.
శంకర్‌రావు శెంకేసి (79898 76088) ……. 140 దేశాల భామలు… 3 వేల మంది మీడియా ప్రతినిధులు… అధికారికంగానే రూ.27 కోట్ల ఖర్చు… ప్రపంచంలోని సౌందర్య ఆరాధకులకు పండుగ చేసే 72వ ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్) పోటీలు మన హైదరాబాద్ వేదికగా మే 7 నుంచి 31 వరకు జరగనున్నాయి.
నెల రోజులుగా అధికార, అనధికార వర్గాల్లో ఆర్గనైజింగ్ ప్రక్రియ అత్యంత ఉత్సాహపూరితంగా సాగుతోంది. మిస్ వరల్డ్ పోటీల ఈవెంట్‌ను ఒక్క రాజధానికే పరిమితం చేయకుండా, తెలంగాణలోని కొన్ని సెలెక్టివ్ ప్రదేశాలకు విస్తరించడం గొప్ప ఆలోచన.
Ads
పోటీల్లో పాల్గొనే అందగత్తెలను రప్పించడం ద్వారా ఆయా ప్రదేశాలను అంతర్జాతీయంగా ఫోకస్ అయ్యేలా చూడటం ‘స్వామికార్యం… స్వకార్యం’ అనిపించుకుంటుంది… భేష్! గుడ్ ప్లాన్…!
25 రోజుల పాటు జరిగే ఈవెంట్‌లో భాగంగా అందాలభామలు సందర్శించే ప్రాంతాల్లో సుప్రసిద్ధ రామప్ప ఆలయం కూడా ఒకటి. మే 14న వాళ్లు రామప్పకు వస్తున్నారు. రామప్ప ఆధ్యాత్మిక క్షేత్రం మాత్రమే కాదు, సౌందర్యారాధకులకు పండుగ స్థలి.
అద్భుత నిర్మాణరీతులకు, అపురూప శిల్ప సంపదకు నెలవు.. రామప్ప ఆలయం. ఇది జగద్విఖ్యాతం. కాకతీయుల నిర్మాణాల్లో తలమానికం. రాళ్లను కరిగించి, పోతపోసి శిల్పాలుగా మలిచారా..? అని ఆశ్చర్యం కలిగించే అనేక ఆకృతులు ఈ ఆలయంలో అబ్బురపరుస్తాయి.
దారాలు దూరే రంధ్రాలు, 800 ఏళ్లు గడిచినా కాంతిని కోల్పోకుండా సంస్కృతిని, కళలను కథలు కథలుగా చెప్పే శిల్పాలు.. రామప్పలో అడుగడుగునా కనిపిస్తాయి. అద్భుత సౌష్టవంతో వివిధ భంగిమల్లో ఆలయానికి ఇరువైపులా కొలువుదీరిన అందాల రాశుల నిలువెత్తు శిల్పాలు మంత్రముగ్దులను చేస్తాయి.
ఆనాటి నిర్మాణ యజ్ఞంలో పాల్గొన్న నిపుణుల ఇంజనీరింగ్ నైపుణ్యం, ఆనాడు ఉపయోగించిన సాంకేతికత ఇప్పటికీ సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తూనే ఉంటాయి. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి హయాంలో ఆయన సేనాని రేచర్ల రుద్రుడు 1213లో ఈ ఆలయాన్ని నిర్మించగా, 2021లో ఐక్యరాజ్య సమితి అనుబంధ యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.
కాకతీయులు నిర్మించిన అనేక అపురూప కట్టడాల్లో తొలిసారిగా అంతర్జాతీయ గుర్తింపు పొందింది రామప్ప ఆలయమే. కాకతీయుల కీర్తి తోరణం, వేయిస్తంభాల ఆలయం ఇంకా గుర్తింపునకు నోచుకోవాల్సి ఉన్నాయి.
