఎయిర్పోర్టులో స్వాగతం పలికారు… విజయసాయి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు కాబట్టి రాజ్యసభ ఛైర్మన్ హోదాలో కూడా ఉండే ఉప రాష్ట్రపతికి స్వాగతం పలికితే తప్పేంటి? అంటే తప్పేమీ లేదు… అయితే సమయం.. సందర్భం బట్టి అర్థాలు మారిపోతూ ఉంటాయి !
విదేశాంగ నీతిలో, రాజకీయాల్లో ఒక పుల్ల ఇటు వైపు అటు కదిలితే దాని వెనుక ఏదో మర్మం అంటుంది… అనాలోచితమో, యథాలాపమో కాదు, కాకూడదు…. నో, నో, నేను ప్రస్తుతానికి రాలేను, మా సాయిరెడ్డి వస్తాడు, తీసుకొండి…!!
Share this Article