.
అప్పట్లో చంద్రబాబు, బాలకృష్ణ తదితరులు పదే పదే చెప్పేవాళ్లు… అఫ్‌కోర్స్, ఎన్టీయార్ గొప్పోడు, తోపు, తురుము, తెలంగాణ అనాగరిక సమాజాన్ని ఉద్దరించి, జనజీవన స్రవంతిలో కలిపిందే ఆయన అన్నట్టుగా ప్రసంగాల్లో ఊదరగొట్టేవాళ్లు…
అదే సమయంలో తాము తెలంగాణను కించపరుస్తున్నామనే సోయి మాత్రం కనిపించేది కాదు… సరే, అది వాళ్ల గుణం అది… ఎన్టీయార్ వచ్చాకే తెలంగాణ జనం అన్నం తినసాగారు… పొద్దున్నే నిద్రలేవడం కూడా ఎన్టీయారే నేర్పించాడు వంటి వ్యాఖ్యలు చేసేవాళ్లు…
Ads
తాజాగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎక్కడో మాట్లాడుతూ సేమ్, చంద్రబాబులాగే మాట్లాడాడు… అచ్చం అలాగే… ఆంధ్రులు వచ్చి తెలంగాణ రైతులకు వ్యవసాయం ఎలా చేయాలో నేర్పించారట… అంటే, ఆంధ్ర రైతులు రాకముందు తెలంగాణ జనం అండమాన్ ప్రజల్లాగే చెట్ల కాయలు తింటూ, దుంపలు తవ్వుకుని తింటూ గడిపేవారా సార్..?
ఫేస్‌బుక్‌లో ఓ పాత పేపర్ క్లిప్పింగ్ కనిపించింది… (1954 లో వరంగల్ రైతుకు వరి పంటలో అవార్డు లభించింది అని ఖాజా వహీద్ వాల్ నుంచి ఆంధ్రపత్రిక క్లిప్పింగ్ ఇది… )
నో, నో, ఆయన ఉద్దేశం అది కాదు… నిజాంసాగర్ కట్టాక కావాలనే నిజాం ఆంధ్రా నుంచి రైతుల్ని ఇక్కడికి ఆహ్వానించాడు, అందుకని వాళ్లు వచ్చి ఆధునిక సాగు పద్ధతులు తెలంగాణకు నేర్పించారనేది సారు గారి ఉద్దేశం అంటారా..?
సరే, ఆయనకన్నా మనకు మాత్రం ఎక్కువ ఏం తెలుసు..? కాకపోతే కొన్ని సందేహాలు… పాపం, కాకతీయ ప్రభువుల కాలంలోనే మనకు ఏ ప్రాంతంలో లేనట్టుగా గొలుసు కట్టు చెరువులు ఉండేవనీ, నీటిపారుదల వ్యవస్థల్లో కాకతీయ కాలంలోని తెలంగాణ ప్రాంతం దేశానికే ఆదర్శంగా ఉండేదని అంటారు కదా… అది చరిత్ర కదా…
మరి ఆ నీటి వనరుల కింద ఏం పండించేవాళ్లు..? వరి గాకుండా మొక్కజొన్న, ఆముదం పండించుకుని, మక్క గట్క, మక్క రొట్టెలు మాత్రమే తినేవాళ్లా..?
బావుల కింద, కుంటల కింద ఏం చేసేవాళ్లో పాపం తెలంగాణ రైతులు..? సజ్జలు, జొన్నలు సాగుచేసేవాళ్లా…? మరి చరిత్ర భిన్నంగా ఎందుకు చెబుతోంది… కృష్ణా, గోదావరి నదులపై బ్యారేజీలు నిర్మించేదాకా ఆంధ్రా జిల్లాల ప్రజలకు జొన్నన్నం తప్ప మరేమీ తెలియదని శ్రీనాథుడే చెప్పాడట కదా…
(జొన్నకలి, జొన్న యంబలి జొన్నన్నము, జొన్నపిసరు, జొన్నలె తప్పన్, సన్నన్నము సున్న సుమీ పన్నుగ పలనాటి సీమ ప్రజలందరకున్…)
కాకతీయులు, నిజాం కాలాల్లోనే తెలంగాణ ప్రాంతంలో వంటలు, బిర్యానీల ఘుమఘుమలు దేశ, విదేశ పర్యాటకులను అలరించేవని కూడా చెబుతారు కదా… అవన్నీ తప్పేనా..?
ఎక్కడ మంచి నీటివనరులు, ప్రాజెక్టులు కనిపిస్తే చాలు, అక్కడికి ఆంధ్రులు వచ్చి చేరారని తెలంగాణ సమాజం ఆరోపిస్తుంటుంది కదా… అదీ తప్పేనా..? జస్ట్, తెలంగాణ ప్రజలకు వ్యవసాయం నేర్పించడానికి వచ్చి ఇక ఇక్కడే ఉండిపోయారా..?
కేసీయార్, కేటీయార్, హరీష్, కవిత ఏదేదో ప్రయాసపడిపోతూ కాంగ్రెస్ పార్టీని నష్టపరచాలని ప్రయత్నిస్తున్నారు గానీ… అవసరం లేదు… బయటి శక్తులు అసలు అవసరమే లేదు… లేదు… అవును గానీ సారూ… పిల్లల పాఠ్యపుస్తకాల్లో చరిత్రలు, ఈ నిజాలు ఏవైనా పొందుపరిచే ఆలోచన, అవకాశం ఉన్నాయా..?!
Share this Article