Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పులి, సింహం కలిస్తే లైగర్… కుక్క, తోడేలు కలిస్తే..? ఈ 50 కోట్ల జీవి..!!

March 21, 2025 by M S R

.

కుక్క మనకు కాపలా అని మన నమ్మకం. నమ్మకాలెపుడూ డిబేటబుల్. కుక్కకు మనం కాపలానా? లేక మనకు కుక్క కాపలానా? అనేది కుక్కలను పెంచుకునేవారినడిగితే కరవకుండా చెబుతారు.

వీధి కుక్కలు- పెంపుడు కుక్కలకే తలవాచిపోతే ఇక అడవి కుక్కల గురించి వింటే అడవులపాలయిపోతాం. అడవి కుక్క సింహంతో సమానం. అది ఊళ్లోకి రావడంవల్ల గ్రామసింహం అయ్యింది.

Ads

అపార్టుమెంట్లలో, గేటెడ్ కమ్యూనిటీల్లో మనుషుల పేర్లు వాడ్డం మానేసి లాబ్రడార్ వాళ్ల ఇల్లు, బొచ్చుకుక్క వాళ్ల ఇల్లు, రెండు కుక్కల వాళ్ల ఇల్లు అని కుక్కగుర్తుగా పనిమనుషులు, సెక్యూరిటీవారు చెప్పుకుంటూ ఉంటారు.

మనిషికి విలువ ఉందో లేదో తెలియదు కానీ… కుక్కలకు అపారమైన విలువ ఉంది. యాభై కోట్లు పెట్టి ఒక బొచ్చు కుక్కను కొన్న శునకప్రేమికుడు మన పక్కనే బెంగళూరులో ఉండడం మనకెంత గర్వకారణం? ఒక కుక్కమీద యాభై కోట్లే కాదు…అంతకుముందు కూడా అనేక కుక్కలమీద ఇలాగే కోట్లకు కోట్లు పెట్టాడు ఈయన. బెంగళూరు ఊరవతల తన ఫార్మ్ హౌస్లో ఉన్న కుక్కల మార్కెట్ విలువ, ఐటీ ప్రకారం పేపర్ విలువలో తేడాలు ఉండవచ్చు కానీ…మొత్తమ్మీద వందల కోట్ల విలువ ఉంటుంది.

యాభై కోట్ల కుక్కలో ఏమిటి ప్రత్యేకత? అంటే అదో పెద్ద శునకపురాణం. అతి పురాతన వస్తువులను, సెలెబ్రిటీలు వాడిన వస్తువులను వేలంలో కోట్లకు కోట్లు పెట్టి కొనడం చూశాము. కళాఖండాలను కొని… దాచుకుని… ఎక్కువ రేటుకు అమ్ముకోవడం విన్నాము.

యాభై కోట్లకు ఈ కుక్కను కొంటే వంద కోట్లకు భవిష్యత్తులో అమ్ముకునే జాక్ పాట్ అయితే కచ్చితంగా ఉండదు. కుక్క సగటు జీవన ప్రమాణం మహా అయితే పదిహేనేళ్ళు. ఈ పదిహేనేళ్ళలో ఈ కుక్క మీద పెట్టిన యాభై కోట్లను తిరిగి రాబట్టడంతోపాటు, దానిమీద వడ్డీ, లాభం సంపాదించే మార్గం ఏముందో మరి!

జాతీయ, అంతర్జాతీయ కుక్కల ప్రదర్శనలకు ఈ కుక్కను విమానాల్లో తీసుకెళతాడట. సరే. మంచిదే. మనుషుల అందాల పోటీలకే లక్షలు, కోట్లు ఇవ్వలేక సర్వీస్ అపార్ట్ మెంట్లలో నలుగురిని, అయిదుగురిని కుక్కే ఈవెంట్ మేనేజర్లు… ఈ కుక్క రాకకు కోట్లకు కోట్లు ఇస్తారా? ఇస్తారేమో! లేకపోతే ఈ బెంగళూరు శునక ప్రేమికుడు సతీష్ ఎందుకు కొంటాడు?

