Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!

May 8, 2025 by M S R

.

(శంకర్‌రావు శెంకేసి/79898 76088) ….. ‘రణరంగం కాని చోటు.. భూ స్థలమంతా వెదికిన దొరకదు..’ అని మహాప్రస్థానంలో శ్రీశ్రీ అన్నాడు. ఒకప్పుడు రాజ్య విస్తరణ కాంక్ష, అణ్వస్త్ర, ఆయుధ వ్యాపారం, వనరులపై ఆధిపత్యం.. యుద్ధాలకు కారణాలుగా నిలువగా, ఇప్పుడు మతోన్మాదం ప్రధాన హేతువుగా నిలుస్తోంది.

ముఖ్యంగా ఇస్లామిక్‌ ఉగ్రవాదం ప్రపంచాన్ని యుద్ధం అంచులపై నిలబెడుతోంది. యుద్ధాల వల్ల సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోవడమే కాదు, దేశ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. అనేక రంగాలు కోలుకోనిలేని విధంగా దెబ్బతింటాయి. ఆహార, ఆర్థిక సంక్షోభాలతో జన జీవితాలు అస్తవ్యస్తం అవుతాయి.

Ads

ప్రధానంగా పేదల బతుకులు ఛిద్రమైపోతాయి. ఎన్ని చేదు అనుభవాలను చవిచూసినా యుద్ధాలు, అంతర్యుద్ధాలకు అంతం ఉండటం లేదు. నిత్యం ఏదో ఒక చోట మిస్సైళ్ల వర్షం కురుస్తూనే ఉంది. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో 26 మంది అమాయక టూరిస్టులను పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్న నేపథ్యంలో.. భారతదేశం ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో సైనికదాడులకు శ్రీకారం చుట్టింది.

ఉగ్రవాద శిబిరాలపై భారత సైనిక దళాల చర్యకు ప్రపంచంలోని మెజారిటీ దేశాల నుంచి సానుకూలత వ్యక్తమవుతోంది. ఇది యుద్ధానికి దారితీసే పరిస్థితులు ఉండటంతో చరిత్ర పునరావృతమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

వాస్తవానికి ఏ దేశమూ మరో దేశంతో యుద్ధం కావాలని చేయదు. ఎందుకంటే యుద్ధం అనేది అత్యంత ఖరీదైనది. రణ పర్యవసానాలుగా అనేక సంక్షోభాలు చుట్టుముడతాయి. ఆ దేశ ఆర్థిక ప్రగతి అనేక సంవత్సరాలు వెనక్కి వెళ్తుంది.

దేశాల మధ్య యుద్ధాల్లో ఎక్కువగా సరిహద్దుల్లోని భూ భాగాల కోసమే జరుగుతుంటాయి. పాకిస్థాన్‌, చైనా దేశాలతో భారతకు సుదీర్ఘకాలం కొనసాగుతున్న వైరాలకు కారణం ఈ భూ భాగాలే. అయితే అంతర్యుద్ధాల కథ వేరు. వాటికీ అంత సులభంగా అంతం ఉండదు.

శతాబ్దాలుగా, దశాబ్దాలుగా ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య జరిగిన యుద్ధాల చరిత్రలు, ప్రాణ, ఆర్థిక నష్టం వివరాలు సంపూర్ణంగా, సాధికారికంగా ఎక్కడా రికార్డు కాలేదు. అలా రికార్డు కావడం సాధ్యం కాదు కూడా. ఎందుకంటే యుద్ధమంటేనే రహస్యాల పుట్ట.

ఒకరి లెక్కలతో ఇంకొకరికి పొంతన ఉండదు. ఒకరి వాదనతో, దృక్కోణంతో ఇంకొకరికి సామీప్యతలు ఉండవు. ఎవరూ తమకు జరిగిన నష్టాన్ని నిజాయితీగా వెల్లడించరు. ఓటమిని అంగీకరించరు. యుద్ధాల్లో విజయగాథలే వెలుగు చూస్తాయి తప్ప, పరాజయ పర్వాలు బయటకు రావు. అవి అట్టడుగున పడి కాలగర్భంలో కలిసిపోతాయి.

ప్రపంచంలో యుద్ధాలు ఎప్పుడు మొదలయ్యాయో, ఎంత నష్టం జరిగిందో ఇప్పటివరకు సరైన లెక్కలు లేవు. అయితే 20వ శతాబ్దం నుంచి- అంటే 1900 నుంచి చోటుచేసుకున్న యుద్ధాల చరిత్ర మాత్రం సాధ్యమైనంత మేర రికార్డయింది. 1900 నుంచి ఇప్పటివరకు జరిగిన వివిధ రకాల యుద్ధాల్లో దాదాపు 18 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయినట్టు వివిధ సంస్థల అంచనా.

అయితే ఇది సాధికారం కాదు. దేశ దేశాల మధ్య జరిగే యుద్ధాలకు సంబంధించి కొంతవరకు లెక్కలు బయటకు రావచ్చునేమో గానీ, ఆయా దేశాల్లో అంతర్గతంగా జరిగే యుద్ధాల్లో చోటుచేసుకునే ప్రాణనష్టం మాత్రం అంత సులభంగా వెలుగు చూడదు. అందువల్ల 18 కోట్ల మంది అనేది ఒక అంచనా మాత్రమే. ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండవచ్చు.

1914-18 మధ్యకాలంలో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో 2కోట్ల 20 లక్షల మంది చనిపోగా, 1939-45 మధ్య జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో 8 కోట్ల 50 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో సైనికులతో పాటు పౌరులూ వున్నారు. 1917-22 రష్యన్‌ సివిల్‌వార్‌లో కోటి మంది, 1927-49 చైనీస్‌ సివిల్‌ వార్‌లో 90లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

1998-2003లో ఆఫ్రికా దేశమైన కాంగోలో జరిగిన అంతర్యుద్ధంలో 54 లక్షల మంది, హతమయ్యారు. 1955-75 వియత్నాం యుద్ధంలో 42 లక్షల మంది, 1967-70 నైజీరియన్‌ అంతర్యుద్ధంలో 41 లక్షల మంది, 1950-53 కొరియా యుద్ధంలో 35 లక్షల మంది, 1979-89 సోవియట్‌ యూనియన్‌- ఆఫ్గాన్‌ ముజాహిదీన్‌ యుద్ధంలో 30 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇక 1971 నాటి బంగ్లాదేశ్‌ విముక్తి యుద్ధంలో 30 లక్షల మంది, 1910-20 మెక్సికన్‌ విప్లవంలో 27 లక్షల మంది, 1961-91 కాలంలో జరిగిన ఇథియోపియా అంతర్యుద్ధం, ఎరిట్రియన్‌ స్వాతంత్య్ర పోరాటంలో 20 లక్షల మంది, 1983-2005 కాలంలో జరిగిన సూడాన్‌ రెండో అంతర్యుద్ధంలో 20 లక్షల మంది, 1946-54 నాటి ఇండో-చైనా మొదటి యుద్ధంలో 8లక్షల 40 వేల మంది, 1980-88 నాటి ఇరాన్‌-ఇరాక్‌ యుద్ధంలో 7 లక్షల మంది, 2011 నుంచి నేటికీ కొనసాగుతున్న సిరియా అంతర్యుద్ధంలో 61 లక్షల మంది, 1978-86 కాలంలో జరిగిన ఉగాండా-టాంజానియా యుద్ధంలో 50 లక్షల మంది, 1990-91లో జరిగిన గల్ఫ్‌ యుద్ధంలో 3 లక్షల మంది, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో 3 లక్షల మంది, 1962 నుంచి ఇప్పటికీ కొనసాగుతున్న పపువా అంతర్యుద్ధంలో 50 లక్షల మంది బలైపోయారు. 1947-48లో హైదరాబాద్‌ సంస్థానంపై జరిగిన భారత యూనియన్‌ సైనిక చర్యలో 2 లక్షల మంది, 1948 నుంచి నేటికీ కొనసాగుతున్న ఇజ్రాయిల్‌- అరబ్‌ దేశాల యుద్ధంలో లక్షా 50 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇంకా బల్కాన్‌, అల్జీరియా, మొజాంబియా, అంగోలియా, బురాండి, టర్కీ, టిగ్రే, స్పానిష్‌, కొలంబియా, దక్షిణ సూడాన్‌, యెమెన్‌, అఫ్గానిస్థాన్‌, బొకోహారమ్‌, లైబేరియా, సియెర్రాలియోన్‌, కంబోడియా, మయన్మార్‌, ఇరాక్‌, చెచెన్యా, గ్వాటెమాలా, పోర్చుగీస్‌, శ్రీలంక, ఫిలిప్సైన్స్‌, లెబనాన్‌, గ్రీక్‌తోపాటు ఇంకా అనేక దేశాల్లో జరిగిన అంతర్యుద్ధాల్లో లక్షలాది మంది సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అనేక లక్షల మంది క్షతగాత్రులుగా మిగిలారు.

దశాబ్దాలుగా కొనసాగుతున్న యుద్ధాలు, అంతర్యుద్ధాల ఫలితంగా ఆయా దేశాలు ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అక్కడి ప్రజల జీవితాలు దుర్భరంగా మారాయి. స్థూల జాతీయోత్పత్తులు, తలసరి ఆదాయాలు దారుణంగా పడిపోయాయి. ఆహారసంక్షోభాలు నిత్యకృత్యంగా మారాయి. మొత్తం ప్రపంచంలో యుద్ధాలు, అంతర్యుద్ధాల బారిన పడుతున్న దేశాల్లో ఆఫ్రికా, ఆసియా ఖండాల్లోని దేశాలే ఎక్కువగా ఉండటం ఇక్కడ గమనించాల్సిన విషయం.

సార్వభౌమత్వ పరిరక్షణ పేరుతో జరిగే యుద్ధాలు సహజంగానే ప్రజల్లో అద్బుతమైన భావోద్వేగాలను రగిలిస్తాయి. జాతీయ పతాకాన్ని చేబూని వీధుల్లో వీరావేశంతో ప్రదర్శనలు చేసేలా ప్రేరేపిస్తాయి. దేశభక్తిపరమైన ఈ భావోద్వేగాలు తక్షణ అంశంగా అలరించినా, కాలం గడిచే కొద్దీ యుద్ధాల ఫలితాలు చేదు అనుభవాలను కలిగిస్తాయి.

ఆయా దేశాలు తమ బడ్జెట్‌లో రక్షణ రంగానికే అధిక కేటాయింపులు జరుపుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా రక్షణ రంగానికి కేటాయించే బడ్జెట్‌లో అమెరికా బడ్జెట్‌ 37 శాతం మేర ఉంది. సైనిక రంగానికి అత్యధికంగా నిధులు కేటాయించే దేశాల్లో అమెరికా మెదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో చైనా, రష్యా, జర్మనీ, భారతలు ఉన్నాయి.

భారతదేశం 2025- 26 బడ్జెట్‌లో 6 లక్షల 80 వేల కోట్లను రక్షణ శాఖకు కేటాయించింది. మొత్తం బడ్జెట్‌లో 8 శాతం రక్షణ రంగానికే వెచ్చిస్తున్నారు. ఇది పాకిస్థాన్‌ కంటే 9 రెట్లు ఎక్కువ. 1947-48, 1965, 1971, 1999లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధాలకు భారత లక్షల కోట్లు వెచ్చించింది.

లక్షల మందిని కోల్పోయింది. వాస్తవానికి యుద్ధ ఆప్రమత్తతో రెండు దేశాలు ఇప్పటివరకు వెచ్చించిన లక్షల కోట్లు.. అభివృద్ధికి వెచ్చిస్తే జీవన ప్రమాణాలు ఎంతో ఉన్నతంగా ఉండేవి. మతమౌఢ్యం తనకే కాదు, ఎదుటి పక్షానికి కూడా ఎంత నష్ట కలుగజేస్తుందో చెప్పడానికి పాకిస్థానే ఉదాహరణ.

ఒక్క భారత- పాకిస్థాన్‌లే కాదు, ప్రంచంలోని ఏ దేశాలు కూడా యుద్ధంలోకి దిగడాన్ని ఎవరూ హర్షించరు. ఎందుకంటే యుద్ధాలు మనుషులు తిరుగాడే నేలల్ని శవాల దిబ్బలుగా మారుస్తాయి. బతికున్న వారిని జీవచ్ఛవాలను చేస్తాయి.

భూ దిగంతాల వరకు రావణ కాష్టపు మంటలను ఎగదోస్తాయి. యుద్ధమంటే విజయమో, పరాజయమో కాదు రక్తసిక్త అధ్యాయం. యుద్ధాలు, అంతర్యుద్ధాలు అప్పుడూ, ఇప్పుడూ చెప్పేది ఒక్కటే… శాంతి కోరుకునే వారిదే అంతిమ విజయం అని…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…
  • పాపం ఉండవల్లి, ఎంత లాజిక్స్ మాట్లాడేవాడు, ఎలా అయిపోయాడు..?
  • కథ ప్రజెంట్ చేసే దమ్ముండాలే గానీ… పనిమనిషి కూడా కథానాయికే…
  • పర్లేదు, వితండవీరులు కూడా చదవొచ్చు ఈ కథను… కథ కాదు, చరిత్రే…
  • ఒక పనిమనిషి మరణిస్తే ఇంత దయా..?! ఇప్పటికీ వెంటాడే ఆశ్చర్యం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions