.
Subramanyam Dogiparthi …….. మల్లెమాల యం.యస్. రెడ్డి నిర్మించిన ఈ అందమైన ఏకలవ్య సినిమా 1982 అక్టోబరులో విడుదల అయింది . దాసరి యన్టీఆరుతో తీయాలని ఉబలాటపడ్డ సినిమా మల్లెమాల కృష్ణతో తీసేసారు .
యన్టీఆర్ ఏకలవ్యుడిగా అడవిరాముడులో తళుక్కుమంటారు కూడా . మొత్తం మీద కన్నప్ప అంటే కృష్ణంరాజులాగా మనకు అల్లూరి సీతారామరాజు అన్నా , ఏకలవ్యుడు అన్నా కృష్ణే .
Ads
ఈ సినిమాలో మెచ్చుకోవలసింది సిన్సియరుగా , బాగా కష్టపడ్డ కృష్ణనే . సినిమా మొదట్లోనే తాండవ నృత్యాన్ని కష్టపడి తర్ఫీదు పొంది నృత్యించటం దగ్గర నుండి చివరిదాకా ప్రతీ సీన్లో ఆయన సిన్సియారిటీ , కష్టం కనపడతాయి .
ఇంక తిట్టుకోవలసింది సినిమాకు పెట్టుబడి పెట్టిన సగం కవి- సగం పెట్టుబడిదారుడు మల్లమాల రెడ్డి గారిని . కె వి మహదేవన్ సంగీతం , యస్ యస్ లాల్ ఫొటోగ్రఫీ దర్శకత్వం చాలా బాగుంటాయి . సినిమాలోని అన్ని పాటల్నీ , పద్యాల్నీ ఇండస్ట్రీలో ఎవరూ లేరు అన్నట్లుగా ఆయనే వ్రాసుకున్నారు .
బాగా అందమైన స్త్రీకి కురూపి కాకపోయినా అందంగా లేని మొగుడులాగా , మహదేవన్ శ్రావ్య సంగీతానికి ఆయన లిరిక్స్ పరుగెత్తలేకపోయాయి . బహుశా దాసరి మీద పంతంతో ఆయనలాగా తానూ వ్రాయగలను అని చూపదలచుకున్నాడేమో ! మల్లెమాలకు పంతం , బింకం ఎక్కువ కదా !
దర్శకత్వం విజయారెడ్డి కాకుండా ఏ బాపుకో , కమలాకర కామేశ్వరరావుకో అప్పచెప్పి ఉంటే తప్పకుండా కన్నప్పలాగా ఓ కళాఖండం అయిఉండేది . తాడేపల్లిగూడెంలో పుట్టిన ఈ విజయారెడ్డి కూడా మంచి దర్శకుడే . కన్నడంలో చాలా సినిమాలకు దర్శకత్వం వహించారు . ఈ సినిమా దర్శకత్వం బాగానే ఉంది . బాపు అయితే కళాఖండం అయిఉండేది .
ఏకలవ్య కధ చెప్పేదేముంది . అందరికీ తెలిసిన కధే . ఎవరికి ఎలా కావాలని అనుకుంటే అలా ఆవిష్కరిస్తారు . ఏకలవ్యుడు హింసాప్రవృత్తి కలవాడు కాబట్టే ద్రోణుడు విలువిద్యను నేర్పించలేదని చాగంటి వంటి సనాతనులు తమ ప్రవచనాల్లో చెపుతుంటారు .
ఈ సినిమాలో ద్రోణుడు , కృపి , అశ్వత్థామలకు ఏకలవ్యుడి మీద అపేక్ష ఉన్నా అర్జునుడి ఆంక్షలతో శిక్షణ ఇవ్వలేక పోయినట్లుగా చూపించారు .
ఈ సినిమా విషయంలో మల్లెమాల తీసుకున్న మంచి నిర్ణయాలలో ఒకటి కధా సంవిధానాన్ని , సంభాషణలను కొండవీటి వెంకట కవికి అప్పచెప్పటం . ఆయన యన్టీఆర్ ఏమంటివి ఏమంటివిని వదల్లేదు ఈ సినిమాలో కూడా . అశ్వత్థామ చేత అర్జునుడిని ఉద్దేశించి చెప్పిస్తాడు .
ఈ సినిమాలో మరో ఆసక్తికరమైన అంశం ఉంది . కర్ణుడికి ద్రోణుడు విలువిద్యను నేర్పనంటేనే కర్ణుడు పరశురాముడిని మోసం చేసి విలువిద్యను నేర్చుకున్నాడని ఎక్కువగా విన్నాం . కానీ , ఈ సినిమాలో ద్రోణుడి శిష్య బృందంలో కర్ణుడు కూడా ఉంటాడు . గీతా ప్రెస్ వారు ముద్రించిన డా కాళ్ళకూరి అన్నపూర్ణ అనువదించిన సంక్షిప్త మహాభారతంలో కూడా శిష్యులలో కర్ణుడు ఉన్నాడనే చెప్పబడింది (Page No.71) . మరి మా అనంత శ్రీరాముడు ఏమంటాడో !