ఇంతకూ ఇది ఏ బ్రీడో తెలుసా?
తోడేలు- కుక్క కలిసిన సంకర జాతి శునకం.

(lion plus tiger లైగర్ అయినట్టు… దీన్ని డోల్ఫ్ అని గానీ, వోడ్ అని గానీ పిలవరు… wolfdog అంటారని గ్రోక్ చెప్పింది…)

గోముఖవ్యాఘ్రాలు; మేకవన్నె పులులు…అని మనుషుల ముసుగులకు అనవసరంగా నోరులేని జంతువులను ప్రస్తావిస్తున్నాం. తోడేలు ముఖ శునకం; వ్యాఘ్రముఖ శునకం; నక్క ముఖ శునకం అని సార్థకనామాలకు వీలుగా సంకరజాతినే పుట్టిస్తున్నప్పుడు ముసుగు పోలికలను ఎలా చెప్పాలో?

ఈ యాభై కోట్ల తోడేలు- కాకేషన్ షెఫర్డ్ సంకర జాతి శునకరాజంలో తోడేలు లక్షణాలుంటాయా? శునక లక్షణాలుంటాయా? రెండూ కలగలిసి ఉంటాయేమో! పది నెలలుగా రావణాసురుడి రాక్షసులమధ్య అశోకవనంలో ఒంటరిగా… తోడేళ్ల మధ్య ఉన్న లేడి పిల్లలా ఉన్నానని చెప్పుకుంటుంది వాల్మీకి సుందరకాండలో సీతమ్మ దిగులుగా. ఆ నిరాశా నిస్పృహల్లో శింశుపావృక్షం కొమ్మకు తన పొడుగాటి జడను ముడివేసి ఉరివేసుకుందామని కూడా అనుకుంటుంది. ఈలోపు హనుమ రావడం… మిగిలిన కథ తెలిసిందే.

మనం ఎటుతిరిగినా తోడేళ్ళ మధ్యే ఉండడానికి లేదా సకలజంతుజాలంలో తోడేళ్లే దర్శనమివ్వడానికి లోకంలో ఎందరో సతీష్ లు దేశదేశాలు తిరిగి… కోట్లకు కోట్లు ఖర్చు పెడుతుంటారు.

అన్నట్లు-
కుక్క మనిషిని కరిస్తే వార్త కానే కాదు- మనిషి కుక్కను కరిస్తేనే వార్త అని జర్నలిజంలో వార్తకు తొలి ప్రమాణం. అలా కుక్క కుక్కగా ఉంటే వార్తే కాదు- కుక్క తోడేలులా ఉంటేనే వార్త. వార్తకు విలువ. ఆ విలువల కొలమానంలో ఈ సంకరజాతిని కొలవడానికి మన దగ్గరున్న తూనికరాళ్ళు సరిపోవు! సరిపోయినా అవి దాని ఒకపూట తినే మూడు కేజీల చికెన్ ముక్కలకు కూడా ఏ మూలకూ చాలదు!

సంపదకు కొలమానాలైన ఇల్లు, బంగారం, స్థలాలు, బ్యాంక్ డిపాజిట్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ లాంటివాటికి శునకసంపద కూడా తోడయ్యిందేమో!

కొస మెరుపు:-

కుక్కల పట్ల అమానవీయంగా ప్రవర్తించినా, కుక్కలను హింసించినా తీవ్రమైన శిక్షలు విధించడానికి; విపరీతమైన అపరాధ రుసుములు వసూలు చేయడానికి వీలుగా బ్రెజిల్లో తెచ్చిన కొత్త చట్టం మీద ఆ దేశాధ్యక్షుడు చంకలో కుక్కను పెట్టుకుని సంతకం చేశాడు.

వీధి కుక్కను కొడితే ఇకపై అక్కడ 24 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కుక్కలను తప్ప ఇంకే జంతువులను పెంచుకోవడానికి వీల్లేకుండా ఈ కొత్త చట్టం ఆంక్షలు విధిస్తోంది.

నిజమే.
డాగ్స్ మస్ట్ బీ క్రేజీ!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions