.
చాన్నాళ్లుగా ఫీల్డులో ఉన్నాడు జొన్నలగడ్డ సిద్దు… కానీ డీజే టిల్లుతో ఇంటింటికీ చేరువయ్యాడు… దాని సీక్వెల్ సూపర్ హిట్… ఆ జానర్ వేరేవాళ్లకు చేతకాదు ఇప్పటి హీరోల్లో…
వన్ లైనర్స్, పంచ్ డైలాగులు, సిద్దు మార్క్ టైమింగుతో కామెడీ ప్రేక్షకులను నవ్వించాయి, థియేటర్లకు రప్పించాయి… కానీ ఈసారి కొత్త జానర్‌లోకి, అదీ అయోమయపు జానర్‌లోకి ప్రవేశించి దెబ్బతిన్నాడు… అసలు ఇది బొమ్మరిల్లు భాస్కర్ సినిమాయేనా..?
Ads
సిద్దు అనే పాత్ర… తన చుట్టే కథ… తన తల్లి గతంలో ఓ ఉగ్రవాద దాడిలో మరణిస్తుంది… దాంతో అతను దేశాన్ని కాపాడాలనే లక్ష్యంతో RAW ఏజెంటుగా చేరతాడు… ఇక కథలో తన జర్నీ, ఎదురైన సవాళ్లు, ఏ సవాల్‌లో దేశాన్ని కాపాడతాడు అనేది కథ…
తన నటనకేమీ ఢోకా లేదు… అలవోకగా చేస్తూ పోయాడు… కామెడీ సీన్లలో చెప్పేదేముంది..? కానీ ఎమోషనల్ సీన్లలో నాట్ ఇంప్రెసివ్… నిజానికి దర్శకత్వ వైఫల్యాల నడుమ సిద్దు శ్రమ వేస్టయిపోయింది… హీరోయిన్ వైష్ణవి చైతన్య కూడా మంచి నటి… కానీ వీరిద్దరి జోడీ పెద్దగా వర్కవుట్ కాలేదు… కెమిస్ట్రీ లేదు, ఫిజిక్స్ లేదు, అసలు మ్యాథ్సే లేదు…
డైరెక్టర్ భాస్కర్ మరీ ఓ ఔట్ డేటెడ్ రా ఏజెంట్ స్టోరీ రాసుకున్నాడు… కొత్తదనం ఎక్కడా లేదు సరికదా… లవ్, రొమాన్స్, కామెడీ, దేశభక్తి ఎట్సెట్రా అన్ని రకాలూ కలిపి మిక్సీ చేశాడు… కొత్తగా రుచీపచీ లేని ఏదో పదార్థం బయటికొచ్చింది… ఉగ్రవాద మిషన్ సీరియస్‌గా గాకుండా సిల్లీగా తీసినట్టు అనిపించింది…
హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ కూడా వీక్… సెకండాఫ్‌లో నేపాల్ మిషన్ మరీ బోరింగ్… అసలు హీరోహీరోయిన్ల నడుమ సంభోగం గురించి డైలాగులు దేనికి..? కృతకంగా, కావాలని పెట్టినట్టున్నారు… ఇది మరీ సిద్దు టేస్టులా ఉంది… టీజర్లలో చిల్లరగా వినిపించిన డైలాగులు కొన్ని సినిమాలో లేవు, బతికిపోయారు తెలుగు ప్రేక్షకులు…
అయ్యా, సిద్దూ, ఆ విశ్వక్సేనే ఇక నా సినిమాలో బూతులుండవు అని లెంపలేసుకున్నాడు ఆమధ్య ఏదో సినిమా అడ్డగోలుగా చీదేసి… తమరు అది చదివినట్టు లేరు… న బూతే న భవిష్యత్ అనే భ్రమల నుంచి బయటికి వచ్చెయ్ అర్జెంటుగా…
ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ లాంటి సపోర్టింగ్ యాక్టర్స్ ఉన్నా వాళ్ల పాత్రలు పెద్దగా గుర్తుండవు. సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రెండూ నిరాశపరిచాయి. పైగా ముగ్గురు పనిచేసారట ఈ గొప్ప సినిమాకు…
కెమెరా వర్క్ ఓకే కానీ ఎడిటింగ్ సరిగా లేదు… మొత్తంగా “జాక్” అనేది ఒక బోరింగ్, అవుట్‌డేటెడ్ సినిమా… స్క్రిప్ట్ స్టేజ్‌లోనే ఆపేసి ఉంటే బాగుండేది… థియేటర్‌లో చూడాల్సిన అవసరం లేదు… సిద్దు భాషలోనే చెప్పాలంటే, డబ్బు బొక్క..!!
చివరగా… రా ఏజెంట్లు ప్రాణాలకు తెగించి అనేక ఆపరేషన్లలో పాల్గొంటుంటారు… వాళ్లు మన దేశ అజ్ఞాత హీరోలు… వాళ్లను సిల్లీగా, అంటే చిల్లరగా చూపించకండిరా..!!
Share this Article