ఈ సినిమాలో గొప్పగా చెప్పుకోవలసింది ఔట్ డోర్ లొకేషన్లని , ఇండోర్ కళాత్మక సెట్టింగులను . అలాగే మహదేవన్ సంగీతాన్ని , నృత్య దర్శకులు శీను- శేషులను . ఔట్ డోర్ లొకేషన్లను చూస్తుంటే బాపు భక్త కన్నప్పే గుర్తుకొస్తుంది .
దొరవన్న నీవేనురా అంటూ సాగే పాట . ద్రుపదుడి ముందు కవిత నృత్యించే పాట . చాలా బాగుంటుంది చిత్రీకరణ కూడా . కవిత ఇంత అందంగా జయప్రదలాగా నృత్యించగలదా అని అనిపిస్తుంది . అంత అద్భుతంగా ఉంటుంది పాట, ఆట అన్నీ .
సైరా మొనగాడా సై సైరా మొనగాడా , ఆట భళా ఆట భళా చాంగు భళారే అనే రెండు గ్రూప్ డాన్సులు చాలా బాగా చిత్రీకరించబడ్డాయి . ఆ తర్వాత చెప్పుకోవలసింది కృష్ణ , జయప్రదల డ్యూయెట్లు . అందమైన ప్రకృతి నేపధ్యంలో అద్భుతంగా వచ్చాయి . వెరశి పాటలన్నీ బయట గొప్పగా హిట్ కాకపోయినా థియేటర్లో మాత్రం చాలా బాగుంటాయి .
ఏ వేటూరికో అప్పచెప్పి ఉంటే వీర హిట్ అయి ఉండేవి . ఆయన డబ్బులు ఆయనిష్టం . నటనకు వస్తే కృష్ణ తర్వాత తాంబూలం జయప్రదదే . అందంగా , చలాకీగా , బావంటే పడిచచ్చే మరదలుగా గొప్పగా నటించింది . ముఖ్యంగా నృత్యాలలో . తర్వాత ద్రోణుడిగా గుమ్మడి , ఆయన భార్య కృపిగా ఆదోని లక్ష్మి , అశ్వత్థామగా సుధాకర్ చాలా బాగా నటించారు .
ఏకలవ్యుడి తల్లిగా కృష్ణకుమారి , ఏకలవ్యుడి మిత్రుడిగా మాడా , అతని ప్రేయసిగా కృష్ణవేణి , ద్రుపదుడుగా గిరిబాబు బాగా నటించారు . అర్జునుడిగా శరత్ బాబు సెట్ కాలేదు . అసలే బలహీనుడిగా చూపబడిన ఈ సినిమాలో ఆ పాత్ర శరత్ బాబు చేతిలో పడి మరీ బలహీనపడింది . పౌరాణికం కదా ! చాలా పాత్రలు ఉంటాయి .
శివుడిగా రంగనాధ్ , పార్వతిగా ప్రభ , శారదా మాతగా జయంతి , భీష్ముడిగా జె వి సోమయాజులు నటించారు . అర్జునుడి ప్రాపకం కోసం గురు ధర్మాన్ని ఉల్లంఘించిన ద్రోణుడు సరస్వతి మాత చేత శపించబడతాడు . శారదా మాతగా జయంతి బాగానే నటించింది . ఏ యస్ వరలక్ష్మో అయితే ఇంకా బాగుండేది .
మొత్తం మీద అందమైన , శ్రావ్యమైన సినిమా . మహాభారతంలో కర్ణుడి లాంటి పాత్రే ఏకలవ్యుడిది కూడా . ఆనాటి సామాజిక వ్యవస్థ వలన అన్యాయానికి గురయిన రెండు పాత్రలలో ఒకటి ఏకలవ్యుడిది . కర్ణుడికి ఎలా అయితే కుంతీకుమారుడిగా ఓ అప్రకటిత నేపధ్యం ఉందో , అలాగే ఏకలవ్యుడికి కూడా ఉంది . కొందరు కృష్ణుడికి మేనత్త కొడుకు అని , మరి కొందరు తమ్ముడు వరుస అవుతాడని చెపుతారు . చివరకు Meta , Grok కూడా భిన్నాభిప్రాయలను వెలిబుచ్చాయి .
ఈ అకడమిక్ చర్చ ఎలా ఉన్నా సినిమా అందంగా ఉంటుంది . కృష్ణ , జయప్రదలు పోటాపోటీగా హుషారుగా నటించారు . కవిత శాస్త్రీయ నృత్యం వీర రొమాంటిక్కుగా ఉంటుంది . యూట్యూబులో ఉంది . చూడనివాళ్ళు అర్జెంటుగా చూసేయండి . అందమె ఆనందం , అదే జీవిత మకరందం . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమా_కబుర్లు
Share this Article