.
( Ashok Pothraj ).….. రేఖా చిత్రం” మలయాళి తెలుగు అనువాదం…
2025 జనవరిలో విడుదలై మళయాళంలో తొలి విజయాన్ని అందుకున్న సినిమా ‘రేఖా చిత్రం’ ఈ రోజు ఓటీటీలోకి వచ్చేసింది. మలయాళం సినిమాలు అంటేనే థ్రిల్లర్స్ కి పెట్టింది పేరు.
Ads
మర్డర్స్ మిస్టరీలను పోలీసులు ఎలా ఇన్వెస్టిగేటివ్ చేస్తారు..? అనే కాన్సెప్ట్ ని ప్రతి సీన్ ని ఆసక్తికరంగా చూపుతూ తెరకెక్కించారు. క్రైమ్ థ్రిల్లర్ జానర్లోకి వచ్చే చిత్రమిది. మిమ్మల్ని ఎక్కడా కూడా నిరుత్సాహపరచదు.
ఆసిఫ్ అలీ హీరోగా నటించిన ఈ చిత్రంలో మమ్ముట్టి తెర వెనుక హీరో పాత్రలో కనిపించడం విశేషం. ఈ సినిమాకి జోఫిన్ టీ చాకో దర్శకత్వం వహించాడు. కేవలం రూ. 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 25 రోజుల్లోనే రూ. 75 కోట్ల మేరకు కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసిందంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఇంకా మలయాళ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. చాలా రోజుల క్రితమే ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందనీ ఒక ప్రచారం జరిగింది. ఎట్టకేలకు ఈ సినిమా ఈరోజు ఓటిటీలోకి రావడం పెద్ద విశేషమే.
క్రైం థ్రిల్లర్లను ఎలా హ్యాండిల్ చేయాలో ఈ మళయాళ దర్శకులకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే వాళ్లు తీసిన ఈ జానర్ సినిమాలను ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ ఆదరిస్తుంటారు. అందుకే మలయాళ సినిమాలు స్ట్రైట్ గా తెలుగులోకి అనువాదం చేస్తున్నారు.
ముఖ్యంగా రీమేక్ లాంటి పని అస్సలు చేయనివ్వడం లేదు. కాబట్టే తెలుగులోనూ వాళ్ల హవా కొనసాగుతోంది. ఇక సినిమా విషయానికి వస్తే ఎప్పటిలానే ఇదొక మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్. కథలో భాగంగా “ఒక ఆత్మహత్య కేసుని హీరో ఆసిఫ్ అలీ విచారణ చేపడుతాడు.
గ్యాంబ్లింగ్ స్కామ్ లో దొరికిపోయి సస్పెండ్ అయిన తాను ఈ కేసు కోసం మళ్లీ రీఎంట్రీ ఇస్తాడు. ఈ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో అక్కడ దొరికిన ఫోన్ ఆధారంగా 40 ఏళ్ల కిందటి హత్య కేసుతో ఈ ఆత్మహత్యకు లింక్ ఉందని ఆయన గ్రహిస్తాడు.
1985 సమయంలో మమ్ముట్టి సినిమా షూటింగ్ లొకేషన్ నుంచి మిస్ అయిన అమ్మాయి కేసుతో ముడిపడి ఉంటుంది. ఆ సంఘటనతో ఎన్నో ట్విస్టులు వస్తూనే ఉంటాయి. చివరకు చిక్కుముడి లాంటి ఈ కేసులను ఆయన ఎలా చాకచక్యంగా ఛేదిస్తాడనేది ప్రేక్షకులను మరింతగా ఎంగేజ్ చేస్తూ వెళుతుంది”.
పట్టు వీడని ఒక పోలీస్ ఆఫీసర్ కసిగా దర్యాప్తు చేస్తే ఎలా ఉంటుందో తెలియాలంటే రేఖాచిత్రం చూడాల్సిందే. ఈరోజు నుంచి సోనీ లివ్ లో అందుబాటులోకి వచ్చింది . ఈ సినిమాలో ఆసిఫ్ అలీతో పాటు అనస్వర రాజన్, మనోజ్ కే జయన్, సిద్ధిఖీ, జగదీశ్, నటించారు. ఎలాంటి అసభ్యక్రమైన సన్నివేశాలు లేవు. కాబట్టి వీలైతే ఫ్యామిలీతో కూర్చుని హాయిగా చూసేయండి…
Share this Article