శీర్షిక చూసి నవ్వొచ్చిందా..? ఎహె, సీతమ్మవారిని రావణాసురుడికన్నా ముందే మరో రాక్షసుడు అపహరించడం ఏమిటి..? ఆ ప్రయత్నం చేయడం ఏమిటి..? అదీ రామలక్ష్మణుల కళ్ల ఎదుటే…!! సాధ్యమేనా..? నమ్మశక్యమేనా..? అని తేలికగా తీసిపడేస్తున్నారా..? ఆగండి… మహాభారతంలో ఉన్నన్ని అసంఖ్యాక లఘుపాత్రలు రామాయణంలో మనకు కనిపించకపోవచ్చు… కానీ కొన్ని పాత్రలు అప్రధానంగా అలా ఉండిపోతయ్… ఎంతసేపూ రాముడు, రావణుడు, సీత, లక్ష్మణుడు, కుంభకర్ణుడు వంటి పాత్రలే ప్రధానంగా తెర మీద కనిపిస్తుంటయ్… అది సరే, సీతను రావణుడికి ముందే ఇంకెవరో కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించడం నిజమేనా..? ఇదే కదా మీ సందేహం… నిజమే… ఆ ప్రయత్నం చేసిన రాక్షసుడి పేరు విరధుడు..! రామాయణంలోని అరణ్యకాండలో కనిపిస్తుంది ఈ పాత్ర…
ఉత్తర దేశంలోనే ఉండకుండా… సీతారాములు, లక్ష్మణుడు దండకారణ్యంలోకి ఎందుకు ప్రవేశిస్తారు అనేది పెద్ద సబ్జెక్టు… కానీ అప్పటి కాలంలో ఉత్తరదేశ రాజులు ఎవరూ దండకారణ్యాన్ని దాటి దక్షిణాది వైపు వచ్చే ప్రయత్నం, సాహసం చేసేవాళ్లు కాదు… దగ్గరలోనే ఉన్నా సరే, వాలి, కార్త్యవీర్యార్జునుడి భయానికి రావణుడు కూడా దక్షిణ భారతం జోలికి వెళ్లేవాడు కాదు… సరే, సీతారాములు దండకారణ్యంలోకి ప్రవేశించి ఓ పర్ణశాల కోసం స్థలాన్ని వెతుకుతుంటారు… ఈలోపు ఓ రాక్షసుడు భీకరాకారంతో అక్కడికి వస్తాడు… రామలక్ష్మణులను ఓ పక్కకు నెట్టేసి, సీతను పట్టుకుని పరుగు తీస్తుంటాడు… రాముడు, లక్ష్మణుడు వెంటనే తేరుకుని తన వెంట పరుగు తీస్తూ బోలెడు బాణాలు సంధిస్తారు… కానీ ఎలాంటి అస్త్రాలు సంధించినా సరే, అవి ఆ రాక్షసుడికి ఏ హానీ చేయకుండా, తన దేహంలోకి బయటికి వెళ్లిపోతుంటయ్… హహహ, ఏ అస్త్రమూ నన్నేమీ చేయదు, బ్రహ్మ వరముంది నాకు అని వికటాట్టహాసం చేస్తాడు రాక్షసుడు…
Ads
లక్ష్మణుడు పరుగు తీస్తూనే కత్తితో రాక్షసుడి భుజాన్ని నరుకుతాడు… రాముడు మరో భుజం నరుకుతాడు… అస్త్రాలు పనిచేయవు కదా, అందుకని సజీవంగా బొంద పెట్టేద్దాం, వాడే చస్తాడు అని కూడబలుక్కుని… పాతిపెట్టడానికి గొయ్యి తవ్వుతుంటారు… అప్పుడు ఆ రాక్షసుడు తన కథ చెబుతాడు… ‘‘రామా, నా తలను కత్తిరించు, నాకు శాపవిముక్తి అవుతుంది… నేను ఓ గంధర్వుడిని, కుబేరుడి శాపవశాత్తూ ఇలా అడవిలో పడి బతుకుతున్నాను, రాముడు వచ్చి చంపితే గానీ నాకు శాపవిముక్తి లేదన్నాడు కుబేరుడు…’’ అంటాడు… కత్తితోనే ఆ రాక్షసుడి ప్రాణాలు తీస్తాడు రాముడు… శాపవిముక్తి పొందిన సదరు గంధర్వుడు రాముడి కాళ్ల మీద పడతాడు… ‘దగ్గరలో షరభంగుడు అనే మహా రుషి ఆశ్రమం ఉంది, అక్కడికి వెళ్లండి, ఆయన మార్గదర్శనం మీకు రాబోయే రోజుల్లో ఉపయుక్తం’ అని సూచించి, మాయమైపోతాడు… ఇదీ ఆ లఘుపాత్ర… ఆ తరువాత కొన్నాళ్లకు శూర్పణఖ రంగప్రవేశం, పరాభవం, రావణుడి ఆగ్రహం, సీత అపహరణ, రామరావణ సంగ్రామం కథంతా వేరు… అది అందరికీ తెలిసిన కథ…!!
Share this Article