Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇందిరాగాంధీపై అత్యంత నాసిరకం బయోపిక్… ఎమర్జెన్సీ..!!

March 17, 2025 by M S R

.

Jayasree Pavani …… ఎమర్జెన్సీ సినిమా గురించి నాలుగు మాటలు :

1925 లో నండూరివారు ఎంకిపాటల సంకలనం ముద్రించే ముందు, స్వాతంత్ర్య సమర యోధుడు దుగ్గిరాల వారిని ముందు మాట రాస్తారా అని అడిగేరట. దానికి ఆయన ఆ పాటలను చదివి, ఇదే నా ముందుమాట అంటూ “నాజూకు లేదురా ఎంకిలో నండూరు సుబ్బిగా” అని రాశారట.

Ads

అందరూ నవ్వేశారు. పాటలు సూపరు హిట్టు. కానీ పల్లెటూరి అమ్మాయిలోని అమాయకత్వమో, గడుసుదనమో మోతాదు మించితే రచనలో నాజూకుదనం అంటే Finesse or delicacy పోతాయి అన్నది హాస్యోక్తి.

2025 లో వచ్చిన ఎమర్జెన్సీ సినిమాలో లోపించిన finesse ఏమిటంటే దమ్ములేని ఇందిరాగాంధీ. డ్రామా ఎక్కువా… కంటెంట్ తక్కువా అయిన చిత్రం. టైటిల్ ప్రకారం ఎమర్జెన్సీ లేదా అత్యయిక పరిస్థితిని గురించి చెప్పాలనుకుంటే, ఆ స్థితిని దేశంలో విధించే ముందు రోజులనూ, నిర్వహించిన రోజుల్లోనూ, దాని తరువాతి పరిణామాలనూ క్షుణ్ణంగా తెలిసేలా ప్రదర్శించవలసింది.

ఎమర్జెన్సీ కాలంలో జరిగిన అకృత్యాలూ, అధికార దుర్వినియోగం వివరంగా చెప్పలేకపోయారు. అయినా పేద ప్రజలు ఆవిడకి పట్టం కట్టడానికే సిద్ధం అయ్యారని చూపించారు. కారణాలు ఏమిటని చెప్పలేకపోయారు. కానీ ఇందిరాగాంధీ గారి జీవితాన్ని చిన్నతనం నుంచీ, చనిపోయే వరకూ ప్రదర్శించే ప్రయత్నం చేయడంతో, సమయం సరిపోక .. మొత్తం సినిమా పేలవంగా మారింది .

ఆమె మన దేశ పూర్వ ప్రధాని. శత్రువులను గడగడలాడించి, ప్రతిపక్షాల చేత సైతం అపర దుర్గ అని పొగడబడిన నాయకురాలు. ఆమె సమకాలీనులంతా ఉద్దండపిండాలు. ఇందిరాగాంధీ గురించి నిష్పాక్షికంగా వివరించాలి అనుకోవడంలో తప్పులేదు. ప్రతి నాణేనికీ రెండు వైపులుంటాయని మనకి తెలుసు.

ఆడది అబల, మగవాడిని అనుసరించి నడవాలి అనే మూఢత్వం బలంగా ఉన్న తన సమకాలీన సమాజానికి ఈ దేశాధినేతగా ఎదిగి చూపిన ఇందిరాగాంధీని మానసిక సమతౌల్యత దెబ్బ తిన్న మనిషిలా చూపడం అపరిపక్వ అవగాహనగా అనిపించింది.

ఇందిరాగాంధీ నాజూకుగా మాట్లాడేది. ఇంటర్వ్యూలలో ఆవిడ కొంత బిడియంగా నవ్వుతూ, ప్రశ్నలు వినేటప్పుడు కొంత రెప్పలు వాల్చి వింటూ, ఆలోచించి సమాధానాలు ఇచ్చేది. ఆవిడ అనుకరణలో కంగనా కలిపిన అతిశయోక్తి లేదా ఓవరాక్షన్ క్యారెక్టరైజేషన్ ని కామెడీగా మార్చింది.

