.
(శంకర్‌రావు శెంకేసి- 79898 76088) ….. ‘సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ’- తెలంగాణలో ఏకైక గిరిజన విశ్వవిద్యాలయం. ములుగు జిల్లా కేంద్రంలో ఉంది. రాష్ట్ర విభజన హామీల అమలులో భాగంగా.. 2023 డిసెంబర్ నెలలో పార్లమెంట్‌లో సెంట్రల్ యూనివర్సిటీల చట్టం-2009కి సవరణ చేయడం ద్వారా ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు.
ఎలాంటి మౌలిక సౌకర్యాలు సమకూర్చకముందే ఓ పాత భవనంలో ఏకంగా జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 357 ఎకరాలు సమకూర్చగా, అక్కడ శాశ్వత భవనాలు నిర్మాణం కావాల్సి ఉంది. ఇది ఎప్పుడు జరుగుతోందో కాలానికి ఎరుక.
Ads
గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాలనేది ట్రైబల్ యూనివర్సిటీ లక్ష్యం. ఇందుకోసం గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో కోర్సులు సిద్ధం చేశారు. 2024 విద్యాసంవత్సరం నుంచి బీఏ (ఆనర్స్)లో ఇంగ్లిష్, ఎకనామిక్స్ కోర్సులను ఆఫర్ చేస్తున్నారు. తరగతులు సైతం ప్రారంభమయ్యాయి.
పూర్తి స్థాయి రెగ్యులర్ ఫ్యాకల్టీ, మౌలిక సౌకర్యాలు లేని వాతావరణంలో ఈ కోర్సుల్లోని క్వాలిటీ ఎంతో మరెప్పుడైనా మాట్లాడుకుందాం. తాజాగా ఈ యూనివర్సిటీకి వైస్‌చాన్సలర్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీచేసింది. ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాస్ తెరపైకి వచ్చారు.
అరకొర వసతుల మధ్య యూనివర్సిటీని స్ట్రీమ్ లైన్ చేయడానికి ఆయన తిప్పలేవో ఆయన పడతారు. కానీ ఇక్కడ విషయమేమిటంటే ‘సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ’ పేరులోని సారక్క గురించి.
అసలు ఈ సారక్క అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది. ఎవరు తీసుకువచ్చారనేది అర్థం కాకుండా ఉంది. వాస్తవానికి తెలంగాణలో.. క్షేత్ర స్థాయిలోకి వెళ్లితే ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ నెలకొల్పడానికి కారణం మేడారం మహాజాతర.
గిరిజనుల ఇలవేల్పులైన సమ్మక్క సారలమ్మల పేరిట ప్రతీ రెండేళ్లకోసారి ఇక్కడ మహాజాతర జరుగుతుంది. వీరిద్దరూ వనదేవతలు. గిరిజనులే కాదు, గిరిజనేతరులు కూడా సమ్మక్క, సారలమ్మ అనే పిలుస్తారు. జనశ్రుతిలో వున్న గాథల ప్రకారం సమ్మక్క, సారలమ్మలు తల్లీబిడ్డలు.
సమ్మక్కను మహిమాన్విత శక్తులు గల ధీరవనితగా, సారలమ్మను చల్లని చూపుల తల్లిగా కొలుస్తారు. కాకతీయులతో జరిగిన యుద్ధంలో తల్లితో పాటు సారలమ్మ కదనరంగంలో దూకి వీరోచితంగా పోరాడి సైనికుల వెన్నుపోటుకు బలైపోతుంది. అప్పటి నుంచి సారలమ్మను వరాలతల్లిగా, సంతానలక్ష్మిగా కొలుస్తున్నారు. మహాజాతరలో సైతం సారలమ్మను తీసుకువచ్చిన తర్వాతే, సమ్మక్కను గద్దెలపైకి తీసుకువస్తారు.
వందల ఏళ్ల క్రితమే మేడారంలో జాతర మొదలైనా, నాగరిక ప్రపంచానికి పరిచయమైన తర్వాత సమ్మక్క, సారలమ్మలు లోకానికంతా ఆరాధ్య దైవాలయ్యారు. ఇప్పుడే కాదు, తరతరాల నుంచి సారలమ్మను సారలమ్మే అని పిలుస్తారు గాని, సారక్క అనరు.
అంతెందుకు తెలంగాణలో ప్రతీ ఊరిలో సమ్మక్క, సారమ్మలు ఉంటారే గాని, సారక్కలు ఉండారు. అక్క అనే పదం సమ్మక్కకు మాత్రమే పరిమితమైనది. వీరత్వంలో, ధీరత్వంలో ఆమె అగ్రగణ్యురాలు. అందుకే ఆమెను పెద్ద దిక్కుగా, అక్కగా చూస్తారు. సారలమ్మను వరాల తల్లిగా భావిస్తారు. కాబట్టి ఆమెను అమ్మ అంటారు. ఈ విషయంలో క్షేత్ర స్థాయి భక్తుల్లో ఎలాంటి పేచీ లేదు. ఏసీ రూముల్లో కూర్చొని వింత నిర్ణయాలు చేసేవారితోనే అసలైన పేచీ.
మేడారం ప్రాంతం వున్న తాడ్వాయి మండలాన్ని 8 ఏళ్ల క్రితం కేసీఆర్ ప్రభుత్వం సమ్మక్క, సారలమ్మ తాడ్వాయి మండలంగా మార్చింది. రెండేళ్లకోసారి జరిగే మహాజాతర సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అధికారిక వెబ్‌సైట్‌లో కూడా సమ్మక్క, సారలమ్మ జాతర అనే పేర్కొన్నారు.
2024 జాతర వేళ జాతీయ స్థాయిలో వివిధ రూపాల్లో ప్రభుత్వం విస్తృతంగా నిర్వహించిన ప్రచారంలో సారలమ్మ అన్నారే గాని, సారక్క అనలేదు. రెండేళ్ల క్రితం సమ్మక్క, సారలమ్మ పూజారుల సమ్మేళనంలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం.. సారలమ్మను సారక్క అనలేదు.
వనదేవతలపై వెల్లువెత్తిన సాహిత్యంలో, ప్రచారంలోవున్న పురాణగాథల్లో ఎక్కడా సారక్క అనలేదు. ప్రతీ జాతరలో దేవాదాయ, పర్యాటక శాఖలు ప్రచురించే ఆహ్వాన పత్రికల్లో కూడా సారలమ్మ అనే ఉంటుంది. మరి ట్రైబల్ యూనివర్సిటీ నామకరణంలో సారలమ్మను సారక్కగా ఎవరు మార్చారు? ఎందుకు మార్చారు? అనేది తెలియకుండా ఉంది. ఢిల్లీలో అది ఎవరి పైత్యమో, ఎవరి ప్రాస ప్రయాసో తెలిస్తే బాగుండేది.
మేడారం మహాజాతరకు తెలంగాణ, ఆంధ్ర, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి జనం వెల్లువలా తరలివస్తారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరకు కోటిమందికి పైగా భక్తజనం రాకపోకలు సాగిస్తారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరుపొందింది.
మహాజాతర వేళ రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్, కేంద్రమంత్రులతో పాటు ఇంకా అనేకమంది రాజకీయ, రాజకీయేతర ప్రముఖులు వనదేవతల చెంత మోకరిల్లుతారు. ఇప్పటివరకైతే రాష్ట్రపతి, ప్రధానమంత్రి రాలేదుగానీ, ముందు ముందు తప్పకుండా వస్తారు.
1996లో అప్పటి సీఎం చంద్రబాబు ఈ జాతరను స్టేట్ ఫెస్టివల్‌గా ప్రకటిస్తే, నేషనల్ ఫెస్టివల్ హోదా కోసం అనేక ఏళ్లుగా ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. అటు ప్రభుత్వాల ప్రత్యేక దృష్టి వల్లనైతేనేమి, ఇటు భక్తుల్లో వున్న విశ్వాసాల వల్ల నైతేనేమి ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఈ జాతర జగద్విఖ్యాతిని పొందుతూ వస్తోంది.
కేంద్రంలో, రాష్ట్రంలో పాలకులు ఎవరున్నా వారికి ఇది చిరపరిచితమైన జాతర. అక్కడ ఏ కార్యక్రమం చేపట్టాలన్నా, ఏ అభివృద్ధి చేయాలన్నా గిరిజన సంప్రదాయాలను, విశ్వాసాలను పరిగణనలోకి తీసుకుంటారు. గిరిజన ప్రతినిధులతో చర్చించి ఏకాభిప్రాయం వచ్చాకే అమలు చేస్తారు.
చరిత్ర పొరలను తరచి చూసి నిర్ణయాలను తీసుకుంటారు. వన దేవతల పేరిట ఒక సంస్థను ప్రతిష్ఠాత్మకంగా స్థాపించేటప్పుడు కూడా ఎన్నో జాగ్రత్తలు అవసరం. ఆ సంస్థ పేరు విషయంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు, వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
కానీ, ములుగు ట్రైబల్ యూనివర్సిటీ నామకరణం విషయంలో ఈ ప్రక్రియ ఎందుకు జరగలేదో తెలియదు. ‘ఆ.. సారలమ్మ.. సారక్క పదాలు వ్యవహారిక అర్థంలో ఒకటేలే..’ అని సరిపుచ్చుకుంటే, అది ఎంతమాత్రమూ చెల్లదు.
ఉస్మానియా ఆచార్యుడు వై.ఎల్.శ్రీనివాస్‌ను కేంద్ర ప్రభుత్వం తాజాగా ‘సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ’కి వీసీగా నియమించింది. తెలంగాణ చరిత్ర లోతుపాతులు తెలిసిన వ్యక్తిగా ఆయనైనా ‘సారలమ్మ’ను తెరపైకి తీసుకువస్తారో చూడాలి…
Share this Article