సప్తస్వరాలను పలికే రాతి పిల్లనగ్రోవి, నీటిలో తేలియాడే ఇటుకలు, పేరిణి నృత్యానికి ప్రేరణగా నిలిచిన శిల్పాలు, హిందూ పురాణ గాథలను కళ్లకు కట్టే శిల్పాకృతులు, శివలింగంపై నిరంతరం పరావర్తనం చెందే సూర్యకాంతి, జాయప సేనాని విరచితమైన ‘నృత్త రత్నావళి’ ఘట్టాలు…
ఇలా అబ్బురపరిచే ఎన్నో విశేషాలకు రామప్ప నెలవైనప్పటికీ, ఆక్కడ కొలువుదీరిన నాగిని, మదనిక శిల్పాలే వీటన్నిటినీ మించి రామప్పకు ప్రత్యేక స్థానాన్ని ఆపాదించాయి. ఈ శిల్పాలే ఇప్పుడు ప్రపంచ అందగత్తెలతో పోటీ పడేందుకు సై అంటున్నాయి.
రామప్పను రేచర్ల రుద్రుడు దగ్గరుండి నిర్మించాడని చరిత్ర చెబుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నిపుణులైన శిల్పులను రప్పించి దాదాపు 15 ఏళ్లు పాటు ఈ ఆలయ నిర్మాణాన్ని కొనసాగించారట. ఆలయ నిర్మాణంలో రామప్ప అనే శిల్పి ప్రధాన పాత్ర పోషించాడు…
కాబట్టి ఆయన పేరిట రామప్ప అనే పేరు వచ్చిందనే అభిప్రాయం ఉండగా, శిల్పుల్లో కన్నడ ప్రాంతానికి చెందిన వారు దేవుడిని ‘అప్పా…’ అని పిలుస్తారని, రామలింగేశ్వరుడిని వారు రామప్ప అని పిలవడం వల్ల ఆలయానికి అదే పేరు ఖరారైందనే వాదన కూడా ఉంది. ఈ వాదనలు ఎలా వున్నా.. రామప్ప పేరే జగత్ప్రసిద్ధం…
ఆలయమంతా ఆధ్యాత్మిక గుబాళింపులే వున్నప్పటికీ, రంగ మండపం స్తంభాలు, దూలాల మధ్యన వెలుపల రెండు వైపులా ఏటవాలుగా కొలువుదీరిన నాగిని, మదనిక శిల్పాలు ఆలయాన్ని విభిన్న కళాసంస్కృతుల మేళవింపుగా మార్చివేశాయి.
కాకతీయుల కాలంలో నిర్మితమైన ప్రధాన ఆలయాల్లో ఎక్కడా ఇలా అందాల భామల విగ్రహాలు కనిపించవు. అవి కేవలం ఆధ్యాత్మిక పరమైన అంశాలకే పరిమితం అయ్యాయి. కానీ అందుకు భిన్నంగా, నేటి మిస్ట్ వరల్డ్ కంటెస్టెంట్లను తలదన్నేలా ఆనాడే రామప్పలో అపురూప సౌందర్యరాశులకు ప్రాణం పోశారు. ఈ అందాల రాశులను ఒక్క రామప్పలోనే ఎందుకు పొందుపరిచారు… అనే ప్రశ్నలకు సాధికార వివరణలు ఇంతవరకు వెలుగు చూడలేదు.
ఆలయంలో నాగిని- మదనిక శిల్పాలను సౌందర్య దృష్టితో చూస్తేనే వాటిలోని విశిష్టత అర్థమవుతుంది. ఆకట్టుకునే అంగసౌష్టవం, వొంపుసొంపులూ, హొయలూ, వయ్యారాల మేళవింపుగా రూపొందిన అందాలభామల శిల్పాలు కళ్లను తిప్పుకోనివ్వవు.
తూర్పు ద్వారానికి ఎడమ వైపున ఉన్న శిల్పంలోని యువతి… హై హీల్స్ చెప్పులు ధరించి ఉండటం ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. హైహీల్స్ కల్చర్ 20వ శతాబ్దంలోనిదని అందరూ భావిస్తారు. కానీ, ఆ కల్చర్‌ను 13వ శతాబ్దంలోనే చూపి ఆశ్చర్యపరిచారు రామప్ప శిల్పులు.