పిచ్చాస్పత్రిలో పేషంటు వేసిన ఫ్యాన్సీ డ్రెస్సులా అనిపించింది. వాయిస్ పీలగా ఉండటం వేరు…కీ చుగా ఉండటం వేరు అనే విషయం మరిచిన కంగనా మాటలు పలికే తీరు కాస్తంత కంపరం కలిగిస్తుంది. ఇందిరాగాంధీ కి సమకాలీనులుగా ఉన్న మహా నాయకుల పాత్రలకు దాదాపుగా నటులంతా న్యాయం చేశారు. వాజ్‌పేయి గారి పాత్రకి మాత్రం న్యాయం జరగలేదు.

కంగనాకి, సంజయ్ గాంధీగా నటించిన విషక్ నాయర్ కి , పుపుల్ జయకర్ గా నటించిన మహిమా చౌదరికి మాత్రమే మాటలున్నాయి. నాయర్ నటన మెచ్చుకోదగినది. మంచి విలన్ పాత్రలు మరిన్ని వచ్చే అవకాశం ఉంది. పాటలు అనవసరం.

ఈ సినిమాలో అనేక సంఘటనలున్నాయి. కానీ ఏమయిందో మనకి అర్థం అయేలోపలే.. సీను రెండో ఘటనలోకి తోసుకెళ్ళి పోతుంది. ఇందిరాగాంధీ ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలేవీ సినిమాలో లేవు. కానీ యుద్ధమూ, అది గెలవడము శ్యామ్ మానెక్ షా విజయంగానూ, ఎమర్జెన్సీ సంజయ్ గాంధీ నిర్ణయంగానూ చూపారు. భింద్రన్ వాలే గురించి సామాన్య ప్రజలకు అర్థం అయేలాలేదు. ఏం జరిగిందో సినిమా చూస్తే తెలియదు.

కనీసం 14 ఎపిసోడ్స్ గా తీయవలసిన సినిమా 140 నిముషాలకు కుదించి, పేలవంగా దర్శకత్వ లోపాలతో తీసిన సినిమా. ఇందిరాగాంధీ కాలంలో జరిగిన బ్యాంకుల జాతీయీకరణ, హరిత విప్లవం, ల్యాండ్ సీలింగూ, పేదరిక నిర్మూలన పధకాలూ…. ఏవీ సినిమాలో లేవు.

ఆత్మన్యూనతతో బాధపడే ఓ చిన్న పిల్ల, తండ్రి నమ్మకాన్ని పొందలేని యువతి, భర్త చావుని తేలికగా తీసుకున్న వనిత, కొడుకు చేతిలో కీలు బొమ్మగా మారిన మహిళ, స్వంత అంగరక్షకుల చేతిలో హతమైన నేత. ఇంతేనా ఇందిరా గాంధీ ? స్వతంత్రానంతర భారత రాజకీయాలపై చెదిరిపోని ముద్ర ఆమె…

ఈ సబ్జెక్టుకు న్యాయం చేయాలంటే మంచి దర్శకత్వం కావాలనేది లాజిక్కు. కంగనా రనౌత్, మీరు పరిశ్రమలో ఉక్కు మహిళగా గుర్తింపు పొందాలి అనుకున్నాము. మైనపు ముక్కు మహిళగా కాదు…



(ఈ సినిమా థియేటర్లలో కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు, 20 కోట్ల వసూళ్లు కూడా లేవు, కానీ ఓటీటీకి మాత్రం 60 కోట్లకు అమ్మారట… అదిప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్… థియేటర్ ప్రేక్షకులు వేరు, ఓటీటీ ప్రేక్షకులు వేరా..? తేడా ఉందా..? పలు సినిమాలకు ఇదే అనుభవం… — ముచ్చట)



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions