Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ ఇద్దరూ అగ్ర హీరోలే అప్పటికి… కలిసి నటిస్తే మాత్రం తుస్సు…

March 17, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …….. ఎన్ని పంతాలు పట్టింపులు వచ్చినా , ఇగో సమస్యలు ఉన్నా ఎప్పటికప్పుడు వాటిని పక్కన పెట్టి మన పాత తరం హీరోలు కలిసి చాలా సినిమాలే నటించారు . మొదటగా చెప్పుకోవలసిన జంట NTR , ANR … అలాగే కృష్ణ , శోభన్ బాబు … వీళ్ళు పెద్ద హీరోలు అయ్యాక కూడా కలిసి నటించారు . ముఖ్యంగా చెప్పుకోవలసింది యన్టీఆర్ , కృష్ణల గురించే … ఇద్దరికీ ప్రొఫెషన్లో ఇరవై ఏళ్ల గేప్ ఉన్నా ఇద్దరూ మాస్ హీరోలే …

విచిత్ర కుటుంబం వంటి సినిమాలలో కలిసి నటించినా అప్పటికీ కృష్ణ స్టేచర్ చిన్నదే . ఆ తర్వాత కాలంలో కురుక్షేత్రం , దాన వీర శూర కర్ణ సినిమాలప్పుడు నువ్వానేనా అని ఢీ పడ్డారు . వీటికి ముందు దేవుడు చేసిన మనుషులు వంటి బ్లాక్ బస్టర్ చేసారు .

Ads

1982 ఆగస్టు 20న విడుదల అయిన ఈ వయ్యారి భామలు వగలమారి భర్తలు సినిమా యన్టీఆర్ , కృష్ణల కాంబినేషన్లో భారీ అంచనాలతో , ఓపెనింగ్సుతో విడుదల అయింది . ఈ సినిమా విడుదల అయ్యేటప్పటికి జస్టిస్ చౌదరి , బొబ్బిలి పులి సినిమాల జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది . కారణాలు ఏమయినా యన్టీఆర్ , కృష్ణల లెవెల్లో , దేవుడు చేసిన మనుషులు సినిమా లాగా ఈ వయ్యారి భామలు వగలమారి భర్తలు సినిమా ఆడలేదు .

సాదాసీదా కధ . గుండమ్మ కధ సినిమాలోలాగా ఇద్దరు పెద్దింటి అన్నదమ్ములు గొడవలు లేకుండా ఉండేందుకు ఇద్దరు అక్కాచెల్లెళ్ళను వివాహం చేసుకుంటారు . అంతా సాఫీగా జరుగుతున్న సమయంలో ఇద్దరు ఆషాఢభూతులు అక్కాచెల్లెళ్ళ మధ్య గొడవలు సృష్టించి నివాస హర్మ్యంలో పార్టిషన్ గోడ వేయిస్తారు .

హీరోలు అక్కాచెల్లెళ్ళకు బుధ్ధి చెప్పి మళ్ళా అంతా గ్రూప్ ఫొటో దిగుతారు . టూకీగా ఇదీ సినిమా . అన్నాదమ్ములుగా యన్టీఆర్ , కృష్ణలు నటిస్తే , శ్రీదేవి , రాధికలు అక్కాచెల్లెళ్ళుగా , యస్ వరలక్ష్మి , పండరీబాయిలు ఇద్దరు హీరోల తల్లులుగా నటించారు . యన్టీఆర్ , శ్రీదేవిలు హీరోహీరోయిన్లుగా ఇది 12వ సినిమా . మనుమరాలుగా వేసిన బడిపంతులు లాంటి సినిమాలను లెక్కలోకి తీసుకోం కదా ! ఇతర ప్రధాన పాత్రల్లో రావు గోపాలరావు , అల్లు రామలింగయ్య , కాంతారావు , నూతన్ ప్రసాద్ , రమాప్రభ , ప్రభృతులు నటించారు .

కృష్ణ ఫేమిలీ పిక్చర్సుకు ఆస్థాన దర్శకుడు వంటి వాడయిన కట్టా సుబ్బారావు ఈ సినిమాకు దర్శకుడు . ఈ సినిమా నిర్మాత R V గురుపాదం తనకు గురుతుల్యులయిన అలనాటి ప్రముఖ నటులు ఈలపాట రఘురామయ్యకు ఈ సినిమాను అంకితం ఇచ్చారు .

మరో విశేషం కూడా ఉంది . ఈ సినిమా విడదల సమయానికి చంద్రబాబు నాయుడు గారు సినిమాటోగ్రఫీ మంత్రి . ఆయనకు కూడా టైటిల్సులో ధన్యవాదాలు చెప్పడం జరిగింది . ఈ సినిమా టైంకు యన్టీఆర్ అల్లుడు కూడా అయ్యారు .

గుండమ్మ కధ సినిమాకు మాటలు వ్రాసిన డి వి నరసరాజు గారే ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చిన ఈ సినిమాకు కూడా మాటలు వ్రాయడం విశేషం . గుండమ్మ కధ , మాయాబజార్ డైలాగుల్ని ఎవరూ వ్రాయలేరు మళ్ళా . వాటిని వ్రాసిన పింగళి , నరసరాజు గార్లు కూడా అలా మళ్ళా వ్రాయలేరు గాక వ్రాయలేరు .

ఈ సినిమాకు రాజన్ నాగేంద్ర సంగీతాన్ని అందించారు . పాటలన్నీ బాగుంటాయి . ఊపిస్తాయి . శాస్త్రీయ నృత్య ఆహార్యంలో శ్రీదేవి , రాధికలు ఇద్దరు హీరోలతో చేసే డాన్స్ హైలైట్ . చాలా అందంగా చిత్రీకరించబడింది . అతిలోకసుందరి అద్భుతంగా ఉంటుంది ఈ పాటలో . ఆడవే రాజహంసా అంటూ సాగుతుంది ఈ పాట . మిగిలిన డ్యూయెట్లు కూడా బాగుంటాయి .

పాటలను అన్నీ వేటూరే వ్రాసారు . ఆయనకు రెండు ముఖాలు . ఒకటి శంకరాభరణం ముఖం , మరొకటి అ అంటే అమలాపురం ముఖం . ఏ ముఖమయినా బాగుంటుంది . అదే ఆయన గొప్ప .

సినిమా యూట్యూబులో ఉంది . యన్టీఆర్ , కృష్ణ , శ్రీదేవి అభిమానులు ఇంతకుముందు చూసి ఉండకపోతే తప్పక చూడండి . రాంగోపాల్ వర్మ చూసే ఉంటాడు కాబట్టి ఆయనకు మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఉండదు . It’s a 100% romantic , feel good , family entertainer .
#తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగుసినిమాలు



(ఎవరి ఫ్యాన్సూ హర్ట్ గాకుండా, ఎవరి పాత్ర ప్రాధాన్యమూ తగ్గకుండా… స్టెప్పులు, సీన్లు, డ్రెస్సులు, ఫైట్లు, పాటలు అన్నీ సమతూకంతో కూర్చడం నవ్వుపుట్టిస్తుంది… కథ, ప్రజెంటేషన్‌పై దృష్టికన్నా ఈ బ్యాలెన్సింగ్ ప్రయాసే సరిపోయినట్టుంది దర్శకుడికి… సినిమా ఆడలేదు… — ముచ్చట )



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions