.
అనేక కథనాలు కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి… అందులో ఒకటి కవిత, హరీష్ మద్దతుతో వేరే ప్రాంతీయ పార్టీ పెడుతుందని, సోదరుడితో పొసగడం లేదని, తన రాజకీయ కెరీర్‌ను తనే సీరియస్‌గా వెతుక్కోబోతుందని…! రెండోది ఆమెను షర్మిలతో పోల్చడం…! కొన్ని పాయింట్లు…
1. కవితకు పొలిటికల్ యాంబిషన్స్ చాలా ఉన్నాయి… అందులో తప్పు లేదు, ఆమె అనర్హురాలు కూడా కాదు… కానీ ఆమెకు ఎప్పటికప్పుడు కేసీయార్ పగ్గాలు వేస్తున్నాడు… కారణం, తన రాజకీయ వారసుడు కేటీయార్ మాత్రమేనని ఫిక్సయిపోవడం…
Ads
2. మన సమాజం పితృస్వామికం… అంతా మగవారసత్వమే కదా… ఉదాహరణకు కనిమొళి వారసురాలు కాలేదు, స్టాలిన్ అయ్యాడు… సోదరుడి కొడుకు అజిత్ పవార్ అయ్యాడు… కానీ సొంత కూతురు సుప్రియా సూలే కాలేదు… (సరే, ఆ అజితుడే ఎదురు తిరిగి పార్టీనే తన్నుకుపోయాడు, అది వేరే సంగతి)… బీఆర్ఎస్ కుటుంబ పార్టీ… సో, కేటీయార్ తరువాతైనా, కోరుకుంటే హిమాంశు వారసత్వమే తప్ప వేరే ఊహించొద్దు…
3. కానీ కవితకు ఆశలుండొద్దా..? ఉంటే తప్పులేదు… కవితను ఎప్పటికప్పుడు కేసీయార్ వెనక్కి లాగడం నిజం… ఆమే కాదు, హరీష్‌రావునూ ఈమధ్య పక్కన పెట్టేస్తున్నాడు… గతంలో ఒకటీరెండుసార్లు పూర్తిగా ఇగ్నోర్ చేసి, నువ్వు కాదు, కేటీయారే నా వారసుడు అని స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడు… ఇప్పుడూ అంతే… మొన్నటి వరంగల్ సభ కూడా చెప్పింది అదే…
4. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది… జనంలో, కేడర్‌లో లీడర్ పట్ల యాక్సెప్టెన్సీ… చాన్నాళ్ల ముందే కేటీయార్‌కు పట్టం గట్టేయాలని కేసీయార్ అనుకున్నా, కేటీయార్‌కు అంతగా యాక్సెప్టెన్సీ లేదని తెలుసుకుని, తనే కుర్చీపై కొనసాగాడు, కొనసాగుతున్నాడు… కానీ పార్టీలో, మొన్నటిదాకా ప్రభుత్వంలో కేటీయారే అనధికారిక అధ్యక్షుడు, ముఖ్యమంత్రి…
5. కవిత మద్యం కేసును, అవినీతిని కొందరు ప్రస్తావిస్తున్నారు… నిజానికి రాజకీయ నాయకులకు అవినీతి ఎప్పుడు అనర్హత అయ్యింది మన దేశంలో..? ఎవరు తక్కువ..? సినిమా యాక్టర్ల కళాసేవ, నాయకుల ప్రజాసేవ సేమ్ సేమ్, సో, అది అసలు ప్రస్తావనార్హమే కాదు… అసలు రాజకీయం దేనికనేదే పెద్ద ప్రశ్న కదా…
