.
చిన్నప్పుడు అదేపనిగా ఏవైనా కొనివ్వమని తల్లిదండ్రుల్ని పిల్లలు మారాం చేస్తుంటే… ఒకింత ఆవేశంగా… పైసలేం చెట్లగ్గాస్తున్నాయనుకుంటున్నావా… అనే మాట వినిపించేది పెద్దల నుంచి. ఆ మాటలే మన తెలంగాణైట్ రాహూల్ కొప్పులను ఇన్స్పైర్ చేశాయి.
అందుకే ఇప్పుడేకంగా ఆ మాటనే నిజం చేసేశాడు రాహూల్. అవునూ పెద్దల తిట్లకు భిన్నంగా… రాహూల్ తల్చినట్టుగానే ఇప్పుడు డబ్బు చెట్లకు కాస్తోంది. హాశ్చర్యపోతున్నారా…? అయితే వినండీ కథ!
Ads
ఒకనాటి ఆదిలాబాద్ జిల్లా… ఇప్పుడు జిల్లా కేంద్రమైన నిర్మల్ రాహూల్ సొంతూరు. రాహూల్ ఓ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. అది మాత్రమే అయ్యుంటే రాహూల్ గురించి ఇంత ముచ్చట
ఉండేది కాదు. 27 ఏళ్ల రాహూల్ కు ఇంజనీరింగ్ చేస్తున్నా… ఎప్పుడూ ఏవో ప్రయోగాలతో అప్డేటవుతున్న స్టార్టప్ ల వైపు తన పయనం సాగేది.
తనకు ఇంజనీరింగ్ సరైన ఫీల్డ్ కాదని కూడా నిర్ణయించుకున్నాడు. అయితే ఎన్నో ప్రయోగాలు చేస్తున్న రాహూల్… పర్యాటక రంగంలో తాను విజయం సాధిస్తానని మాత్రం ఏనాడు కల్లో కూడా ఊహించలేదు.
జిభి… హిమాచల్ ప్రదేశ్ లోని ఓ అద్భుతమైన పర్యాటక క్షేత్రం. పెద్దగా వార్తల్లో వినిపించని, కనిపించని ఈ టూరిస్ట్ హబ్ కు మొదటిసారిగా రాహూల్ 2018లో వెళ్లాడు. అక్కడ వందేళ్లకు పైబడ్డ వృక్షరాజాలు రాహూల్ కంటపడ్డాయి. ఎందుకో వాటితో రాహూల్ కు దోస్తీ కుదిరింది.
అలా కనెక్టైన క్షణాల్లోనే ఓ ఐడియా వచ్చింది. ఆ తర్వాత… ఏదో అడ్వర్టైజ్ మెంట్ లో చెప్పినట్టు ఆ ఐడియా రాహూల్ జీవితాన్నే మార్చేసింది. అలా ఈ పర్యాటక ఔత్సాహికుడు… ది హిడెన్ బరో చైన్ హోటల్స్ రూపకర్తగా, యజమానిగా కోట్లు కొల్లగొడుతున్నాడు.
వందేళ్ల పైబడ్డ వృక్షాలే… జిభీలోని నాల్గు వేర్వేరు ప్రదేశాల్లో రాహూల్ రూపకల్పన చేసిన హోటళ్లకు వేదికలయ్యాయి. అలా చెట్లపైన రాహూల్ నిర్మించిన ది హిడెన్ బరో హోటల్స్ ఇప్పుడు ఓ సక్సెస్ మంత్ర! తానెప్పుడూ చెట్ల పైన నిర్మించిన భవంతుల్లో లేనని.. కానీ, ఇప్పుడు తన వ్యాపారంలో భాగంగా నిర్మించాక ఉంటే ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేకపోతున్నానంటాడు మన రాహూల్ కొప్పుల!!
ట్రీహౌసెస్ ని నిర్మించిన రాహూల్… మన తాతలు అడిగినట్టుగా… డబ్బులేం చెట్లకు కాస్తున్నాయా అంటే… ఇప్పుడు ఎస్ అని చెబుతానంటాడు ఒకింత ఫన్నీగా!
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో ఇంజనీరింగ్ చేసిన రాహూల్… 2016లో ఎంటర్ ప్రెన్యూర్ అవతారమెత్తాడు. దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించినా… అదంతగా సక్సెస్ కాలేదు. ఇంకేం మళ్లీ కాళ్లకు బలపం కట్టాడు. ఎందుకంటే లోకం తిరిగితే వచ్చే జ్ఞానం అంతా ఇంతా కాదని రాహూల్ కు తెలుసు. ఆ బాటలోనే ది హిడెన్ బరో అనే ఐడియాకు బీజం పడింది. తాననుకున్నట్టు ఇప్పుడు ఓ సక్సెస్ ఫుల్ ఎంటర్ ప్రెన్యూరయ్యాడు.
దుస్తుల వ్యాపారం అనుకున్నంత విజయవంతం కాకపోవడంతో… ట్రీహౌసెస్ పై రాహూల్ చూపు పడింది. ఇక యూట్యూబ్ వీడియోస్, ప్రపంచ వ్యాప్తంగా చెట్లపై కట్టిన ఇళ్లు… వాటి వల్ల కల్గే సౌలభ్యాలు, వాటికుండే పరిధులు ఇలా ప్రతీది కూలంకషంగా తెలుసుకునే యత్నం చేశాడు. సరిగ్గా 2018లో జిభీలో… స్థానికంగా ఉండే మేస్త్రీలు, కళాకారుల సాయంతో… తన ఇంజనీరింగ్ బుర్ర ఐడియాలతో ట్రీహౌస్ ను నిర్మించాడు.
కేవలం ఓ పదిలక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టాడు. స్థానికుల నుంచి భూమిని లీజ్ కు తీసుకుని.. జిభీలోని చుట్టపక్కల అడవుల్లో లభించిన కట్టెతో… రాహూల్ నిర్మించిన ది హిడెన్ బరో హోటల్స్ హిమచల్ ప్రదేశ్ లోని కులు, షిమ్లా వంటి ప్రదేశాలకే కాకుండా… ఇప్పుడు పర్యాటకుల్ని జిభీ వైపుకు తిప్పుకుంటున్నాయి.
హిడెన్ బరో హోటల్స్ నిర్మాణానికి ముందు.. కేవలం పది హోటళ్లు కూడా లేని జిభీలో… ఇప్పుడేకంగా పర్యాటక పరిశ్రమ అభివృద్ధి చెంది… 300 హోటల్స్ వెలిశాయి. ఇది స్థానికంగా ఉన్నవారికి ఉపాధిని కల్పించడంతో పాటు… అన్ సంగ్ ప్లేస్ గా ఉన్న జిభీ.. ఇప్పుడు పర్యాటక ప్రదేశంగా వెలుగొందుతోంది.
అన్ని ఖర్చులు పోగా… ఏడాదికి కోటి రూపాయల వరకు ఆదాయంతో ఇప్పుడు మన రాహూల్ కొప్పుల మరిన్ని ది హిడెన్ బరోల నిర్మాణానికై పూనుకుని వార్తల్లో వ్యక్తయ్యాడు…… ( రమణ కొంటికర్ల )
Share this Article