Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…

May 14, 2025 by M S R

.

‘ముచ్చట’లోనే కొంతకాలం క్రితం రాసినట్టు గుర్తు… పదే పదే చదువుకోవాల్సిన స్పూర్తిమంతుడి కథ ఇది… అలాంటోళ్లు కోటికొకరు పుడతారు… నిజానికి పిల్లలకు పాఠ్యపుస్తకాల్లో చదివించాల్సిన కథలు ఇవే… కానీ మన విద్యావ్యవస్థ దరిద్రం తెలుసు కదా…

చెత్త చెత్త నియంతల చరిత్రలు చదివిస్తాం… పనికిరాని చెత్తను పిల్లల మెదళ్లలో నింపుతాం… సరే, ఫేస్‌బుక్‌లో మిత్రుడు Gopireddy Jagadeeswara Reddy వాల్ మీద కనిపించింది ఈ కథ మళ్లీ… ఓసారి నెమరేసుకుందాం…

Ads



చింపిరి జుట్టూ, గుబురుగా పెరిగిన గడ్డం, ఎండిపోయిన డొక్కలూ, ఒంటిని అంటిపెట్టుకున్న ఓ లుంగీ… చూడగానే ఎలాంటి ఆదరణా లేని అభాగ్యుడిలా, కనిపిస్తారు అలోక్‌ సాగర్‌.

కానీ ఐఐటీలో చదివి, అమెరికాలో పీహెచ్‌డీ చేసి, ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌కు ప్రొఫెసర్‌గా పాఠాలు చెప్పింది అతడే అంటే నమ్మగలరా..!

కొన్నాళ్ల క్రితం మధ్యప్రదేశ్‌లో గోడొంగరీ అనే అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరిగినప్పుడు గిరిజనులపైన సర్వే చేయడానికి అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లారు.

ఒక్కో వూళ్లొ గిరిపుత్రుల గురించి ఆరా తీస్తుంటే వాళ్లకు సైకిల్‌ మీద చొక్కా లేకుండా తిరుగుతున్న ఓ పెద్ద మనిషి కనిపించాడు. అతడి మొహం చూస్తే గిరిజనుడు కాదని వాళ్లకు అర్థమైంది.

వాళ్లకు సంబంధం లేని వ్యక్తి అక్కడేం చేస్తున్నాడనే అనుమానం కలిగింది. తానూ వాళ్లలో ఒక్కడినేనని ఆ పెద్దాయన పదేపదే చెప్పినా అధికారులకు నమ్మకం కలగలేదు.

ఆయనకు సంబంధించిన రేషన్‌ కార్డు, ఓటర్‌ కార్డు లాంటి ధ్రువ పత్రాలేవైనా ఉంటే చూపించమని నిలదీశాక కానీ అసలు విషయం బయట పడలేదు.

ఆ గిరిపుత్రుల్లో ఒకడిగా కలిసిపోయి జీవిస్తోన్న ఆ పెద్దాయన పేరు అలోక్‌ సాగర్‌. అతడి తండ్రి ఐఆర్‌ఎస్‌ అధికారి. తల్లి ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌. దిల్లీ ఐఐటీ నుంచి ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, పీజీ పూర్తి చేసిన మేధావి.
ఆపైన టెక్సాస్‌లోని హూస్టన్‌ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా కూడా అందుకున్నారు. భారత్‌కు తిరిగొచ్చి దిల్లీ ఐఐటీలో పదేళ్లపాటు ప్రొఫెసర్‌గా పనిచేశారు.

అలా అలోక్‌ దగ్గర పాఠాలు నేర్చుకున్న ఎంతో మంది ప్రముఖుల్లో మాజీ ఆర్బీఐ గవర్నర్‌ రఘురాం రాజన్‌ కూడా ఉన్నారు. ఆయన నేపథ్యాన్ని ధ్రువీకరించుకున్నాక అక్కడి అధికారులకు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు.
.
ఐఐటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సమయంలో ఓసారి ఏదో పరిశోధన పనిమీద మధ్యప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతానికి వెళ్లారు అలోక్‌. అక్కడ ప్రపంచంతో సంబంధం లేకుండా, కనీస సదుపాయాలకు కూడా దూరంగా జీవిస్తోన్న గిరిజనుల దీనస్థితి ఆయన్ని కలవరపెట్టింది.

వాళ్ల కోసం ఏదైనా చేయాలని అనిపించినా, బయటి వ్యక్తులను అంత త్వరగా గిరిజనులు నమ్మలేరు. అందుకే అలోక్‌ ఎంత అడిగినా వాళ్లకేం కావాలో, అక్కడి సమస్యలేంటో చెప్పలేదు.

గిరిజనుల్లో ఒకడిగా మారితేనే వాళ్లు తనని ఆహ్వానిస్తారని అలోక్‌కి అనిపించింది. ఐఐటీలో పాఠాలు తాను కాకపోతే మరొకరు చెబుతారనీ, కానీ వాళ్ల జీవితాలని మార్చడానికి తాను పూనుకోకపోతే ఇంకొకరు వస్తారన్న గ్యారంటీ లేదనీ అనిపించింది.

దాంతో మరో ఆలోచన లేకుండా దిల్లీ వెళ్లి ఉద్యోగానికి రాజీనామా చేసి 32 ఏళ్ల క్రితం కట్టుబట్టలతో కొచాము అనే గిరిజన గ్రామానికి చేరుకున్నారు. అప్పట్నుంచీ వాళ్లు తినేదే తింటూ, వాళ్లతోనే ఉంటూ పిల్లలకు చదువు చెబుతూ, వూళ్లో చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తూ ఆ అమాయకులకు పెద్ద దిక్కుగా అక్కడే ఉండిపోయారు అలోక్‌.

బయటి వాళ్లెవరైనా గ్రామానికి వచ్చినా తన నేపథ్యం బయటపెట్టేవాడు కాదు. ఇప్పుడుకూడా, ఎన్నికల అధికారులు తనను ఆ ప్రాంతం వదిలి వెళ్లిపోమని ఆదేశించడంతో, తప్పనిసరై వాటిని బయట పెట్టాల్సి వచ్చిందంటారు అలోక్‌.

.
గిరిజనుల్లో ఒకడిలా ఉండాలంటే వేషభాషలూ వాళ్లకు తగ్గట్లే ఉండాలి. పాతికేళ్లుగా అలానే జీవిస్తున్నారు అలోక్‌. ఒక సైకిలు, మూడు జతల దుస్తులూ… ఇవే ఆ గూడెంలో ఆయనకున్న ఆస్తి.

ఆ సైకిల్‌ మీదే సుదూర ప్రాంతాలకు వెళ్లి రకరకాల విత్తనాలను సేకరించి నామమాత్రపు ధరకు వాటిని గిరిజనులకు విక్రయించడమే జీవనోపాధిగా మార్చుకున్నారు. అక్కడి వాళ్లు మాట్లాడే రెండు మూడు యాసల్లో ప్రావీణ్యం సంపాదించి, అలానే సంభాషించడం అలవాటు చేసుకున్నారు.

ప్రభుత్వ పథకాల ద్వారా గిరిజనులకు అందే అన్ని రకాల సౌకర్యాలూ పూర్తిగా అందేలా చూస్తూ, వాళ్ల జీవన ప్రమాణాలను పెంచుతూ అండగా నిలబడ్డారు.
.
గిరిజనులతో పాటు ప్రకృతిపైనా అలోక్‌కు మమకారం ఎక్కువే. ఆ ప్రేమతోనే ఇన్నేళ్లలో తానుంటోన్న బీటుల్‌ జిల్లాలో యాభై వేలకు పైగా మొక్కలు నాటారు.

ఆయన గిరిజన గ్రామాల్లో అడుగుపెట్టాక బడికెళ్లకుండా పనిబాట పట్టే చిన్నారుల సంఖ్య బాగా తగ్గిపోయింది. వ్యవసాయం చేసుకునే గిరిజనులకు నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవడంలో సహాయ పడుతున్నారు. ఖాళీ సమయంలో పెద్దలకు చదువుతోపాటు పరిశుభ్రత పాఠాలూ బోధిస్తున్నారు.

పౌష్టికాహార లోపాన్ని గిరిజన గ్రామాల నుంచి దూరం చేయడానికి శ్రమిస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వానికీ గిరిపుత్రులకూ మధ్య పాతికేళ్లుగా వారధిలా పనిచేస్తున్నారు అలోక్‌.

అతడి సోదరుడు ఇప్పటికీ దిల్లీ ఐఐటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తుండటం విశేషం. ఎన్నికల సమయంలో అలోక్‌ గిరిజనుల మనసు మార్చి తమకు వ్యతిరేకంగా ఓటేయిస్తారని స్థానిక నాయకులు భయపడ్డారు. అందుకే అతడిని పోలీసుల సాయంతో అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. కానీ వాళ్లకా హక్కులేదని అతడికి తెలుసు.

ఎక్కువగా ఒత్తిడి పెడితే గిరిజనులూ వూరుకోరనిపించి పోలీసులూ వెనక్కితగ్గారు. ‘ప్రజలకు మంచి చేయడానికి పెద్ద పెద్ద డిగ్రీలతో పనిలేదు. అందుకే వాటితో నాకు అవసరం లేదు. ఎప్పటికీ నా గురించి బయట పెట్టకూడదనుకున్నా, కానీ కుదరలేదు’ అంటారు అలోక్‌.

‘మేము గాంధీని చూడలేదు, మాకు తెలిసిన గాంధీ అలోక్‌ సారే’ అంటాడు అనురాగ్‌ అనే ఓ స్థానిక సామాజికవేత్త. పోలిక సరైనదే అనిపిస్తోంది కదూ..!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…
  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions