.
Murali Buddha……. టివిలో న్యూస్ ఛానల్ చూస్తుంటే దగ్గుబాటి వెంకటేశ్వర రావు పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ చంద్రబాబు ప్రసంగం ఇంట్రస్టింగు …
ఒకప్పుడు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండి ఇప్పుడు ఎలా ఉండగలుగుతున్నారు అని దగ్గుబాటిని అడిగినట్టు బాబు చెప్పారు … కుటుంబంతో ,పుస్తకాలతో , స్నేహితులతో ప్రశాంత జీవితం గడుపుతున్నారు అని అభినందించారు తనే …
Ads
దగ్గుబాటి మోసపోయిన నాయకుడు కావచ్చు, ఫెయిల్యూర్ నాయకుడు కావచ్చు, కానీ వ్యక్తిగా నా దృష్టిలో విజయవంతమైన జీవితం గడుపుతున్నారు … తన జీవితం తాను కోరుకుంటున్నట్టు హాయిగా బతుకుతూ వ్యక్తిగత జీవితంలో విజేతగా నిలిచారు … జర్నలిస్ట్ జ్ఞాపకాల్లో ఓసారి ఇదే రాశాను . ఆ పోస్ట్ మరోసారి …
దగ్గుబాటి రాజకీయంగా పరాజితుడు – మనిషిగా విజేత
మీరు బాబు గారి తోడల్లుడు . ఆయనేంటో మీకు బాగా తెలియాలి . ఇప్పటి వరకు నేను జిల్లాల్లో పని చేశా , హైదరాబాద్ వచ్చి నెల రోజులు అవుతుంది . బాబు ఏమిటో ఒక్కసారికే నాకు అర్థం అయింది . బాబు ఏంటో మీకు తెలియలేదా ? ఎలా నమ్మారు… దగ్గుబాటి వెంకటేశ్వర రావుతో నేను మాట్లాడిన మొదటి మాటలు .
అయన తన ట్రేడ్ మార్క్ చిరునవ్వుతో అలా జరిగిపోయింది అన్నారు . మోసపోయాను అనే బాధ కనిపించలేదు , చిరునవ్వే డామినేట్ చేసింది . 1995లో ఎన్టీఆర్ ను దించేసి చంద్రబాబు సీఎం అయ్యాక దగ్గుబాటి ఇంటికి వెళ్లే సరికి ఆయన శాసనసభ్యులకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు .
నిన్నటి వరకు వాళ్లంతా బయటకు వస్తామని అన్నారు . అందరికీ బాబు ఫోన్ చేసి వెళ్ళవద్దు అని చెబుతూ, మీకు మంత్రిపదవి ఇస్తాను, కార్పొరేషన్ ఛైర్మెన్ పదవి ఇస్తాను అని చెబుతుంటే, అంతా తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు ….. ఇదీ ఆ రోజు దగ్గుబాటి చెప్పిన విషయం .
*****
దేవదత్ పట్నాయక్ అని ఓ డాక్టర్ ఉన్నారు . మహాభారతం , రామాయణం వంటి పురాణాల ఆధారంగా ఆధునిక జీవితం మేనేజ్మెంట్ పై దాదాపు రెండు వందల పుస్తకాలు ఇంగ్లీషులో రాశారు . పలు ఇంగ్లీష్ పత్రికల్లో కాలమ్స్ రాస్తారు .
ఓ ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళు నిర్వహించిన సదస్సులో యాంకర్ చాలా వివరంగా ఓ ప్రశ్న అడిగింది . మహాభారత యుద్ధంలో శ్రీ కృష్ణుడు అనేకసార్లు ధర్మవిరుద్ధంగా వ్యవహరించారు . నువ్వు నా కుమారుడివే పాండవులను చంపవద్దు అని కర్ణుడి వద్దకు కుంతిని రాయబారం పంపడం , భీష్ముడి వద్దకు అర్జునుడిని పంపి నువ్వు ఎలా మరణిస్తావు అని రహస్యం తెలుసుకోవడం వంటివి వివరించి , ఇన్ని చేసిన శ్రీ కృష్ణుడిది ధర్మ పోరాటం అని ఎలా అంటారు అని అడిగింది .
సుదీర్ఘమైన ప్రశ్నకు పట్నాయక్ సంక్షిప్తంగానే సమాధానం చెప్పారు . మీరు చెప్పినవి కరెక్ట్ కానీ అక్కడ పాండవులు , శ్రీకృష్ణుడు ఎవరితో యుద్ధం చేస్తున్నారు ? దుర్యోధనుడి వంటి దుర్మార్గుడితో… దుర్యోధనుడితో యుద్ధం అలానే చేయాలి . అది ధర్మ విరుద్ధం అని మరోలా చేస్తే పాండవులు ఓడిపోయే వారు కౌరవులు విజయం సాధించేవారు . మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం అనేది కూడా యుద్ధ నీతిలో ముఖ్యమైనది అని వివరించారు .
ఈ ధర్మ సూక్ష్మం గ్రహించక పోవడం వల్లనే దగ్గుబాటి వెంకటేశ్వర రావు రాజకీయాల్లో బాబు చేతిలో మోసపోయారు . మోసపోయారు అనడంకన్నా ఓడిపోయారు అనడం సబబు . తాను నిజాయితీగా ఉన్నాను కాబట్టి ఎదుటి వారు కూడా నిజాయితీగా ఉండాలని కోరుకోవడం అత్యాశే .
***
దగ్గుబాటి వెంకటేశ్వర రావు , నారా చంద్రబాబు ఇద్దరూ ఎన్టీఆర్ అల్లుళ్ళు . ఇద్దరిలో ఆర్థికంగా , చదువుపరంగా దగ్గుబాటి ముందున్నారు . పైగా కులానికి సంబంధించిన గ్రేడింగ్ లోనూ దగ్గుబాటిది ముందువరుస .
ఐతే బాబు రాజకీయం ముందు నిలువలేకపోయారు . ఎన్టీఆర్ ను దించేసిన వైస్రాయ్ క్యాంపు సమయంలో క్యాంపులోకన్నా దగ్గుబాటి శిబిరంలో శాసన సభ్యుల సంఖ్య ఎక్కువ . దగ్గుబాటి చెప్పడంతో వీళ్లంతా వైస్రాయ్ శిబిరానికి వెళ్లారు . దగ్గుబాటి ఉప ముఖ్యమంత్రి పదవి . రోజూ మనిద్దరం ఒకే కారులో సచివాలయానికి వెళదాం, ఇదీ ఇద్దరి మధ్య అలిఖిత ఒప్పందం .
సీఎంగా బాబు కుదురుకోగానే ఒకే కారులో వెళ్లడం మాట దేవుడెరుగు పొమ్మనలేక పొగపెట్టాలని దగ్గుబాటి ఫోన్ చేసినా బాబు లిఫ్ట్ చేయలేదు . తన వర్గంతో బయటకు వెళ్ళాలి అని దగ్గుబాటి ప్రయత్నాలు చేస్తుండడంతో పాలేటి రామారావు తప్ప దగ్గుబాటితో ఎవరూ వెళ్లరు అని ఆంధ్రభూమిలో రాశాను .
ఆయనకు బాగా కోపం తెప్పించింది . డిసి యజమాని వెంకట్రామ్ రెడ్డితో పార్లమెంట్ లో ఆయనకు పరిచయం . నాపై ఫిర్యాదు . ఎడిటర్ పిలిచి ఓసారి మాట్లాడి రా అని చెబితే వెళ్ళాను . ఫిర్యాదు చేసినప్పటికీ ఆయన ఇంటికి వెళితే చాలా మర్యాదగా మాట్లాడారు . చాలా సౌమ్యుడు , ఎదుటి వారికి గౌరవం ఇస్తారు .
ఐనా రాజకీయాలకు సంబంధించి నా అభిప్రాయం మారలేదు . ఇంటికి వెళితే అప్పుడు శాసనసభ్యులకు ఫోన్ చేస్తూ కనిపించారు . దగ్గుబాటి ఆశించినట్టు 70 మంది శాసన సభ్యులు రాలేదు , నేను రాసినట్టు ఒకే ఒక mla కాదు . కానీ పన్నెండు మంది దగ్గుబాటితో పాటు తిరిగి ఎన్టీఆర్ నివాసానికి వచ్చారు .
