.
నిజంగానే మెయిన్ స్ట్రీమ్ మీడియా కిక్కుమనడం లేదు… అదేనండీ, దాదాపు 40 ఏళ్లుగా కుల, మతాలకు అతీతంగా అందరికీ అన్నం పెడుతున్న ఓ అన్నదాన సత్రాన్ని, ఆశ్రమాన్ని కడప జిల్లాలో కూల్చివేశారు…
విస్మయకరం ఏమిటంటే…? పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తేసరికి… ఇది జనంలో వ్యతిరేక భావనలకు దారితీస్తుందనే స్పృహతో లోకేష్ క్షమాపణలు చెప్పాడు… పునర్నిర్మాణ ఖర్చు తానే భరిస్తాననీ ప్రకటించాడు… గుడ్, ఆ స్పందన సరైనదే… కానీ..?
Ads
గుళ్ల మెట్లు కడిగి, తిరుపతి తొక్కిసలాటకు ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్పి, మీరెందుకు చెప్పరంటూ టీటీడీ బాధ్యులను దబాయించిన వీర అన్‌అపాలజిటిక్ సనాతన తెలుగు ధర్మపరిరక్షకుడు పవన్ కల్యాణ్ నుంచి చడీచప్పుడూ లేదెందుకు..? పైగా తన శాఖ పరిధిలోని అధికారుల అత్యుత్సాహంతోనే కూల్చివేతలు…
సీజ్ ది షిప్ అంటూ సీఎం రేంజులో ఉరిమిన హీరో ఇప్పుడు మాత్రం మౌనాన్ని పాటిస్తున్నాడెందుకు..? ఆ బుల్డోజర్లు ఎవరు చెబితే కూల్చేశాయి ఆ అన్నదాన సత్రాన్ని… ఒక నిజ సేవా కేంద్రాన్ని… నాకు తెలిసి కాశినాయన ఆశ్రమం మీద వీసమెత్తు విమర్శ వినలేదు…
లోకేశ్ క్షమాపణ చెప్పాడు సరే… కానీ సీఎం కాదు… తను క్షమించాలని చెబుతున్నాడూ అంటే తప్పు జరిగింది అని అంగీకరిస్తున్నట్టే… మరి ఆ శాఖ బాధ్యుడు కిమ్మనడేం..? ‘కాశీనాయుని జ్యోతి క్షేత్రంగా’ ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం నల్లమల అడవిలో ఉంది. కడప జిల్లా బద్వేలు నియోజవర్గం, కాశీనాయన మండలం పరిధి…
అవధూత కాశి నాయన 1995లో ఇక్కడ సమాధి అయ్యాడు… ఆయన జీవించి ఉన్న రోజుల్లోనే ఈ ప్రాంతంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా అన్నదానం చేసేవాడు… అన్ని దానాల్లోకెల్లా అన్నదానమే ప్రశస్తమైందనీ, దీన్ని అందరూ పాటించాలని ఉపదేశాలు ఇచ్చేవాడు…
గత 45 ఏళ్లుగా ఈ అన్నదాన సత్రం లక్షల మంది ఆకలిని తీర్చింది… రోజురోజుకు వృద్ధి చెందుతూ వేల నుంచి లక్షల సంఖ్యలోకి చేరింది… కాశి నాయన జ్యోతి క్షేత్రంలో తొమ్మిది ఆలయాలున్నాయి. కాశీ అన్నపూర్ణాదేవి ఆలయాన్ని కాశి నాయన ప్రతిష్ట చేయగా, అనంతర కాలంలో కాశీ విశాలాక్షి, కాశీ రాజరాజేశ్వరి, కాశీ విశ్వనాథ స్వామి, కాశీ అన్నపూర్ణమ్మ, దత్తాత్రేయ, లక్ష్మీనరసింహస్వామి, రాముల వారు, ఆంజనేయ స్వామి వారి ఆలయాలను భక్తులు నిర్మించారు…
కాశి నాయన వారికి గోవులంటే అమితమైన ప్రేమ. కాశి నాయన సంస్మరణార్థం 500 లకు పైగా గోవులను కాపాడుతూ పెద్ద గోశాలను నడుపుతున్నారు… కాశి నాయన వర్ధంతి రోజున మూడు లక్షల మందికి పైగా భక్తులు ఇక్కడ భోజనాలు చేస్తుంటారు…
ఇక్కడ భోజనం చేయడానికి కుల మతాలను పట్టించుకోరు. ఏ ప్రాంతం వారన్నది చూడరు. ఎన్ని రోజులు ఉంటారని అడగరు. ఎవరైనా ఎప్పుడైనా రాత్రయినా, పగలైనా ఎప్పుడూ భోజనం అందుబాటులో ఉండేటట్టుగా ఈ ఆశ్రమ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటారు.
ఈ క్షేత్రం సేవకు తోడ్పడేందుకు ఆర్య వైశ్యులు ఓ సత్రాన్ని, రెడ్డి సంఘం వారు ఓ సత్రాన్ని, రజకులు, కుమ్మరులు రెండు సత్రాలను నిర్మించారు… రజకులు, కుమ్మరులు నిర్మించుకున్న సత్రాలను అటవీ అధికారులు కూల్చివేశారు…
500 గోవులున్న గోశాలను ఇక్కడి నుంచి కూటమి ప్రభుత్వం బలవంతంగా తరలించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లలో అందించే భోజనం కంటే 100 రెట్లు ఎక్కువ భోజనం, మరియు నాణ్యతతో ఇక్కడ ప్రజలకు ఉచితంగా అందిస్తుంటారు… అలాంటి ఉచిత అన్నదాన సత్రాన్ని, ఆశ్రమాన్ని ఏకపక్షంగా కూటమి ప్రభుత్వం కూల్చివేసింది…
దారుణం ఏమిటంటే..? దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ కాశి నాయన జ్యోతి క్షేత్రం టైగర్ జోన్ పరిధిలో ఉన్న కారణంగా అటవీ శాఖ అధికారులు తమకు తెలియకుండానే కూల్చివేతలకు సిద్ధమయ్యారని, దీనిని నివారించడానికి తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని వెల్లడించారు… పైగా దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొస్తామని ప్రకటించడం మరిన్ని సందేహాలకు దారితీస్తోంది…
హిందూ ధర్మ రక్షకులమంటూ లక్షల మందితో విజయవాడలో కోట్లాది రూపాయల ఖర్చులతో భారీ సభలు నిర్వహించిన ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, బిజెపి నోరు తెరవకపోవడం విచిత్రం..!!
Share this Article