ఆపరేషన్ సిందూర్ మొదలయ్యాక లక్షల వార్తలు… అనేక కోణాలు… కొన్ని అబద్దాలు, కొన్ని నిజాలు… తప్పుడు ప్రచారాలు… కొందరు వెధవల బూతులు, ద్వేషం, విషం, నానా పెంట…
ఇన్ని వార్తల నడుమ ఓ పోస్టు ఆసక్తికరంగా అనిపించింది,,. ముచ్చట పాఠకులతో షేర్ చేసుకోవాలనీ అనిపించింది… అది Kiran Kumar Goverdhanam పోస్టు… స్వీయానుభవం…
తాజా ఇండో పాక్ ఘర్షణల్లో భారత సైన్యం ఉపయోగించిన పలు ఆయుధాలు హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు రూపొందించినవే అని వార్తలు వచ్చాయి. సైన్యం అవసరాల మేరకు డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు మిస్సైల్ సిస్టమ్స్, గైడెడ్ వెపన్స్, అడ్వాన్స్‌డ్ ఏవియానిక్స్ డిజైన్ చేస్తారు.
Ads
ఒకసారి మిస్సైల్ డిజైనింగ్ పూర్తయిన తరువాత సైన్యం సహాయంతో టెస్టింగ్ చేస్తారు. అప్పుడు వారి అవసరాలు, సలహాలు, సూచనల మేరకు వాటిని అప్‌డేట్ చేస్తుంటారు. అక్కడ ఒకే అనుకున్న తరువాత ప్రొడక్షన్ కోసం బీడీఎల్ లాంటి సంస్థలకు వెళ్లి, చివరికి సైన్యం అమ్ముల పొదిలోకి చేరతాయి.
పైకి చూడటానికి ఇది చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది కానీ ఒక్కో స్టేజీ దాటడానికి సంవత్సరాలు పడుతుంది. విపరీతమైన స్క్రూటినీ చేస్తారు. డిజైనింగ్, టెస్టింగ్, అప్‌డేట్ సంవత్సరాల కొద్ది సాగే ప్రక్రియ. మా మామయ్య (మా ఆవిడ వాళ్ల నాన్న) డీఆర్‌డీఎల్‌లో శాస్త్రవేత్తగా పనిచేసి రిటైరయ్యారు. తను త్రిశూల్, ఆకాష్, Prithvi ప్రాజెక్టుల కోసం పనిచేశారు.
అబ్దుల్ కలామ్ డీఆర్ డీఎల్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు 1988లో *రీసెర్చ్ సెంటర్ ఇమారత్* (ఆర్‌సీఐ)ని ఏర్పాటు చేశారు. డీఆర్‌డీఓ వారి ప్రీమియర్ రీసెర్చ్ సెంటర్ ఇది. ఒక రకంగా అబ్దుల్ కలామ్ మానస పుత్రిక. ఇందులోని శాస్త్రవేత్తలను కలాం స్వయంగా ఎంపిక చేసుకున్నారు.
అలా మా మామయ్య కూడా ఆర్‌సీఐకి వెళ్లి అక్కడే సైంటిస్ట్‌గా రిటైర్ అయ్యారు. తను ప్రధానంగా త్రిశూల్, ఆకాష్, Prithvi ప్రాజెక్టుల్లో పనిచేశారు. ఆయన రిటైర్మెంట్ చివరి సంవత్సరంలో మా పెళ్లి జరిగింది. రిటైరయిన రెండు నెలల్లోపే ఆయన హార్ట్ ఎటాక్‌తో చనిపోయారు.
ఇది జరిగి దాదాపు 20 సంవత్సరాలు కావస్తుంది. నాకు ఆయనతో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యే అవకాశం రాలేదు. కానీ కలిసిన కొద్ది సమయంలోనే వీరు ఎలా పనిచేస్తారో తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడిని. కామన్ మాన్‌కు ఉండే కుతూహలం అది.
ప్రాజెక్టులో భాగంగా అప్పట్లో వీరు రష్యాకు వెళ్లినట్లు చెప్పాడు. ఏ ప్రాజెక్ట్ టెస్టింగో సరిగ్గా గుర్తు లేదు. కానీ మా పెళ్లి అయినాక తరచుగానే భువనేశ్వర్‌కు వెళ్లేవారు. అక్కడ వీలర్ ఐలాండ్‌లో మిస్సైల్ టెస్టింగ్‌లు జరిగేవి. అక్కడ వీరు భూమి నుంచి భూమికి, భూమి నుంచి ఆకాశంలోకి మిస్సైల్స్ ప్రయోగాలు చేసే వారు.
కటక్ నుంచి హెలీకాఫ్టర్‌లో వీలర్ ఐలాండ్‌కు వెళ్లాలి. ఒడిషా తరచుగా తుఫాన్‌లకు గురయ్యే ప్రాంతం. తుఫానులు, వాతావరణం అనుకూలించక ప్రయోగాలు వాయిదా పడుతుండేవి. ఒకసారి అంతా రెడీ అయ్యాక వీరు హెలీకాఫ్టర్ ఎక్కే సమయానికి తుఫాను బీభత్సంగా మొదలైందట.
మిలిటరీ పైలెట్ కదా. ఏమీ కాదు నేను జాగ్రత్తగా తీసుకుని వెళతా అన్నాడట. అయినా చాలా మంది డ్రాప్ అయిపోతే తను, కొంత మంది సైంటిస్టులు మాత్రం మొండిగా వెళ్లి పని పూర్తి చేసుకుని వచ్చారట.
టెక్నికల్ కారణాలు ఏమిటో తెలియదు కానీ, ఒకసారి ప్రయోగం క్యాన్సిల్ అయితే మళ్లీ షెడ్యూల్ కావడానికి నెలలు పడుతుందట. మొత్తం ప్రాజెక్ట్ డిలే అవుతుంది. అందుకని మొండిగా వెళ్లి టెస్టింగ్ చేసుకుని వచ్చినట్లు చెప్పాడు.
రిటైర్ అయిన సైనికులు ఇంట్లో మెడల్స్ అలంకరించుకున్నట్లు, మా మామయ్య వాళ్ల ఇంటి షెల్ఫ్‌లో మిస్సైల్ మోడల్స్ ఉంటాయి. రిటైరయ్యే చివరి రోజు వాళ్లు పనిచేసిన ప్రాజెక్టులకు సంబంధించిన మినియేచర్ డమ్మీ మిస్సైల్స్ బహుకరిస్తారు. వీరికి అవి మెడల్స్‌తో సమానం.
ఒక్క డీఆర్‌డీఓ అని ఏమిటి, ఏ రక్షణ ప్రాజెక్టుల మీద పనిచేసినా, రిటైరయిన శాస్త్రవేత్తలు ఇప్పుడు దేశంలోని వివిధ మూలల్లో ఉండి ఉంటారు. తాము డిజైన్ చేసిన ఆయుధాలతో సైన్యం యుద్ధ లక్ష్యాలను ఛేదిస్తూ ఉంటే పొంగిపోతూ ఉండి ఉంటారు..
యుద్ధ రంగంలో శత్రువులతో సైన్యం నేరుగా యుద్ధం చేస్తుంటే, బ్యాక్ ఎండ్‌లో ఎన్ని లక్షల మంది వారి కోసం పనిచేస్తుంటారో అనిపించింది. ఆయుధ ఉత్పత్తులను ఫాస్ట్‌ట్రాక్ చేసి త్వరగా పూర్తి చేయమని హైదరాబాద్‌లోని రక్షణ సంస్థలను భారత ప్రభుత్వం ఈ రోజు కోరిందని వార్తలు చదవగానే ఈ విషయం గుర్తుకు వచ్చింది.
ఆపరేషన్ సింధూర్‌లో *ఆకాష్* క్షిపణి బాగా ఉపయోగపడింది. మా మామయ్య ఉంటే మనవలు, మనవరాండ్లను కూర్చోబెట్టుకుని తమ టీమ్ డిజైన్ చేసిన క్షిపణులు, అప్పటి సంగతులకు సంబంధించిన ఆఫ్ ద రికార్డు ముచ్చట్లు ఎన్ని చెప్పేవాడో అనిపించింది.
నేను పనిచేసిన ప్రాజెక్ట్ అప్‌గ్రేడ్ అవుతుంది, రిటైర్ అయిన ఉద్యోగులను కూడా మళ్లీ పార్ట్‌టైమ్ గా తీసుకుంటారు అని అప్పట్లో చెప్పేవాడు. వాళ్లు మళ్లీ తీసుకునేవారో లేదో తెలీదు కానీ, మరణం మాత్రం ఆయనను రిటైర్మెంట్ అనంతర జీవితం అనుభవించనీయకుండా త్వరగా తీసుకెళ్లింది.
రిటైర్ అయి మరణించిన ఉద్యోగులకు లాంఛనాలు ఉండవు. కానీ ఎందుకో తెలీదు అప్పట్లో డీఆర్‌డీఓ అధికారులు ఇంటికి వచ్చి, వెహికిల్, బ్యాండ్ లాంటివి అరేంజ్ చేస్తాం అని చెప్పారు. అంతిమ యాత్ర కోసం ఒక్క ఆర్మీ వెహికిల్ మాత్రం తీసుకుని మిగిలినవి వద్దు అని చెప్పాం. వారు వెహికిల్‌ను అలంకరించి తీసుకుని వచ్చి ఆయను గౌరవంగా సాగనంపారు…
Share this Article