లక్ష్మీ పార్వతిని చూపించి ఎన్టీఆర్ ను దించేసి, అధికారంలోకి వచ్చింది బాబు . కానీ బాబు ఒక్కసారి కూడా ఆమెను బహిరంగంగా విమర్శించలేదు . యెర్ర బస్సు అని ఆమెను విమర్శించింది, దుష్ట శక్తి అని తిట్టింది హరికృష్ణ . నాయకుడు తిట్టిస్తాడు , తాను తిట్టడు .
రాజకీయ నాయకుడు ఇతరులను పనిముట్లుగా ఉపయోగించుకుంటారు కానీ తానే పనిముట్టుగా మారడు . బాబు కరుడుగట్టిన రాజకీయ నాయకుడు .
బాబు వెంట వెళ్లి మధ్యలో వదిలేసి ఎలా వస్తారని ఎన్టీఆర్ నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రభ తరపున దేవులపల్లి అమర్ గట్టిగా ప్రశ్నించారు . ఏమీ అనలేక ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకుడు , హస్త కళల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ సాయిబాబాబా తన పక్కన ఉన్న అనుచరుడి చెంప చెళ్ళుమనిపించాడు . ఇదంతా దగ్గుబాటి రాజకీయాల్లో పరాజితుడిగా …
****
అధికారాంతమున చూడాలి అన్నారు పెద్దలు . విపరీతమైన అధికారం అనుభవించి అధికారం నుంచి దిగిపోయిన తరువాత వారిని చూస్తే జాలి వేస్తుంది . సహజంగా ఉండలేరు . సినిమావాళ్లు , రాజకీయ నాయకులు డిమాండ్ తగ్గినప్పుడు అందరిలోకి రావడానికి ఇష్టపడరు .
మందులో మునిగిపోయే నటులు , అజ్ఞాతంలోకి వెళ్లిపోయే నాయకులు ఎంతో మంది . అటు సినిమా గ్లామర్ తో ఇటు రాజకీయాలతో సంబంధం ఉన్న దగ్గుబాటి రాజకీయాలకు స్వస్తి పలికి సాహిత్య జీవితం గడుపుతున్నారు .
ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ తరువాత రెండు పవర్ సెంటర్లు ఉండేవి . ఒకటి దగ్గుబాటి, రెండు బాబు . అప్పుడు పవర్ సెంటర్ అంటే అల్లాటప్పా కాదు . తరువాత కాంగ్రెస్ లో , బీజేపీలో చేరి రాజకీయాలకు స్వస్తి పలికారు .
దశాబ్దాలపాటు అధికార కేంద్రంగా ఉండి రాజకీయాలు వదిలేసి పుస్తకాలు చదువుతూ , పుస్తకాలు రాస్తూ ప్రశాంత జీవితం గడుపుతున్నారు . ప్రపంచ చరిత్ర ఆది నుండి నేటి వరకు – ఆ తరువాత అని చరిత్రను అధ్యయనం చేసి సంక్షిప్తంగా ప్రపంచ చరిత్రను పుస్తకంగా తీసుకువచ్చారు .
భగత్ సింగ్ గా నటించేందుకు చాలాకాలం క్రితం దగ్గుబాటి ప్రయత్నించారు . స్టీల్ ఫోటో కూడా విడుదల చేశారు . 95 వెన్నుపోటుపై సినిమా తీసేందుకు 96లో ప్రయత్నించారు . 82 … టీడీపీ ఆవిర్భావం నుంచి 95 వెన్నుపోటు వరకు… ఆ తరువాత నడుస్తున్న చరిత్ర వరకు దగ్గుబాటి రాస్తే బాగుండు . సాక్షులకన్నా పాత్రదారులకు నాటకం గురించి ఎక్కువ తెలిసే అవకాశం ఉంది . దగ్గుబాటి తన కోణం నుంచి ఐనా 95 వెన్నుపోటును రికార్డ్ చేయాలి ….
Share this Article