.
ఖలేజా సినిమా గుర్తుంది కదా… ఆలీ, మహేష్, సునీల్, అనుష్కల కళ్లుగప్పి ఓ వెహికిల్ స్పేర్ పార్ట్స్ క్షణాల్లో విప్పేసి, స్కెలిటన్ మిగిలిస్తారు దొంగలు… అలాంటి గ్యాంగులు బోలెడు…
అసలు నంబర్ ప్లేటు తప్ప మిగతావన్నీ ఎలా అమ్మాలో, ఎవరికి అమ్మాలో వాళ్లకు సంపూర్ణంగా తెలుసు… వృత్తిరహస్యం… ఎస్, చిన్న చిన్న స్టీల్ బ్రిడ్జిలే కట్ చేసి, అమ్మేసుకునే ఘనులు, జ్ఞానులు ఉన్న లోకం ఇది…
Ads
ఐతే అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ నుంచి ఏకంగా 900 ఇంజన్లు మాయమైన తీరు మాత్రమే కాదు, అసలు వాటిని ఎవరికి అమ్ముకుంటారు దొంగలు..? ఈ ప్రశ్న కొద్దిరోజులుగా వేధిస్తోంది…
అంత పెద్ద కార్ల కంపెనీ… ఏకంగా 900 ఇంజన్లు మరీ బోల్టులు, నట్ల రేంజులో ఎత్తుకుపోవడం ఎలా సాధ్యం…? ప్రతి చిన్న పార్టుకు లెక్క ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, పైగా అదేమైనా జేబులోనో, సంచిలోనో వేసుకుపోయేది కాదు కదా…
అదేదో సినిమాలో బ్యాంకును బద్దలు కొట్టి వందల కోట్ల కరెన్సీ నోట్లను ఎత్తుకెళ్తారు, అలా ఎత్తుకెళ్లాలి ఇంజన్లను… పోనీ, అవి ఇంకేదైనా కార్ల కంపెనీకి ఉపయోగపడతాయా..? పడతాయేమో గానీ, కొనే కంపెనీ ఉండదు కదా… ప్రతి ఇంజన్‌కూ ఓ నంబర్ ఉంటుంది, కియా కార్లకు మాత్రమే ఉపయోగపడే స్పెసిఫికేషన్స్, కొలతలు ఉంటాయి…
నిజానికి ఈ కియా ఫ్యాక్టరీ ఓ అసెంబ్లింగ్ యూనిట్ మాత్రమే… ఇంజన్లు విదేశం నుంచి, చెన్నై పోర్టు మీదుగా వస్తాయి… విడిభాగాలన్నీ అసెంబ్లింగ్ చేసి అమ్ముకునే యూనిట్ ఇది… తయారీ పరిశ్రమ కాదు… అవి వస్తున్నప్పుడు మార్గమధ్యంలోనే మాయం చేశారా..? చేస్తే వెంటనే తెలిసిపోవాలి కదా… మాయ, మిస్టరీ… మోడస్ ఆపరెండీ అనూహ్యం…
అబ్బే, కేసు ఏమీ అవసరం లేదు అందట మొదట ఈ యాజమాన్యం… దాంతో మరింతగా అనుమానాలు బలపడ్డాయి… తీరా ఇప్పుడు 9 మందిని అరెస్టు చేశారట పోలీసులు… అందరూ ఇంటి దొంగలే… అంటే గతంలో ఇక్కడ పనిచేసి మానేసిన లేదా మానేయబడిన దొంగ వర్కర్లు… అంతా తమిళ గ్యాంగు…
పటాన్ సలీం, వినాయకమూర్తి, మణికంఠ, ఆర్ముగన్, అర్జున్ మరికొందరు… ఇదంతా వోకే, మళ్లీ మొదటి ప్రశ్నే… వాటిని చాకచక్యంగా దొంగిలించారు సరే, ఎలా డిస్పోజ్ చేస్తారు… దీనికి సమాధానం ప్రజాశక్తి వార్తలో కనిపించింది…
వాటిని ఫిషింగ్ బోట్లకు ఇంజన్లుగా… చివరకు మరీ చెరుకు రసం మిషన్లుగా అమ్ముకున్నారట… ఛిఛీ, చివరకు అంత కియా బతుకు బతికీ చివరకు చెరుకు రసం తీసే మిషన్లు అయ్యాయా అనిపించింది… సో, దొంగతనం చేయడం పెద్ద తెలివి కాదు, దాన్నెలా, ఎవరికి, ఏ అవసరానికి అమ్మాలో తెలిసినవాడే నిజమైన దొంగ..! అదేదో రవితేజ సినిమాలో కనిపించిన ప్రతి దాన్నీ దొంగతనం చేసుకొస్తారు రవితేజ, బ్రహ్మానందం… చివరకు పబ్లిక్ టెలిఫోన్ కూడా… దానికే కనెక్షన్ తీసుకుని వాడుకోవడం అల్టిమేట్ అన్నమాట… కియా ఇంజన్లలాగే..!!
Share this Article