6. తెలంగాణ జాగృతి పేరిట ఆమె మొదటి నుంచీ తెలంగాణ ఉద్యమంలో ఉంది… ఎంపీ, ఎమ్మెల్సీ, సింగరేణి కార్మిక సంఘం ఎట్సెట్రా నాయకత్వం, పదవుల అనుభవం కూడా ఉంది… కాకపోతే కవిత, కేటీయార్‌లతో పోలిస్తే హరీష్‌కు కాస్త యాక్సెప్టెన్సీ ఎక్కువ, కేడర్‌లో… జనంలో…
7. కవిత సరే.., కానీ హరీష్ కేసీయార్‌కు సొంత కుటుంబం కాదు, వారసుడూ కాదు… పోనీ, ఇద్దరూ కలిసి వేరే పార్టీ పెడతారా..? పెడతారనే సందేహాలు, ప్రచారాలు సొంత పార్టీలోనే ఉన్నాయి… అందుకే కేటీయార్ హరీష్ ఇంటికి వెళ్లి సుదీర్ఘంగా చర్చలు జరిపాడనే అభిప్రాయాలూ వినిపించాయి…
8. కాంగ్రెస్, బీజేపీ అనే రెండు జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా రెండు తెలంగాణ ఉద్యమం బాపతు, ప్రాంతీయ పార్టీలు ఉంటే తప్పేమిటనే వాదన కొందరు లేవనెత్తుతుంటే… బీఆర్ఎస్ మొన్నటి ఎన్నికలతోనే గణనీయంగా బలహీనపడి, కోలుకోలేకపోతోందని, ఇక చీలిక ఏర్పడితే అది బీజేపీకి ఉపయోగకరం అనే అభిప్రాయాలూ ఉన్నాయి… ఎందుకంటే, ఆల్రెడీ కాంగ్రెస్ పట్ల జనంలో అసంతృప్తి ప్రారంభమైంది….
ఏం జరగనుందో కాలం చెబుతుంది… ఆల్రెడీ కవిత ఓ నిర్ణయానికి వచ్చి ఉంటే మాత్రం, ఇక ఇదే సమయం… ఆమె ఫోన్ల ట్యాపింగ్ కూడా జరిగిందనే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి… ఆమె మీద కూడా కేసీయార్ నిఘా అప్పట్లో… జాగృతిని విస్తరిస్తూ, బలోపేతం చేస్తూ ఆల్రెడీ ఆమె కొన్ని సంకేతాలను తాజాగా ఇస్తోంది కూడా… సామాజిక తెలంగాణ సాధించలేకపోయాం అనేది తండ్రి పాలనకు సొంత కూతురి అభిశంసన ఒకరకంగా..!!
ఇక షర్మిలతో ఆమె పోలిక మాత్రం కరెక్టు కాదు… బేసిక్‌గా షర్మిల రాజకీయ నాయకురాలు కాదు… ఏదో అవసరానికి అప్పట్లో పాదయాత్ర చేసినా సరే… ఎక్కువగా ఆమె మతప్రచారకురాలిగానే తెలుసు… కేవలం అన్నతో ఆస్తి పంపకాల కారణంతో అర్జెంటుగా తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చింది… పొలిటికల్ కార్యక్షేత్రాన్ని ఏపీ గాకుండా తెలంగాణను ఎంచుకోవడమే ఆమెలో నాయకలక్షణాలు లేవనడానికి సూచిక కాగా, ఆమెకు జీరో యాక్సెప్టెన్సీ తెలంగాణ రాజకీయాల్లో… సహజంగానే…
తరువాత ఏపీకి వెళ్లినా సరే… ఎంతసేపూ వివేకా హత్య, జగన్ మీద కోపం వంటివే ఆమె ఎజెండాలో ముఖ్యాంశాలయ్యాయి… ఆమెను అధ్యక్షురాలిని చేస్తే, ఆల్రెడీ జగన్ వెంట ర్యాలీ అవుతున్న కాంగ్రెస్, రెడ్డి సెక్షన్లు ఇక పొలోమంటూ ఆమె వెనుక కదులుతారనేదే కాంగ్రెస్ పార్టీ పిచ్చి భ్రమ… సో, కవితకూ, షర్మిలకూ పోలికే అసంబద్ధం…!
Share this Article