.
– విశీ (వి.సాయివంశీ) ….. జైలుకు వెళ్లిన తొలి భారతీయ హీరో.. ఎవరో తెలుసా? (The Life of an Indian First Super Star in Jail)
… అంతకుముందు ఎప్పుడో నటుడు సుమన్ జైలుకు వెళ్లినప్పుడు ప్రజల్లో కలకలం రేగింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో సంజయ్‌దత్, సల్మాన్‌ఖాన్ వంటివారు జైలు గోడల మధ్య జీవించిన విషయం మనకు తెలిసిందే!
Ads
కన్నడ హీరో దర్శన్ ఓ హత్యకేసులో అరెస్టై, జైలుకు వెళ్లిన ఘటన ఇటీవల సంచలనం కలిగించింది. తెలుగు హీరో అల్లు అర్జున్ ఒక రాత్రంతా జైలులో గడిపి, బెయిల్‌పై బయటికి వచ్చారు. సెలబ్రెటీలు కూడా మామూలు మనుషులే అని తేల్చే ఉదంతాలు ఇవి. అయితే దేశానికి స్వాతంత్ర్యం రాకముందే ఒక ప్రముఖ హీరో జైలుకు వెళ్లిన సంగతి మీకు తెలుసా? ఆయన పేరు త్యాగరాజ భాగవతార్.
… తమిళ సినీరంగంలో తొలి స్టార్ హీరో త్యాగరాజ భాగవతార్. ఎంజీఆర్, శివాజీ గణేశన్‌ల కంటే ముందే సినిమా రంగప్రవేశం చేసిన ఆయన స్టార్ హీరో హోదా పొందారు. ఆయన హీరో మాత్రమే కాకుండా, గొప్ప గాయకుడు కూడా. తన పాటలతో జనాన్ని ఉర్రూతలూగించిన ఘనత ఆయనది.
రెండో ప్రపంచ యుద్ధకాలంలో నిధుల కోసం సాక్షాత్తూ బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ను కచేరీలు చేయమని ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఆయన నిధులు సమకూర్చిన అనంతరం, అందుకు గౌరవ సూచకంగా ‘రావ్ బహద్దూర్’ అనే బిరుదు ప్రదానం చేస్తామని అంది.
అయితే తనకు అలాంటి బిరుదుల మీద ఆసక్తి లేదని ఆయన తిరస్కరించారు. ఆ రోజుల్లో మద్రాసు వీధుల్లో త్యాగరాజ భాగవతార్ కారు వెళ్తుంటే జనం వెర్రిగా ఆయన కోసం పరిగెత్తేవారు. అంతటి స్టార్‌డమ్ ఆయనది. మరి ఆయనెందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది?
… 1943 ప్రాంతంలో సి.ఎన్.లక్ష్మీకాంతన్ అనే వ్యక్తి ‘సినిమా తూదు’ అనే తమిళ పత్రిక సినిమా పత్రిక ప్రారంభించారు. సినిమా రంగంలో ఎవరు ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో ఎవరికి గొడవలున్నాయి, ఎవరికి ఎవరితో అక్రమ సంబంధం ఉందనే Yellow Journalsim అంశాలు అందులో బాగా వచ్చాయి.
దీంతో జనం ఆ పత్రికను బాగా ఆదరించేవారు. ఆ పత్రికలో తమ పేరు రాకుండా ఉండేందుకు చాలామంది అగ్ర నటులు ఆ రోజుల్లో లక్ష్మీకాంతన్‌కు డబ్బులు ఇచ్చేవారనే ప్రచారం ఉండేది. ఈ పత్రిక వ్యవహారంపై ఆగ్రహించిన హీరో త్యాగరాజ భాగవతార్, మరో నటుడు ఎస్.ఎన్.కృష్ణన్, దర్శకుడు శ్రీరాములు నాయుడు అప్పటి బ్రిటిష్ గవర్నర్‌కి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ పత్రిక లైసెన్స్ రద్దు చేశారు.
… అయితే, సి.ఎన్.లక్ష్మీకాంతన్ వెంటనే ‘హిందూ నేసన్’ అనే మరో పత్రిక స్థాపించి, ఈ ముగ్గురిపై రకరకాల వార్తలు రాయడం మొదలుపెట్టాడు. గతంలో రాసిన దానికంటే ఎక్కువగా మసాలా వార్తలు రాసి, హీరో హీరోయిన్ల నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఈ క్రమంలో త్యాగరాజ భాగవతార్, ఎస్.ఎన్.కృష్ణన్, శ్రీరాములు నాయుడులకు అతని మీద ఆగ్రహం పెరిగింది.
… 1944 నవంబర్ 8న తన మిత్రుడు, లాయర్ అయిన జె.నర్గునం ఇంటి నుంచి రిక్షాలో తన ఇంటికి వస్తున్నాడు లక్ష్మీకాంతన్. ఆ సమయంలో కొందరు వ్యక్తులు రిక్షా ఆపి, అతనిపై కత్తితో దాడి చేశారు. గాయాలతో ఎలాగో తప్పించుకుని, నేరుగా జె.నర్గునం ఇంటికి వెళ్లిన లక్ష్మీకాంతన్ జరిగిన విషయం చెప్పాడు. అనంతరం ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించారు. ఆ తర్వాత పోలీసులను పిలిచి జరిగిందంతా రిపోర్ట్ రూపంలో రాయించారు. 24 గంటల తర్వాత లక్ష్మీకాంతన్ మరణించాడు.
… ఈ ఘటనలో అనుమానితులుగా పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. అందులో త్యాగరాజ భాగవతార్, ఎస్.ఎన్.కృష్ణన్, శ్రీరాములు నాయుడు కూడా ఉన్నారు. మద్రాసు హైకోర్టులో వాదోపవాదాల అనంతరం శ్రీరాములు నాయుడిని నిర్దోషిగా విడుదల చేసి, త్యాగరాజ భాగవతార్, ఎస్.ఎన్.కృష్ణన్‌లను దోషులుగా గుర్తించారు.
అది అన్యాయం అని, తాము ఏ నేరం చేయలేదని వారు మొరపెట్టుకున్నారు. అనంతరం పైకోర్టుకు అప్పీలు చేసుకున్నారు. సుమారు రెండున్నరేళ్లపాటు వాదనలు జరిగాయి. 30 నెలలపాటు వారిద్దరూ జైల్లోనే ఉన్నారు. కోర్టు వారిని నిర్దోషులుగా గుర్తించి, విడుదల చేసింది. లక్ష్మీకాంతన్ కేసును మరోసారి విచారణ చేయాలని ఆదేశించింది.
… ఆ తర్వాత లక్ష్మీకాంతన్ కేసు కొన్నాళ్ళు నడిచినా, దోషులను మాత్రం గుర్తించలేకపోయారు. ఈ కేసు కారణంగా త్యాగరాజ భాగవతార్ ఆస్తి మొత్తం కరిగిపోయింది. పైగా సమాజంలో అపకీర్తి మిగిలింది.
సరిగ్గా ఆయన జైలుకు వెళ్లక ముందు ఆయన నటించిన ‘హరిదాస్’ అనే సినిమా విడుదలైంది. అది మద్రాసు బ్రాడ్వే థియేటర్‌లో మూడేళ్ల పాటు ఆడింది. ఒకే థియేటర్‌లో ఒక సినిమా అన్ని రోజులు ఆడటం రికార్డు. అయితే అది అందులో ఆడినన్ని రోజులూ త్యాగరాజ భాగవతార్ జైల్లో ఉండటం విషాదం.
… జైలుకు వెళ్లే ముందు 12 సినిమాలకు త్యాగరాజ భాగవతార్ అగ్రిమెంట్ చేశారు. ఆయన విడుదల తర్వాత అందులో కొన్ని తెరకెక్కాయి. కానీ ఏదీ అనుకున్నంత విజయం సాధించలేదు. జైలు నుంచి విడుదలైన నటుడు అనే ముద్ర పడటంతో ఆయన సినిమాల మీద జనానికి ఆసక్తి పోయింది.
దీంతో ఆయనకు సినిమాలు తగ్గిపోయాయి. దీంతో ఆయన ఆధ్యాత్మికత వైపు మళ్లారు. దేశంలోని అనేక గుళ్లు సందర్శించారు. అనేక ప్రాంతాలు తిరిగారు. చివరకు 1959 నవంబర్ 1న అనారోగ్యంతో 50 ఏళ్ల వయసులోనే మరణించారు…
Share this Article