.
రాజకీయ తంత్రంలో భాగంగా ఓ కన్యకు కొద్దికొద్దిగా విషాన్ని తాగిస్తూ సంపూర్ణ విషకన్యగా తయారుచేస్తాడు ఓ రాక్షస మంత్రి… అంటే ఆమెతో సంభోగమే కాదు, ముద్దిచ్చినా సరే మరణమే… తరువాత ఆమెను ఎవరి మీదో ప్రయోగిస్తాడు…
పున్నమినాగు సినిమాలో కూడా దాదాపు అంతే కదా… తనే పాముగా మారిన చిరంజీవి ఎవరితో కలిసినా మరణమే… అంటే, ఎంతటి విషాన్నయినా కొద్దికొద్దిగా మన దేహానికి అలవాటు చేస్తూ, మన రక్తం దాన్ని ఆమోదించాక ఇక ఎంత మోతాదు విషమైనా సరే ఇక పనిచేయని స్థితి…
Ads
కొన్ని సినిమాల్లో చూశాం కదా… పాములతో కరిపించుకుంటూ ఎంజాయ్ చేస్తుంటాడు విలనుడు… ఏమీ కాదు, ఇదే సూత్రం… ఐతే ఇలా సంపూర్ణ సర్పాలుగా మారిన వారితో ప్రమాదమే తప్ప ప్రయోజనం ఏముందీ అంటారా…? ఉంది… అద్భుతమైన ప్రయోజనం ఉంది ఇప్పుడు…
ప్రపంచంలో ఏటా 1.4 లక్షల మంది పాము కాట్లకు బలవుతున్నారు… దానికి మూడింతలు వికలాంగులు అవుతున్నారు… మరీ మన దేశంలో పాము కాట్ల బాధితులు మరీ ఎక్కువ… ఇప్పటిదాకా గుర్రాలకు విషం ఎక్కించి, దాని శరీరంలో యాంటీ బాడీస్ తయారయ్యాక వాటి నుంచి యాంటీ వీనం ఇంజక్షన్లు తయారు చేస్తున్నారు…
ఐతే పాము రకాన్ని బట్టి విరుగుడు… పైగా గుర్రం రక్తం కదా అందరికీ పడదు… సైడ్ ఎఫెక్ట్స్… సో, అమెరికాలోని ఓ వేక్సిన్ కంపెనీ పెద్దాయన జాకబ్ గ్లెన్ విల్లేకు ఓ కల… ఏమాత్రం ప్రమాదకరం కాని, అందరికీ పనిచేసే, అన్నిరకాల పాము విషాలకూ పనిచేసే ఓ యాంటీ వీనమ్ రూపొందించాలని…
ఎవరో తిమోతీ అనే వ్యక్తి 200 సార్లు పాములతో కరిపించుకున్నాడని తెలిసింది… తనను అప్రోచయ్యాడు… ఇక ప్రయోగాలు మొదలు… రకరకాల పాములతో కరిపించారు… కొద్దికొద్దిగా విషాన్ని ఎక్కించారు… అనేక డోసులు… తన నుంచి యాంటీ వీనమ్ తయారు చేశారు… సక్సెసేనా..?
ఎలుకల మీద ప్రయోగాలు… మహా ప్రమాదకరమైన పాముల విషానికి కూడా విరుగుడుగా పనిచేసింది… కొన్ని కేసుల్లో పాక్షికం… దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తారు… ఇక ఏ రకం పాము కాటు వేసినా, అదెంత ప్రమాదకరమైన విషమైనా సరే, ఈ యాంటీ వీనం ఎక్కిస్తే సరి, ప్రాణాలకు ఢోకా లేకుండా సంపూర్ణ రక్షణ కల్పించడం…
ఎస్, రేపోమాపో సక్సెస్ గ్యారంటీ… సో, విషనాగులుగా తయారైన వ్యక్తులే నాగుల నుంచి రక్షణగా మారుతారన్నమాట… అవునూ… ప్రపంచానికి సరిపడా విరుగుడు మందు తయారు చేయాలంటే ఎందర్ని ‘విషనాగులు’గా మార్చాల్సి వస్తుందో..!!
ఈ మొత్తం ప్రయోగాలు సక్సెసయ్యాక… పాము ఎదురుపడితే… ఫోవే వానపామా అని వెక్కిరించండి పర్లేదు…!! ఐనా స్వార్థం, కుట్రలు, మోసాలు, దౌర్జన్యాలు, ఉగ్రవాదంతో మనుషులు సర్పాలను మించిన విషజీవులుగా మారుతుంటే… ఆ విషాలకు విరుగుడే కష్టమైపోతోంది..!!
Share this Article