.
Prasen Bellamkonda …….. సంజూ బాబా… ఇవాళ నీ జీవితంలోకి ఓ చాటుమాటు కన్నంలోంచి మళ్లీఇంకోమరోసారి తొంగి చూసాం. గత ముప్పయి సంవత్సరాలుగా మేం చేస్తున్న పనే అనుకో.. కొత్తేం లేదు. గతంలో పేపర్లు కూస్తుంటే టివీలు బ్రేక్ తుంటే చూసీ వినీ అటఅటలుగా గుసగుసలు పోయేవాళ్లం.
నిన్ను టెర్రరిస్టన్నాం. తుపాకులన్నాం. ఆర్డిఎక్సన్నాం. ముంబాయి పేలుళ్ల సూత్రధారి నువ్వే అన్నాం. ఇవాళ రాజ్ కుమార్ హిరానీ ఎకార్డింగ్ టు సోర్సెస్ అనకుండా సెడ్ టుబి అనకుండా టుబి కన్ఫర్ముడు అనకుండా కొన్ని అబద్దాల మీద షటప్పని శుభం కార్డేస్తుంటే కూడా అలాగే వాయరించాం.
Ads
ఓ సంధ్యా సమయాన అటు చూస్తే” ఈ నగరానికేమైంది “ఇటు చూస్తే ” “సంజూ ” … ఎటు పోవాలో తెలియని స్దితిలో బయోపిక్ ల సీజన్ కనుక, మహానటి హాంగోవర్ ఇంకా వదల్లేదు కనుకా కామోసు ఈ సగటు మనిషి మనసు కూడా
నీ వైపే గుంజింది సంజూ.
పుట్టాం పెరిగాం తండ్రి పేరో తల్లి పేరో వంశం గొప్పలో చెప్పుకుని అందరినీ పొగిడేసుకుంటూ కొందరిని మచ్చిక చేసుకుంటూ తొడలు కొట్టుకుంటూ మెడలు గోక్కుంటూ కీర్తికి కన్నం వేసి పిల్లల్ని కని డబ్బు మూటలు దాచేసుకుని సెలబ్రిటీ శేషులమైపోయాం అన్నట్టు బతికేసే వాళ్లెంత గొప్పోళ్లయినా బహుశా బయోపిక్ కు ఇతివ్రుత్తం కాలేరేమో.
ఉథ్థానం ఉండాలి పతనమూ ఉండాలి. నవ్వుమాటు దుఖ్కముండాలి. కన్నీళ్ల చాటు వెలుగు జిలుగులుండాలి. చీకటి కిరణాలుండాలి. సంజయ్ దత్తూ నీకు లోటేముంది. అన్నీ ఉన్నాయి. డ్రగ్సున్నాయి. డబ్బులున్నాయి. స్టార్ ఫామిలీ ఉంది.
ముస్లిం తల్లి హిందూ తండ్రి అదీ మతకల్లోలాల కాలంలో.. ఇంతకంటే ఇంకే కావాలి నీకథ బయోపిక్ కావడానికి.
జైలుంది, టాడా ఉంది, నిన్ను పిచ్చిగా ప్రేమించే నువు కూడా పిచ్చపిచ్చగా ప్రేమించే తల్లీతండ్రీ ఉన్నారు. వీటన్నింటితో పాటు నీ చీకటికి కొంచెం వెలుగునద్దాలనీ నీ మీది నిందలను చెరిపేయాలనీ అనుకునే హిరానీలాంటి మిత్రుడూ ఉన్నాడు.
వీడు మామూలోడు కాడని త్రీఇడియెట్స్ పీకేలతోనే తేలిపోయింది.
ఇప్పుడిక మాల్ మసాలా నిండిన నీ జీవితం దొరికింది కదా చెడుగుడాడేసాడు. కొన్ని సందర్బాలను అటూ ఇటూ చేసినట్టున్నాడు గానీ యమా టైట్ గా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు.
ఇక సంభాషణలయితే కుమ్మేసాడు. ” బట్టల గొప్పదనం నాకు ఎప్పుడు తెలిసొచ్చిందంటే అవి మురికై బిచ్చం పడడం మొదలయాక”
“వాడ్ని సంజయ్ దత్ గానే ఉండనివ్వండి వాడ్ని సునీల్ దత్ చేయాలని ఎందుకనుకుంటున్నారు” “కెమరా ఎవర్నీ క్షమించదు ” “హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి కానీ మన మాట వినవు” వంటి సంభాషణలు కూడా అదరగొట్టేసాడు.
పైగా నీ నకలు చేయడానికి రణ్బీర్ కపూర్ అనేవాడూ దొరికాడు. వాడుకూడా నాయాల్ది ఫుట్బాల్ ఆడేసుకున్నాడు. నువు చూస్తే నేనిక్కడుండి అక్కడ కూడా ఎలా ఉన్నానా అని కంగారడిపోతావ్ మరి.
అమ్మ పంపిన కాసెట్ విన్నతరువాతా, నాన్న చనిపోయిన తరువాత ప్రసంగం సీన్ లో నేనిలా ఉన్నానా అని నీకే అనిపించేట్టు
ఆ రణ్బీర్ నీ కన్నీళ్ల గోరువెచ్చదనంగా భలే మారిపోయాడు తెలుసా.
వీడికి తోడు నీ మిత్రుడి పాత్రలో వాడెవడో విక్కీ కౌషల్ అట చించేసాడులే. జీవితం జైలుపాలయినా టాడా పీడన పడ్డా వీడిలాంటి స్నేహితుడుంటే చాలన్నట్టు చేసాడు.
నర్గీస్ ను మనీషా కొయిరాలా ఒకే ఒక సీన్ లో
పునస్రుష్టించేసింది. సునీల్ దత్ పాత్రను సునీల్ దత్తే అయినా అంత గొప్పగా చేయలేడులే అనిపించేసాడు పరేష్ రావల్.
సినిమా అయిపొయినట్టనిపించిన తర్వాత చివర్లో నువ్వూ నీ డూపూ కలిసి చేసిన పాట చూడ్డానికి వినటానికి చాలా బాగుంది. అర్ధం మరీమరీ బాగుంది సంజూ. మీడియాను నా సామిరంగా గపాగప్ చేసి కసంతా తీర్చుకున్నావుగా…
చివర్లో నిన్నలా చూడడం ఎందుకో భలే బాగుందిలే.
మొత్తంగా నీకు మీడియా చేసిన అన్యాయాన్ని నీ మీద తప్పుడు వార్తలు రాసి నీకు మిగిల్చిన చేదునూ చివరకు కోర్టు నిన్ను అతను
తీవ్రవాది కాదు అని తీర్పు చెప్పినా ఆ మాట రాయని మీడియా దుర్మార్గాన్నీఅద్బుతంగా నీ తరఫు లాయర్ గా డిటెక్టివ్ గా హిరానీ మా కళ్లముందుంచి నీ మచ్చల్ని తుడిపేసే ప్రయత్నం గొప్పగా చేసాడు.
ఇంతకాలం నీ జీవితపు కన్నంలోకి తొంగి చూసినపుడు కనపడ్డ అబద్దాలు మమ్మల్ని సంబరపెట్టాయి. ఇవాళ చూసిన చూపుకు అవన్నీ అబద్దాలేననీ నీది కేవలం రిచ్ డాడ్స్ స్పాయిల్డ్ చైల్డ్ కథేననీ నీది బాధ్యతారాహిత్య జీవన విధానమనీ, నీది అమాయక ప్రేమ ప్రతిచర్య అనీ, నీ మీద మీడియా కోరలు చాచిందనీ తెలియడం కూడా సంబరంగానే ఉంది.
సంజూ..
అసందర్బం అయితే అవచ్చు గానీ
మావాళ్లు కొన్ని పాత్రలు చేయడానికి కొందరు దొరకరు కనుక కొన్ని రీమేక్ లు కుదరవు అని ఏవేవో సొల్లు కబుర్లు చెపుతున్నారు గానీ మొన్న కీర్తి సురేష్ నీ ఇవాళ రణ్ బీర్ కపూర్ నీ చూసాక గుండమ్మ కథ సూర్యకాంతం ఎక్కడో ఉండే ఉంటుంది వెతకండ్రా బాబూ అని మా వాళ్లకు చెప్పాలనుంది.. నువ్వూ ఓమాట చెప్పవూ…
(Hotstar, Netflix లలో ఉంది... 60 కోట్లతో తీస్తే 600 కోట్ల వసూళ్లు... ఇది 2018 నాటి పాత రివ్యూయే... ఇప్పుడు చూసినా సినిమా సూపర్‌గానే ఉంది...)
Share this Article