ఇక మరో శిల్పంలోని యువతి.. ఎంబ్రాయిడరీ అల్లికలతో కూడిన అందమైన వస్త్రాలను శరీరం పైనుంచి జార విడుస్తూ హొయలు ఒలకబోస్తూ ఉంటుంది. తలపై వెంట్రుకల అమరిక, చెవులకు ఆకర్షణీయమైన పెద్దసైజు గుండ్రటి దుద్దులు, నాజూకైన బంగారు ఆభరణాలను ధరించిన యువతులు అపర అప్సరసలుగా మంత్ర ముగ్దులను చేస్తూ ఉంటారు.
రామప్పలోని అందాల రాశుల శిల్పాలకు, వాటిలోని అలంకరణలకు, కవ్వింపులకు ప్రేరణ ఆనాటి స్థానిక మహిళలే అనే అభిప్రాయం ఉన్నా దానిని పూర్తిగా విభేదించే వారే ఎక్కువ. నాగిని, మదనిక శిల్పాల ముఖాలు దక్షిణ భారతంలోని స్త్రీలను పోలి లేవని, అవి శిల్పుల ఊహా చిత్రాలై ఉండవచ్చనే అభిప్రాయం ఉంది.
అందమైన స్త్రీ మూర్తులకు, మైఽథున భంగిమలు, విన్యాసాలకు ప్రసిద్ది పొందిన మధ్యప్రదేశ్‌లోని ఖజురహో శిల్పాల ప్రభావం, లేదంటే కాకతీయ వాస్తు శిల్పానికి సమకాలీనంగా హొయసల శిల్పరీతి కొనసాగినందున, హంపిలోని శిల్పాల ప్రభావం ఉండవచ్చనే వాదనలు కూడా వున్నాయి. ఈ వాదనలు ఎలా వున్నా… సౌందర్యానికి, ఆరాధనకు ప్రాంతీయ భేదాలేవీ అడ్డంకి కాదు కాబట్టి, రామప్పలోని అందగత్తెలు యూనివర్సల్ యాక్సెప్టెన్సీ పొందుతూనే వున్నారు.
ప్రపంచ సుందరి కిరీటం కోసం పోటీపడుతున్న సుందరీమణులు… మే 14న రామప్ప ఆలయ ఆవరణలో అడుగుపెడుతున్నారు. రామప్ప ఆలయ సముదాయం యునెస్కో గుర్తింపు పొందింది కాబట్టి, విజిటింగ్ ప్లేసెస్‌లో చోటు దక్కించుకుంది కాబోలు.
కానీ యునెస్కో గుర్తింపునకు శతాబ్దాల ముందే సౌందర్యరాశుల కేరాఫ్‌గా తనదైన అస్తిత్వాన్ని సొంతం చేసుకుంది. ఏ మత ధర్మంలోనైనా జీవితమంటే సకల కళల సమాహారం. రామప్ప ఆలయంలో రెండు పార్శ్వాలుగా వున్న ఆధ్యాత్మికత, సౌందర్యశీలత అందుకు సాక్ష్యం.
ఇప్పుడు ప్రపంచాన్ని నడిపిస్తున్నదీ, ఆటాడిస్తున్నదీ… సౌందర్యమో, సౌందర్య ఆరాధనమో కదా. అందుకే ప్రపంచమంతా మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల అడుగుల వైపు చూపు సారించింది. రామప్పలో కదలని అందాల రాశులు ఒకవైపు, కదిలే జవరాండ్లు మరోవైపు కన్నుల పండువ చేయడం ఖాయం.
అన్నట్టు… రామప్పకు వచ్చే అందగత్తెలు నాగిని, మదనిక శిల్పాల్లో తమను తాము పోల్చుకుంటారో, తమను తాము చూసుకుంటారో చూడాలి. అప్పుడైనా రామప్పలోని అందగత్తెలు ఏ దేశం వారో తేలుతుంది…
Share this Article