.
ఔరా, ఇది నాని సినిమాయా..? సహజ నటుడు ఇంత అసహజమైన పాత్రలోనా..? అదీ ఇంత మితిమీరిన హింస… తెర నిండా నెత్తుటి ధార… అసభ్య పదాల డైలాగులు… ఎడాపెడా ఎలివేషన్లు… బీభత్సమైన లుక్కు…
కాస్త ప్యామిలీతో వెళ్లి చూడదగిన సినిమాలు కదా నాని ప్రయారిటీ, మరి ఇదేమిటిలా ఉంది, ఎందుకిలా అయ్యాడు అని పదే పదే అనిపిస్తుంది సినిమా ప్రీమియర్లు చూస్తుంటే…
Ads
వారం రోజులు ఆగాక థియేటర్లకు జనం రాకపోతే అప్పుడు సినిమా ఫెయిల్ అని రాయాలి అని హితోక్తులు చెబుతున్నప్పుడే డౌటొచ్చింది… ఎస్, కొన్నాళ్లుగా చెబుతూనే ఉన్నాడు తను… పిల్లలు, కుటుంబ సమేతంగా చూసే సినిమా కాదు, ఇది వేరే జానర్ అని…
అది సమర్థన అవుతుందా..? థియేటర్ మొత్తం నెత్తుటి కమురు వాసన కమ్మేస్తే అది టార్గెటెడ్ ఆడియెన్స్ సినిమా అవుతుందా..? బోల్డ్, ఇంటిమేట్ సీన్లలో నటించే తారలు కథ డిమాండ్ చేసింది కాబట్టి చేశాం అంటుంటారు… నాని మాటలూ అలాగే ఉన్నాయి…
స్టయిలిష్ హింస అట, కథ డిమాండ్ చేసింది కాబట్టి ఆ హింస అట… హింసలో స్టయిల్ ఏమిటో… పైగా మరి అలాంటి కథ ఎందుకు ఎంచుకున్నట్టు..? మెడ మీద కత్తిపెట్టి ఈ సినిమా చేయాల్సిందే అన్నారా ఎవరైనా..? ఇదేం శుష్క వాదన..? ఏదో చెప్పేద్దాం, ప్రేక్షకులే కదా నమ్మేస్తారు అన్నట్టుగా ఉంది ఈ వాదన…
సింపుల్,.. ఇప్పుడు ట్రెండ్ హింసే అని నాని నమ్మకం, అందుకని ఈ సినిమాలో ఇంత హింస… హింసతో, అసభ్య పదాలతో ఎలివేషన్ కోరుకున్నాడు నాని… ఎక్కడో ఏమూలో నాని మీద ఉన్న సదభిప్రాయం మాయం అవుతుంది…
ఇంతా చేసి, చివరలో ఓ ఇద్దరు హీరోలు అనుకోకుండా ప్రత్యక్షమవుతారు… సినిమా అంత బాగా తీస్తే ఈ అవసరం ఎందుకొచ్చింది..? నేలటికెట్టు ప్రేక్షకులతో కేకలు వేయించగల ఎత్తుగడలు తప్ప క్లాస్, ఈతరం ప్రేక్షకులు పెద్దగా ఇష్టపడని ఆకర్షణలు అవి…
అంతా హీరోయే… సగటు తెలుగు సినిమా హీరో సుప్రీం హీరోయిజాన్ని మరో నాలుగైదు మెట్లు హింసతో ఎక్కించే ఎలివేషన్లే… హీరోయిన్ పాత్రకు పెద్ద ప్రాధాన్యం లేదు, మరే పాత్ర గుర్తుండదు… చివరకు విలన్ కూడా బలంగా ఉండడు… అంతా నాని… తోడుగా రక్తం…
పోనీ, సంగీతం అందామా..? పాటలు డల్… బీజీఎం అక్కడక్కడా వోకే… నిడివి ఎక్కువ సినిమా… ఓ పావుగంట నిర్దాక్షిణ్యంగా నరికేయవచ్చు… ఫస్టాఫ్ అంతా సోసో… కాకపోతే అక్కడక్కడా కొన్ని హై సీన్లు కలిసొచ్చి కాస్త నిలబెడుతుంది… సినిమాకు స్క్విడ్ గేమ్ ప్రేరణ…
నాని దారి తప్పాడు అనే అనిపిస్తుంది సినిమా చూస్తుంటే… లేదు, నేను సరైన మార్గంలోనే వెళ్తున్నాను, మాస్ సినిమా అంటే హింస, యాక్షన్ సీన్లు మాత్రమే అని నాని అనుకుంటే ఎవరూ ఏం చేయలేరు… హిట్ ఫస్ట్ రెండు పార్టుల్లాగే ఇదీ ఓ క్రైమ్ దర్యాప్తు… కాకపోతే క్రూరమైన పద్ధతులు…
ఒక దశలో ఈ దర్యాప్తుకు పాటలు, రొమాంటిక్ ట్రాకులు అడ్డంగా వస్తుంటాయి… మరి సినిమా అన్నాక ఓ హీరోయిన్, ఓ ట్రాక్ ఉండాలి కదా… ఇది పాన్ ఇండియా మూవీ… కోట్లకుకోట్ల మస్తు వసూళ్లు సాధించినా సరే ఇది సరైన పంథాలో ఉన్న సినిమా మాత్రం కాదు… ఎలాగూ పిల్లలు, ఫ్యామిలీతో థియేటర్‌కు రాకండి అని నానియే స్వయంగా చెబుతున్నాడు కదా… ఇక మీ ఇష్టం…
(ఇది ఓవర్‌సీస్ ప్రీమియర్ షోల ఫీడ్ బ్యాక్ ఆధారంగా రాయబడిన సమీక్ష… కాదు, ఒక అభిప్రాయం మాత్రమే)
Share this Article